Sunday, January 19, 2025
HomeTrending Newsఇరాన్ - పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తత

ఇరాన్ – పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తత

ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లో ఐసిస్ ఉగ్రవాదుల అరాచకాలతో గల్ఫ్ దేశాలు సతమతం అవుతున్నాయి. ఇప్పుడు ఇరాన్, పాకిస్తాన్ దేశాల మధ్య నిప్పు రాజుకుంటోంది. షియా జనాభా అధికంగా ఉండే ఇరాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో సున్నీ తెగవారు కొందరు ఉన్నారు. ఇరాన్ లో షియా ఆధిపత్యం – పాకిస్తాన్ లో సున్నీతెగ వారు మెజారిటీగా ఉన్నారు.

ఇరాన్ లోని సిస్తాన్-బలూచిస్తాన్ రాష్ట్రం సరవణ్‌ నగరంలో తొమ్మిది మంది పాకిస్థానీలను గుర్తు తెలియని వ్యక్తులు శనివారం కాల్చి చంపారు.  ఈ హత్యలకు ఎవరు పాల్పడ్డారనేది తెలియరాలేదు. తమ పౌరులు హత్యకు గురికావడంపై పాకిస్థాన్‌ తీవ్రంగా స్పందించింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, క్రూరమైన నేరానికి పాల్పడిన వారిని పట్టుకోవాలని పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి ముంతాజ్‌ జహ్రా బలోచ్‌ ఆదివారం డిమాండ్‌ చేశారు.

పాక్ లోని బలూచిస్థాన్‌ ప్రాంతంలో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఇరాన్‌ ఈ నెల 16న క్షిపణి దాడులు చేసింది. జైష్‌ అల్‌ అదిల్‌ స్థావరాలపై దాడులు చేసినట్టు ఇరాన్‌ వెల్లడించింది. ఇరాన్‌ దాడుల్లో ఇద్దరు పిల్లలు మరణించారని పాక్‌ పేర్కొన్నది. తమ దేశంలోని ఇరాన్‌ రాయబారిని బహిష్కరించిన పాక్‌.. ఇరాన్‌లోని తమ రాయబారిని వెనక్కు పిలిచింది. ఇరాన్‌ దాడులకు ప్రతిగా పాక్‌ కూడా జనవరి 18న సిస్థాన్‌-బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని ఉగ్రవాదుల స్థావరాలు లక్ష్యంగా దాడులు చేసింది. ఈ దాడుల్లో తొమ్మిది మంది మరణించారు.

ఉద్రిక్తతలు చల్లార్చాలని, దౌత్య కార్యకలాపాలను పునరుద్ధరించుకోవాలని నిర్ణయం తీసుకొన్నట్టు రెండు దేశాలు గత సోమవారం ప్రకటించగా.. తాజాగా కాల్పుల ఘటన చోటుచేసుకొన్నది. ఇరాన్‌ విదేశాంగ మంత్రి హుస్సేన్‌ చర్చల కోసం ఇస్లామాబాద్‌లో పర్యటించడానికి ఒక రోజు ముందు ఈ ఘటన జరగడం గమనార్హం.

వివాదం రాజుకోవటానికి ముఖ్యమైన కారణాలు

దశాబ్దాల క్రితం బలూచిస్తాన్ ను మూడు ముక్కలు చేసి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్ పంచుకున్నాయి. దీంతో ఏళ్ళతరబడి తమకు స్వపరిపాలన, ప్రత్యేక దేశం కావాలని మూడు దేశాల్లోని బలూచ్ లు పోరాటం చేస్తున్నారు. ఉపాధి లేక పేదరికంలో ఉన్న బలూచి జాతి వారు జీవనోపాధి కోసం సరిహద్దుల్లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలకు పావులుగా మారారు. మరోవైపు ఇస్లామిక్ జిహాదీలు వీరితో సరిహద్దుల్లో అశాంతి సృష్టిస్తున్నారు.

ఇరాన్ – ఇరాక్ మధ్య వైరానికి కారణమైన షియా సున్ని గొడవలు పాకిస్తాన్ లో ప్రభావం చూపాయి. పాకిస్తాన్ లో సున్నీ అతివాదులు మైనారిటీ షియాల మీద దాడులు చేస్తూ ఉచకోతకు పాల్పడుతున్నారు. దీంతో ఇరాన్ లో అతివాద షియాలు సున్నీలను హతమారుస్తున్నారని సమాచారం.

పాకిస్తాన్ లో ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతోంది. ఈ తరుణంలో తెహ్రీక్ తాలిబాన్ ఏ పాకిస్తాన్(TTP), జైష్‌ అల్‌ అదిల్‌ ఉగ్రసంస్థలు స్వాతంత్రం కోసం పోరాడుతున్న బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సహకరిస్తూ ఈ ప్రాంతంలో అలజడులు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఆఫ్ఘన్ – పాక్ సరిహద్దులు, ఇరాన్ – పాక్ సరిహద్దులు కేంద్రంగా దాడులకు తెగపడుతున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్