Friday, March 29, 2024
HomeTrending Newsపాపులర్‌ ఫ్రంట్‌ కు ఉగ్రవాద లింకులు?

పాపులర్‌ ఫ్రంట్‌ కు ఉగ్రవాద లింకులు?

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయాల మీద దాడులకు నిరసనగా ఈ రోజు కేరళలో బంద్ పాటించారు. బంద్ సందర్భంగా కొన్ని చోట్ల అల్లర్లకు పాల్పడ్డా పోలీసులు అదుపు చేశారు. ముస్లీం యువకులను పాపులర్ ఫ్రంట్ లో చేర్చుకొని ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నారని NIA తనిఖీల్లో వెలుగులోకి వస్తోంది.

తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయాలు, ఆ సంస్థ సభ్యుల ఇళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బృందాలు దాడులు చేపట్టాయి. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఉగ్రవాద శిక్షణ శిబిరాల నిర్వహణ, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడడం, నిషేధిత సంస్థల్లో చేరేలా ప్రజలను ప్రోత్సహించడం వంటి కేసులకు సంబంధించి.. మొత్తం 93 చోట్ల దాడులు నిర్వహించి 106 మందిని అరెస్టు చేశాయి. దాదాపు 300 మంది అధికారులు గురువారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచే ఈ మెరుపుదాడులు ప్రారంభించారు. అత్యధికంగా కేరళలో 22 మందిని అరెస్టు చేయగా.. మహారాష్ట్ర, కర్ణాటకల్లో 20 చొప్పున, తమిళనాడులో 10 మంది, అసోంలో 9, ఉత్తరప్రదేశ్‌లో 8 మందిని, ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురిని, మధ్యప్రదేశ్‌లో నలుగురిని, పుదుచ్చేరి, ఢిల్లీల్లో ముగ్గురు చొప్పున, రాజస్థాన్‌లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పీఎ్‌ఫఐ ప్రమేయం ఉన్న 19 కేసుల్లో దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ.. 5 కేసులకు సంబంధించి 45 మందిని గురువారం అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు.

ఎన్‌ఐఏ అరెస్టు చేసినవారిలో 19 మంది ఒక్క కేరళ నుంచే ఉన్నారు. తమిళనాడు (11), కర్ణాటక (7), ఆంధ్రప్రదేశ్‌ (4), రాజస్థాన్‌ (2), యూపీ (1), తెలంగాణ (1) రాష్ట్రాల్లో మిగతావారిని అరెస్టు చేసింది. ఈ సోదాల్లో పలు పత్రాలను, ఆయుధాలను, ఇస్లామిక్‌ ఉగ్రవాద సాహిత్యాన్ని, కంప్యూటర్లను, ల్యాప్‌టా్‌పలు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్‌ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది.. అరెస్టయినవారిలో పీఎఫ్ ఐ చైర్మన్‌ ఒ.ఎం.ఎ.సలాం, ఢిల్లీ పీఎఫ్ ఐ చీఫ్‌ పర్వేజ్‌ అహ్మద్‌ కూడా ఉన్నారు. వీరంతా ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నిర్వహించడం, ఆయా ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రజలను ప్రోత్సహించడం వంటి నేరాలకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు. వారి హింసాత్మక చర్యలతో ప్రజల మనసులపై ప్రత్యక్ష ప్రభావం పడుతోందని ఎన్‌ఐఏ తన ప్రకటనలో వివరించింది. కాగా.. వివిధ రాష్ట్రాల్లో దాడులు జరుగుతున్న చోటకు ముస్లిం యువత చేరుకుని ‘ఎన్‌ఐఏ గో బ్యాక్‌’ నినాదాలతో హోరెత్తించారు. మరికొన్ని చోట్ల దాడులను అడ్డుకునే ప్రయత్నం చేసినా స్థానిక పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

2020లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల వెనుక, యూపీలోని  హాత్రాస్ లో దళితమహిళపై సామూహిక హత్యాచారం ఘటన నేపథ్యంలో మతవిద్వేషాలు రేపే కుట్ర వెనుక పీఎఫ్ ఐ ఆర్థిక లింకులపై ఈడీ ఆరా తీస్తోంది. పీఎఫ్ ఐ పైన, ఆ సంస్థ పదాధికారులపైన లఖ్‌నవూలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ (నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం) కోర్టులో రెండు అభియోగపత్రాలు దాఖలు చేసింది. వీటిలో ఒకటి గత ఏడాది ఫిబ్రవరిలో దాఖలు చేసింది. 2020లో హాత్రాస్ లో దళిత మహిళ సామూహిక హత్యాచారం అనంతరం మతవిద్వేషాలు రేపడానికి, తీవ్ర భయోత్పాతాన్ని సృష్టించడానికి పీఎఫ్ ఐ, ఆ సంస్థ సభ్యులు కృషి చేశారని అందులో పేర్కొంది. ఇందుకు అవసరమైన వనరుల కోసం మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు వెల్లడించింది.

పీఎఫ్ ఐ కేసులో మూడు రోజుల వ్యవధిలోనే తెలంగాణలో రెండోసారి ఎన్‌ఐఏ ప్రత్యేక బృందాలు తనిఖీ చేశాయి. గురువారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌ పాతబస్తీతోపాటు మేడ్చల్‌, ఘట్‌కేసర్‌, ఉప్పల్‌లోని పీఎఫ్ ఐ కార్యాలయాల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేశారు. చాంద్రాయణగుట్టలోని పీఎ్‌ఫఐ కార్యాలయంలో ఉదయం 3 గంటల నుంచి 7 గంటల దాకా సోదాలు చేసి కీలకపత్రాలు, హార్డ్‌ డిస్క్‌, పెన్‌డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాన్ని సీజ్‌ చేసి.. మాదాపూర్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయంలో నిర్వాహకులు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు అంటించారు. హైదరాబాద్‌తోపాటు నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ల్లో ఎన్‌ఐఏ, ఈడీ సోదాలు కొనసాగాయి. ఒక్క కరీంనగర్‌లోనే ఎనిమిది చోట్ల సోదాలు చేశారు. నిజానికి ఈ నెల 18న కరీంనగర్‌లోని హుస్సేనిపురలో ఒక ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ అధికారులు.. జగిత్యాలకు చెందిన మొహమ్మద్‌ ఇర్ఫాన్‌ అహ్మద్‌ అనే పీఎఫ్ ఐ కార్యకర్తను అరెస్టు చేశారు.

అతణ్ని హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించి విచారించారు. అతడిచ్చిన సమాచారంతోనే గురువారం కరీంనగర్‌లో మరికొందరు పీఎఫ్ ఐ కార్యకర్తలు, సానుభూతిపరుల ఇళ్లలో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక.. ఎన్‌ఐఏ దాడులకు కారణమైన ఐదు కేసుల్లో ఒకటి నిజామాబాద్‌ జిల్లాకు చెందిందని అధికారులు తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పీఎఫ్ ఐ సభ్యులపై గత జూలైలో నిజామాబాద్‌ 4వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఎన్‌ఐఏ అధికారులు.. దర్యాప్తులో లభించిన సమాచారం మేరకు గత ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి నలుగురు పీఎ్‌ఫఐ నాయకుల్ని అరెస్ట్‌ చేశారు. నిందితుల రిమాండ్‌ రిపోర్టులో పీఎ్‌ఫఐ కార్యకలాపాలకు సంబంధించిన సంచలన విషయాల్ని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. నిజామాబాద్‌ ఆటోనగర్‌కు చెందిన అబ్దుల్‌ ఖాదర్‌ శరీర దారుఢ్య శిక్షణ ముసుగులో..  ఇనుపరాడ్డు, కత్తి, కొడవలి వంటి ఆయుధాలతో ఓ వర్గానికి చెందిన వారిపై దాడిచేసి మట్టుబెట్టే విధానాలపై శిక్షణ ఇస్తున్నట్లు ఆరోపించింది. అబ్దుల్‌ ఖాదర్‌కు పీఎఫ్ ఐ నాయకుల నుంచి పెద్దమొత్తంలో నిధులు అందాయని, ఆ నిధులతోనే తన ఇంటిపై నిర్మాణం చేసి కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు రిమాండ్‌ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది.

Also Read : శ్రీనగర్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

RELATED ARTICLES

Most Popular

న్యూస్