Saturday, January 18, 2025
HomeTrending Newsకాశ్మీర్ నుంచి జమ్మూ విస్తరించిన ఉగ్ర దాడులు

కాశ్మీర్ నుంచి జమ్మూ విస్తరించిన ఉగ్ర దాడులు

కాశ్మీర్ లోయలో తరచుగా ఉగ్రవాదుల కదలికలు ఉండేవి. చలికాలం ఆక్రమిత కాశ్మీర్ నుంచి చొరబాట్లు అధికంగా జరిగేవి. ఉగ్రవాదుల కన్ను ఇప్పుడు జమ్మూ ప్రాంతంపై పడింది. వారం రోజులుగా జమ్మూ కాశ్మీర్ రక్త సిక్తం అవుతోంది. దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. వారం రోజుల్లో జమ్ము రీజియన్‌లో ఇది రెండో పెద్ద ఎన్‌కౌంటర్‌.

దోడా జిల్లా దెసా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భారత సైన్యం, స్థానిక పోలీసులు సోమవారం రాత్రి 7.45 గంటలకు సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టారు. టెర్రరిస్టులు, భద్రతాసిబ్బందికి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు సైనిక సిబ్బందితోపాటు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని దవాఖానకు తరలించగా ఆర్మీ అధికారితోపాటు మరో ముగ్గురు జవాన్లు మరణించారని అధికారులు తెలిపారు.

రాత్రి 9 గంటల సమయంలో ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైందని, భారీ కాల్పులు జరిగాయని ఇండియన్‌ ఆర్మీ ఎక్స్ వేదికగా ప్రకటించింది. 20 నిమిషాలకుపైగా కాల్పులు జరిగాయని పేర్కొంది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్థాన్‌ ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌కు చెందిన కశ్మీర్‌ టైగర్‌ ప్రకటించింది.

గత వారం కథువాలో ఐదుగురు సైనికులు మరణించిన తర్వాత జమ్మూ ప్రాంతంలో ఇది రెండవ పెద్ద ఎన్‌కౌంటర్. ఉగ్రవాదులు 500 మీటర్ల దూరంలోని ట్రక్కులను లక్ష్యంగా చేసుకుని గ్రెనేడ్‌లతో తెగపడ్డారు. M4 అసాల్ట్ రైఫిల్‌ తో బులెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించిన ఉగ్రవాదులు ఆధునిక సాంకేతికత ఉపయోగించారు.

కనీసం 12 మంది సైనికులు ఉన్న రెండు ట్రక్కులపై సమన్వయంతో దాడులు చేశారు. ఈ దాడిలో ఐదుగురు సైనికులు కూడా గాయపడ్డారు. కాశ్మీర్ లోయలోని పూంచ్, రాజౌరీ జిల్లాల్లో మొదలైన ముష్కర మూకల దాడులు.. ఉగ్రవాదం ఆనవాళ్ళు లేని జమ్మూ అంతటా ఇప్పుడు విస్తరించాయి. జమ్మూ ప్రాంతంలో గత 32 నెలల్లో 48 మంది సైనికులు మరణించారు.

370 ఆర్టికల్ రద్దు తరవాత ఉగ్రవాదులు జమ్మూ ప్రాంతంలో అలజడి సృష్టించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల నిమిత్తం జమ్మూ ప్రాంతానికి అధికంగా వెళుతున్నారు.

జమ్ములో భూముల క్రయవిక్రయాలు అధికంగా జరుగుతున్నాయి. ఇదే ధోరణి సాగితే తొందరలోనే కాశ్మీర్ కు పాకే  అవకాశముందని… ఆదిలోనే అడ్డుకోవాలని ఉగ్రవాదులు ప్రశాంతంగా ఉండే జమ్ములో మారణహోమానికి తెగపడుతున్నారు.

జవాన్ల ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాదులు త్వరలోనే మూల్యం చెల్లించుకుంటారని ఆర్మీ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. జమ్ములో పరిస్థితిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్… ఆర్మీ చీఫ్ తో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఉగ్రవాదుల కేంద్ర స్థానాలను తుత్తునియలు చేసేందుకు భారత బలగాలు సన్నద్ధం అయ్యాయని ఢిల్లీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్