Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅమెరికా విషాదం

అమెరికా విషాదం

Whom to blame: ఎంత చెట్టుకు అంత గాలి. అమెరికా అత్యంత సంపన్న దేశమే కావచ్చు. పల్లెటూరు మొదలు మహా పట్టణాల దాకా మౌలిక వసతులు లెక్కలేనన్ని ఉండవచ్చు. అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలన్నీ అరచేతిలో అందుబాటులో ఉండవచ్చు. ఇంకా ఎన్నెన్నో సుందర స్వప్నాలు సిగ్గుపడే సౌలభ్యాలు ఉండి ఉండవచ్చు. కానీ…అమెరికాను పట్టి పీడించే పెను సమస్యలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది- తుపాకులు. రెండోది- మత్తు పదార్థాలు.

అమెరికా జనాభా 33కోట్లు. అమెరికాలో తుపాకుల సంఖ్య 39 కోట్లు. తలకు ఒక తుపాకీ కంటే ఎక్కువగానే ఉన్నాయి. ఇంతకంటే అమెరికా తుపాకుల విధ్వంసం, విషాదాలకు వివరణ అక్కర్లేదు.

తుపాకుల నేపథ్యం
అయిదారు వందల సంవత్సరాల అమెరికా భూభాగం చరిత్ర, దాదాపు 250 ఏళ్ల క్రితం ఏర్పడ్డ అమెరికా దేశ చరిత్ర తెలుసుకుంటే తప్ప తుపాకీ ఒక నిత్యావసరంగా వారికి ఎందుకు అలవాటయ్యిందో అర్థం కాదు. యూరోప్ తో పాటు మిగతా దేశాల వారు అక్కడికి వెళ్ళేదాకా అక్కడ ఉన్నది స్థానిక తెగలే. వారి మీద పెత్తనానికి వలస వచ్చిన సంపన్నులు తుపాకులు పట్టుకున్నారు. సందు దొరికితే చాలు సంపన్నులను దోచుకోవడానికి స్థానిక తెగలు ఎగబడేవారు. వేల మైళ్ళ దూరం ప్రయాణించినా జనావాసాలు దొరకని చోట తుపాకీలే నమ్మకమయిన తోడు నీడ అయ్యాయి. సహజంగా భయమున్నవారే ఆయుధ రక్షణ కోరుకుంటారు.

అప్పుడు అమెరికాకు అలవాటయిన ఆయుధం ఇప్పుడు ఆభరణమయ్యింది. అయిదు వందల ఏళ్ల కిందటి అనాగరిక జీవన విధానం ఇప్పుడు అమెరికాలో లేకపోయినా…ఆ అనాగరిక తుపాకీ సంస్కృతి మాత్రం అలాగే ఉండిపోయింది. మానవ నాగరికతలో కొన్ని మాయని మచ్చలు అలా ఉండిపోతాయి. తుపాకులను నిర్మూలన చేసి…ఆయుధ వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేమా? అని సాక్షాత్తు అమెరికా సర్వంసహా అధ్యక్షుడు బేలగా కన్నీరు కారుస్తున్నారంటే…అమెరికాలో తుపాకీ సంస్కృతిని పూర్తిగా తుడిచిపెట్టడం అసాధ్యమని తెలుస్తూనే ఉంది.

ఆయుధ వ్యాపారుల లాబీయింగ్
అమెరికా ఆర్థిక బలాన్ని విశ్లేషించే అంతర్జాతీయ సమాజం ఎగతాళిగా ఒక మాట అంటూ ఉంటుంది. అమెరికాను శాసించేది ఆయుధ, ఫార్మా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ వ్యాపారులు; డ్రగ్స్ మాఫియా. తను పెంచిన వ్యవస్థలు తననే మింగేస్తున్నా, నియంత్రిస్తున్నా ఏమీ చేయలేని బేలతనం అమెరికాది. మిగతా రంగాల సంగతి ఇక్కడ అనవసరం.

గన్ కల్చర్ అమెరికా సంస్కృతిలో ఒక భాగం. మన దగ్గర కూరగాయలు అమ్మినట్లు, కొన్నట్లు విచ్చలవిడిగా అమెరికాలో తుపాకులు అమ్మవచ్చు. కొనవచ్చు. తుపాకుల వాడకం మీద కనీసం కొన్ని ఆంక్షలయినా పెడదామని ప్రయత్నాలు జరుగుతుంటాయి కానీ…ఆ ప్రయత్నాలను తుపాకీ లాబీ తుపాకీ అడ్డుపెట్టి…మొగ్గలోనే తుంచేస్తూ ఉంటుంది.

ఏటా అమెరికాలో ఎన్ని వేల మంది అకారణంగా తుపాకులకు బలై సంఖ్యలుగా మారిపోతుంటారు? ఏటా ఎన్ని లక్షల కోట్ల ఆయుధ వ్యాపారం అమెరికాలో జరుగుతోంది? అన్న లెక్కలు తెలిస్తే…తుపాకీ చూడకుండానే మన గుండెలు జారిపోతాయి.

తాజాగా టెక్సాస్ దగ్గర స్కూల్లో పద్దెనిమిదేళ్ల యువకుడు దాదాపు పాతిక మందిని తుపాకీతో పొట్టన పెట్టుకున్న విషాదం మొదటిదీ కాదు. చివరిదీ కాబోదు.

రోగం ఒకటయితే…మందు మరొకటి వేస్తోంది అమెరికా. ఇలాంటి విషాద సమయంలో శ్వేత సౌధం మీద దేశ జెండాను అవనతం చేసి…నిట్టూర్చి…ఏడ్చి మొహం కడుక్కుని…మళ్లీ రోజువారీ ఊపిరి సలపని పనుల్లో పడిపోవడం అమెరికాకు అలవాటయిపోయింది.

అమెరికా సంయుక్త రాష్ట్రాలు అన్న పేరులోనే…అంతకు ముందు సంఘటితంగా లేని విడి విడి రాష్ట్రాలను ఎవరో ఎప్పుడో సంఘటితం చేయడం వల్లే “సంయుక్త” విశేషణ పూర్వపదం అవసరమయ్యిందని తెలుస్తూనే ఉంది. దేశ చట్టాలకు తోడు ఒక్కో రాష్ట్రంలో ఇప్పటికీ ప్రత్యేక చట్టాలు, నిబంధనలు ఉన్నాయి.

భయం లేని సమాజమే నాగరికతా వైభవానికి ఒకానొక కొలమానం. అంతులేని స్వేచ్ఛ అమెరికా అనుభవిస్తూ ఉండి ఉండవచ్చు. అంతే అభద్రత, భయాలు కూడా అమెరికా వెంటపడుతున్నాయి. సూపర్ బజార్లో తుపాకీ కాల్పులు; గ్యాస్ స్టేషన్లో కాల్పులు, స్కూళ్లలో కాల్పులు…నల్లవారి మీద కాల్పులు...అమెరికాలో ఏదో ఒక మూల నిత్యం తుపాకీ కాల్పులు జరుగుతూనే ఉంటాయి. పోయే ప్రాణాలు పోతూనే ఉంటాయి.

అమెరికా నిర్మించే హాలీవుడ్ సినిమాలు కూడా వారి సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. అమెరికా సినిమాల్లో తుపాకులను, విధ్వంసాన్ని మినహాయిస్తే చూడ్డానికి ఇక ఏమీ ఉండదు.

కత్తి డాక్టరు చేతిలో ఉంటే అది వైద్యం. డాక్టరు గుండె కోస్తే…ఒకవేళ రోగి పోయినా…అది శస్త్ర చికిత్స.
కత్తి మన చేతిలో ఉంటే అది నేరం. మనం గుండె కోస్తే…ఆ మనిషి బతికే ఉన్నా…పోయినా…అది హత్యాప్రయత్నం లేదా అక్షరాలా హత్యా నేరం.

ఎవరి చేతిలో తుపాకీ ఉండాలి?
ఎవరి చేతిలో తుపాకీ ఉండకూడదు?
అన్న మౌలికమయిన ప్రశ్నలకు అమెరికా సమాజం సమాధానం వెతుక్కోనంత కాలం…తుపాకులు నిర్నిరోధంగా గుండ్లను వర్షిస్తూనే ఉంటాయి. తుపాకీ తూటాలకు అమాయక గుండెలు నేల రాలిపోతూనే ఉంటాయి. పోయిన ప్రాణాలకోసం ఉన్నవారి కళ్లు వర్షిస్తూనే ఉంటాయి.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

నెత్తుటి నెగళ్లలో లాభాల సాగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్