మనం రాకెట్ యుగం, రోబో యుగం అని గొప్పలు వింటూ ఉంటాం గానీ, ఇప్పటికీ వెనకబడి ఉన్న ప్రాంతాల గురించి వింటే అభివృద్ధి ఎవరికోసం అనిపిస్తుంది. దక్షిణాఫ్రికాలో అటువంటి ప్రాంతాలు , ఇళ్ళు అనేకం. కొన్నిప్రాంతాల్లో పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వెళ్లేసరికి విద్యుత్ ఉండదు. అసలు స్కూలు నుంచి ఇంటికి వెళ్లడమే ఒక సాహస యాత్ర. చాలా దూరం నడవాలి. దారిలో అపాయాలూ పొంచి ఉంటాయి. అయినా త్వరగా ఇల్లు చేరి హోంవర్క్ రాసుకోవాలి. చీకటి పడితే కరెంటు ఉండదుగా మరి. ఈ బాధలన్నీ కళ్లారా చూసి ఏదన్నా చేయాలనుకుంది రూస్టన్బుర్గ్ కి చెందిన 21 ఏళ్ళ థాతో గాట్లన్యే.
బాగా అలోచించి మరి కొందరితో కలసి ‘రీ పర్పస్ స్కూల్ బాగ్స్’అనే సంస్థ నెలకొల్పింది. వీళ్ళు పిల్లల పాత ప్లాస్టిక్ బాగ్స్ తీసుకుని పర్యావరణ హితమైన బాక్ ప్యాక్ స్కూల్ బాగ్స్ గా మార్చి ఇస్తారు. ఈ బాగ్స్ కి సౌర ఫలకాలు అమర్చడం వల్ల పిల్లలు స్కూల్ కు నడచివెళ్లేసరికి ఛార్జ్ అవుతాయి. రాత్రి ఈ సౌర విద్యుత్ సాయంతో ఇళ్ళల్లో లైట్లు వెలిగి హోమ్ వర్క్ చేసుకుంటారు. అంతే కాదు, పిల్లలు చీకటిలో క్షేమంగా నడిచేలా కూడా డిజైన్ చేశారు.
ఆరునెలలపాటు ప్రయోగాత్మకంగా పరిశీలించాక రీ పర్పస్ సంస్థ రాస్తెన్బుర్గ్ లో బ్యాగుల పంపిణీ ప్రారంభించింది. స్థానిక వ్యాపారులు, ఇతరులు స్కూల్స్, తరగతుల వారీగా ఇందుకు సహాయం చేస్తున్నారు.
తొందరగానే రీ పర్పస్ స్కూల్ బాగ్స్ సంస్థ విస్తరించింది. ప్రస్తుతం ఎనిమిది మంది పనిచేస్తుండగా, అంతా మహిళలే. రోజుకు 20 బాగ్స్ తయారు చేస్తున్నారు. ఇదంతా అంత సులభంగా ఏమీ జరగలేదు. ప్లాస్టిక్ రీ సైకిల్ చెయ్యడానికి తగిన ప్రదేశం, ఉద్యోగులకు శిక్షణ నివ్వడంలో సమస్యలు వచ్చాయి. దీన్ని ఎదుర్కోడానికి థాతో, ఆమె టీం రీ సైక్లింగ్ ప్రోగ్రాం రూపొందించారు. పిల్లలు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలను తెచ్చి ఇచ్చేలా కృషి చేశారు. చాలామంది పిల్లల ఇంటిలో వారానికి ఒక కొవ్వొత్తి వాడతారు. దాంతో ఆ వెలుగు వారి చదువుకు సరిపోవడం లేదు. బ్యాగ్ లకు సోలార్ పానెల్స్ పెట్టాక పిల్లలకు కొవ్వొత్తుల వాడకం తగ్గిపోయింది . ఆ ఖర్చు ఆదా అయింది. స్థానిక పిల్లల్లో ఈ విషయమై పెరిగిన అవగాహన గర్వకారణంఅంటుంది థాతో . ఈ విధంగా పేరుకున్న చెత్త వదిలించుకోడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు.
మరింతమందిని ఉద్యోగులను నియమించి ఉత్పత్తుల శ్రేణి విస్తరించాలని రీ పర్పస్ స్కూల్ బాగ్స్ ఆలోచన. తద్వారా వచ్చే లాభాలతో ఇంకా ఎక్కువమంది పిల్లలకు స్కూల్ బాగ్స్ అందించవచ్చని ఆలోచన. బాగుందికదా!
-కె. శోభ