Sunday, November 24, 2024

మేవాడ్ కథలు-5

ఇప్పుడంటే ప్రత్యర్థిమీద గెలవడానికి చాలా సులభమైన మార్గాలున్నాయి. బోడి పెంపుడు వేటకుక్కలను ఉసిగొలిపి… వదిలినా చాలు. చచ్చినట్లు శరణాగతి చొచ్చి యుద్ధసీమలో శంఖారావం పూరించడానికి ముందే కాళ్లమీద పడి…కనికరించమని శత్రువే వేడుకుంటాడు. సభా మర్యాద దృష్ట్యా చెప్పడానికి వీలుకాని ఇంకా ఎన్నెన్నో క్షుద్రవిద్యల ద్వారా ఇప్పుడు గెలుపు చిటికెలో పని. వెన్నుపోట్లు కూడా పొడవకుండానే కూర్చున్న చోట కూర్చున్నట్లుగానే ఉండి శత్రువు అంతు చూడవచ్చు. యుద్ధం చేయకుండానే విజయాన్ని వరించవచ్చు. లేదా విజయాన్ని శాశ్వతంగా అనుభవిస్తూనే ఉండవచ్చు. ఒకప్పుడు అలా కాదు కదా! యుద్ధమంటే అక్షరాలా యుద్ధమే. ఏనుగునెక్కి, గుర్రమెక్కి రాజు యుద్ధసీమకు వెళ్లాల్సిందే. అక్కడ ఇనుప కవచాలు, తోలు కవచాలు తొడుక్కుని, శిరస్త్రాణం ధరించి…చేత డాలు, కత్తి పట్టి శత్రువుతో ముఖాముఖి, బాహాబాహీ తలపడాల్సిందే. తుది రక్తపు బొట్టుదాకా వీరోచితంగా పోరాడాల్సిందే. “విజయమో! వీరస్వర్గమో! రారా! తేల్చుకుందాం!” అని మీసం దువ్వి శత్రువుమీద విరుచుకుపడాల్సిందే. గెలిస్తే రాజ్యం- పోతే వీరమరణం అనుకుని ఒరలోనుండి కత్తి తీసి దూయాల్సిందే.

అలా అయిదు శతాబ్దాల క్రితం యుద్ధసీమలో నిలుచున్న మేవాడ్ రాజు మహారాణా ప్రతాప్ (1540-1597) దగ్గరికి వెళితే…ఒళ్లు పులకించిపోతుంది. ఆ ధైర్యం మనలో ఏదో తెలియని ఆవేశం నింపుతుంది. చూడ్డానికి రెండు కళ్లు చాలవు. మరాఠా మహాసామ్రాజ్య నిర్మాత ఛత్రపతి శివాజీ(1630-1680)కి స్ఫూర్తిప్రదాత అయిన మహారాణా ప్రతాప్ గురించి తెలుసుకోకపోతే భారతీయ చరిత్రలో సువర్ణాక్షర లిఖితమైన చాలా విలువైన పుటలు చూడనట్లే. శత్రువులు గుంపులు కట్టి వస్తున్నా ఆరావళి పర్వతమంత ఎత్తులో సింహంలా ఒకడే నిలుచున్న ప్రతాప్ ప్రతాపం తెలుసుకోకపోతే భారతీయుడు అని చెప్పుకునే అర్హత కోల్పోతాం.

మేవాడ్ రాజుగా 32 ఏళ్ల వయసులో 1572లో పట్టాభిషిక్తుడైన మహారాణా ప్రతాప్ 57ఏళ్ల వయసులో చనిపోయేదాకా మొఘల్ ముస్లిం రాజులతో అలుపెరుగని యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. రాణా ప్రతాప్ రాజుగా పగ్గాలు చేపట్టే నాటికే ఉత్తర భారతంలో చాలా రాజ్యాలు మొఘలులకు సామంత రాజ్యాలుగా అణిగిమణిగి పడి ఉన్నాయి. అలాగే మేవాడ్ ను కూడా తలదించుకుని పడి ఉండమని మొఘల్ చక్రవర్తి అక్బర్… రాణా ప్రతాప్ ను బెదిరించాడు. రాయబారులను పంపాడు. మాట వినకుంటే అంతు చూస్తానని హెచ్చరించాడు.

“ఈరోజు చస్తే రేపటికి ఒకరోజు- ఈరోజు గెలిస్తే రేపటికి ఒక చరిత్ర” అన్నది మహారణా ప్రతాప్ నమ్మిన సిద్ధాంతం. “మొఘలులకు సామంత రాజ్యంగా తలదించుకుని బతికే ప్రసక్తే లేదు…మేవాడ్ ను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు…యుద్ధానికి సిద్ధం” అని రాయబారులకు తెగేసి చెప్పాడు. 1576 లో ఇప్పటి రాజస్థాన్ రాజ్ సమంద్ ప్రాంతంలో హల్దీఘాటిలో మొఘల్ సేనలతో భయంకరమైన యుద్ధం జరిగింది. ఇందులో అక్బర్ స్వయంగా పాల్గొన్నాడా లేదా అన్న విషయంలో కొంత అస్పష్టత ఉన్నట్లుంది. రాణా ప్రతాప్ మాత్రం స్వయంగా ముందుండి వీరోచితంగా పోరాడాడు. మొఘలుల తరపున మాన్ సేన్ సైన్యం దాదాపు పదివేలమంది. రాణా ప్రతాప్ సైన్యం దాదాపు మూడున్నర వేల మంది. మూడు గంటలకు పైగా సాగిన మొదటిరోజు యుద్ధంలో ప్రతాప్ గాయపడ్డాడు. ప్రతాప్ నడవలేని స్థితిలో ఉండడాన్ని గమనించిన మేవాడ్ సైనికుడు తన లోహపు శిరస్త్రాణాన్ని ప్రతాప్ నెత్తిన పెట్టి, ప్రతాప్ కిరీటాన్ని తను ధరించి శత్రువును ఏమార్చాడు. సైనికుడినే ప్రతాప్ గా అనుకుని మాన్ సేన్ సేన అతడి వెంటపడి పొడిచి చంపింది. ఈలోపు తన చేతక్ గుర్రమెక్కి ప్రతాప్ తప్పించుకోగలిగాడు. హల్దీఘాటి యుద్ధం తరువాత మొఘల్ సేనలు వెంటవెంటనే దాడులు చేసి మేవాడ్ రాజ్యం విస్తీర్ణాన్ని చాలా చిన్నది చేయగలిగారు. ఈలోపు అక్బర్ ఆఫ్ఘనిస్థాన్ లో కల్లోలాలను చక్కబెట్టడానికి వెళ్లడం, ఏళ్ల తరబడి అక్కడే ఉండిపోవడంతో ప్రతాప్ కు కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం దొరికింది.

చరిత్రకెక్కిన చేతక్ గుర్రం
శత్రు సేన ఈటెతో పొడవడంతో హల్దీఘాటి యుద్ధంలో మహారాణా ప్రతాప్ గుర్రం చేతక్ ముందు కాలు దాదాపు విరిగిపోయింది.
మూడు కాళ్లతో కుంటుతూ నడవలేని స్థితి. ఒకవైపు ప్రతాప్ స్పృహదప్పి పడిపోయే స్థితిలో ఉన్నాడు. క్షణం ఆలస్యం చేసినా ప్రతాప్ ను శత్రుసేనలు పొడిచి చంపేస్తాయి. అప్పుడు చేతక్ కుంటుతూనే ప్రతాప్ దగ్గరికి వెళ్లింది. చేతక్ ఎందుకొచ్చిందో తెలిసిన ప్రతాప్ దాని మీద ఎక్కి…స్పృహదప్పి పడిపోయాడు. ప్రతాప్ ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లింది చేతక్. మూడు కాళ్లమీదే 25 అడుగుల లోతు నదిలోకి కూడా దూకింది చేతక్. ప్రతాప్ స్పృహలోకి వచ్చాడు. చేతక్ స్పృహదప్పింది. ప్రతాప్ చూస్తుండగానే చేతక్ కన్ను మూసింది.

బజాజ్ కంపెనీ స్కూటర్లకు ఈ ‘చేతక్’ పేరే పెట్టింది. “బజాజ్ చేతక్” ది కొన్ని దశాబ్దాల స్వర్ణయుగం. పాత చేతక్ కాలగర్భంలో కలిసినా…ఇప్పుడు మళ్లీ అదే పేరుతో ఎలెక్ట్రిక్ చేతక్ స్కూటర్ ను తీసుకొచ్చింది బజాజ్ కంపెనీ. షో రూముల్లో నిరీక్షణ భరించలేక ఎక్కువ డబ్బు పెట్టి బ్లాక్ లో అయినా చేతక్ లు కొని గర్వంగా తిరిగిన భారతీయుల హృదయాల్లో ఆ గుర్రం చేతక్ కు ఎంతటి తాదాత్మ్యత ఉందో…ఈ స్కూటర్ చేతక్ కూ అంతే తాదాత్మ్యత ఉంది.

ఉదయ్ పూర్ లో ఒక సర్కిల్ కు చేతక్ పేరు పెట్టి…మధ్యలో మూడు కాళ్లమీద నిలుచుని ఉన్న చేతక్ గుర్రం విగ్రహాన్ని ప్రతిష్ఠించారు- ఆరాధనగా.

చేసిన యుద్ధాలన్నీ ప్రతాప్ గెలిచి ఉండకపోవచ్చు. ఒక్కోసారి కొంత మేవాడ్ భూభాగం, కొన్ని కోటలు కోల్పోయి ఉండవచ్చు. కానీ మొఘలులను నిలువరించడంలో మహారాణా ప్రతాప్ తుదిశ్వాస దాకా పోరాడాడు.

మొఘలులు ఆక్రమించిన తనకెంతో ఇష్టమైన చిత్తోర్ గఢ్ కోటను తిరిగి దక్కించుకునేదాకా కటిక నేల మీదే పడుకుంటానని, వారానికో రోజు ఉపవాసముంటానని చనిపోయే దాకా ఆ దీక్ష పాటించినవాడు ప్రతాప్. బతుకంతా యుద్ధాలు చేసిన ప్రతాప్ వేటలో ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడ్డాడు. చనిపోవడానికి ముందు పెద్ద కొడుకు అమర్ సింగ్ కు ప్రతాప్ చెప్పిన మాట-  “నువ్ రాజయ్యాక ప్రాణం పోయినా మొఘలులకు తల వంచకు. మేవాడ్ తల దించకు. చిత్తోర్ గఢ్ ను మళ్లీ స్వాధీనం చేసుకో…” అని.

ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ తో కలిపి ఉత్తర భారతమంతా విస్తరించి ఉన్న మొఘల్ మహాసామ్రాజ్యాన్ని మేవాడ్ రాజు మహారాణా ప్రతాప్ సవాలు చేసి నిలబడడం చిన్న విషయం కాదు. శత్రు సైన్యం వెయ్యి మంది ఉన్నా…తన దగ్గర వంద మందే ఉన్నా ప్రతాప్ వెనకడుగు వేయడు. గెరిల్లా యుద్ధ విద్యతో శత్రువును మట్టి కరిపించిన మహారాణా ప్రతాప్ ఛత్రపతి శివాజీకి మార్గదర్శకుడయ్యాడు.

రాజస్థాన్ జానపద గాథల్లో చేతక్ గుర్రం ఎలా హిమాలయమంత ఎత్తున ఉందో రాజస్థాన్ చరిత్రను రికార్డ్ చేసిన బ్రిటిష్ అధికారి జేమ్స్ టాడ్ మైమరచి వర్ణించాడు. భవిష్యత్ తరాలకు అవసరమని ఆ పాటలను యథాతథంగా ఇంగ్లీషు అక్షరాల్లో రాసి పెట్టాడు.

“నీలి మబ్బులనెక్కి రాడు మా చందురుడు;
నీలి చేతక్ ఎక్కి వస్తాడు మా సూర్యుడు;
మబ్బులే గొడుగులవుతాయి మా మేవాడ్ కు;
సూర్యుడున్నంతవరకు వెలిగేది మా మేవాడ్;
రణంలో రాణా ప్రతాపమే దీపమై వెలుగగా…
చేతక్ చేతన డెక్కల చప్పుడు ఆరావళి కొండల్లో కోయనగా…
ప్రతాప్ చేతి కత్తి తళుక్కుమంది;
పగరాజు గుండె జారింది…”
(చేతక్ నల్ల గుర్రం అయి ఉండాలి)
ఇలా ఉంటాయి ఆ జానపదగీతాలు.

రాజుగా పాతికేళ్లలో రాత్రీ పగలు మహారాణా ప్రతాప్ యుద్ధాలే చేసినా ఏనాడూ అలసిపోలేదు. శత్రువుకు తలవంచి లొంగిపోలేదు. కలల కోట చిత్తోర్ గఢ్ ను తిరిగీ స్వాధీనం చేసుకోలేకపోయి ఉండవచ్చు కానీ…ఉదయ్ పూర్ కోటలో మేవాడ్ రాజ్య పతాక రెపరెపలను మాత్రం ప్రాణమున్నంతవరకు పొదివి పట్టుకున్నాడు.

మహారాణా ప్రతాప్ మరణవార్త తెలిసిన అక్బర్-
“నేను గెలవదలుచుకున్న మహాయోధుడు నాతో తలపడకుండానే పోయాడు” అని ప్రశంసాపూర్వకంగా అన్నట్లు చెబుతారు.

అక్బర్ అనని మాటను ఎవరో ఇలా శతాబ్దాలుగా ప్రచారంలో పెట్టారని మరొక వాదన.

భారతీయుల మనసు గెలిచిన మహారాణా ప్రతాప్ కు మరణం లేదు.

రేపు:-
“మేవాడ్ లో అడుగుకో ఆలయం”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్