Sunday, September 8, 2024
HomeTrending NewsTelangana: తెలంగాణలో ఇక కాంగ్రెస్ శకం

Telangana: తెలంగాణలో ఇక కాంగ్రెస్ శకం

తెలంగాణలో హస్తం హవా కొనసాగింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 65 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటి కాంగ్రెస్ సాధించింది. దక్షిణ తెలంగాణలో కొంత దెబ్బ తిన్నా ఉత్తర తెలంగాణ కవర్ చేస్తుందని గులాబీ నేతలు భావించారు. అయితే రెండు చోట్ల ఉహించని తీరులో దెబ్బ పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీని కాంగ్రెస్ సాధించింది. 2014 ఎన్నికల్లో వచ్చిన సీట్లు తారుమారు అయ్యాయని విశ్లేషకులు అంటున్నారు.

నామినేషన్ దాఖలు జరిగిన మొదటి రోజు నుంచే ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్, నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అయింది. గత ఎన్నికల్లో ఓట్లు తక్కువ వచ్చినా…అక్రమ మార్గంలో గెలిచాడని కొప్పుల మీద ఆరోపణలు…నిర్మల్లో భూకబ్జాలు బంధుగణంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు…వీటిపై ప్రజలు బహిరంగంగానే విమర్శలు చేశారు.

రాష్ట్రంలో అందరి దృష్టి ఆకర్షించిన కామారెడ్డిలో బిజెపి అభ్యర్థి వెంకటరమణ రెడ్డి విజయం సాధించగా రెండో స్థానంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిలువగా, సిఎం కెసిఆర్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఎవరికీ అంతు పట్టని అంశం..సిఎం కెసిఆర్ కామారెడ్డిలో ఎందుకు పోటీ చేశారు అనేది? అక్కడ ప్రబావం చూపకపోగా పక్క నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ ఓటమి పాలైంది.

కామారెడ్డి బిజెపి అభ్యర్థి వెంకటరమణ రెడ్డి

మంత్రులు కేటిఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి మినహా మంత్రులు అందరు ఘోర పరాజయం చవిచూశారు. మూడోసారి అంతకన్నా ఎక్కువ సార్లు గెలిచి బరిలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ప్రభుత్వ పథకాలు, పరిమితి లేని రైతుబందు, కొందరికే దళితబందు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ గోల్మాల్ మొదలైనవి ప్రభావం చూపాయి.

శాసనసభ్యుల్లో అధిక శాతం భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మొదటి దఫా సిఎం కెసిఆర్ ఎమ్మెల్యేలను కట్టడి చేసినా రెండో దఫా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో కొందరు ఎమ్మెల్యేలు కన్నుమిన్ను కానకుండా వ్యవహరించారని విమర్శలు ఉన్నాయి. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓడిపోయారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన యశస్విని రెడ్డి విజయం సాధించింది. ఖమ్మం జిల్లాలో సీనియర్ నేతలను కాదని పువ్వాడ అజయ్ కు మంత్రిగా అవకాశం ఇస్తే చివరకు పార్టీని దిక్కులేని స్థితికి తీసుకొచ్చారు. మహబూబ్ నగర్ లో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ల ఏకపక్ష నిర్ణయాలు పార్టీకి నష్టం చేకుర్చాయని పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు.

కాంగ్రెస్ కు ద్రోహం చేసిన ఎమ్మెల్యేలను ఓడించి తీరుతామని మొదటి నుంచి రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో సమ ఉజ్జీలను రంగంలోకి దింపటం కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన కసిరెడ్డి నారాయణ్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డిలను అదృష్టం వరించింది. ఇక రెండు రోజుల్లోనే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్… బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ మారిన కంభం అనిల్ కుమార్ రెడ్డి భోనగిరిలో గెలిచారు.

కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల్లో మెజారిటీగా ఓటమి పాలయ్యారు. కొత్తగూడెం-వనమా వెంకటేశ్వర్ రావు, ఎల్లారెడ్డి – జాజుల సురేందర్, నకిరేకల్-చిరుమర్తి లింగయ్య, ఇల్లందు- హరిప్రియ నాయక్, పినపాక-రేగ కాంతారావు, పాలేరు- కందల ఉపేందర్ రెడ్డి, ఆసిఫాబాద్ – ఆత్రం సక్కు, భూపాలపల్లి-గండ్ర వెంకటరమణ రెడ్డి, తాండూర్ –పైలట్ రోహిత్ రెడ్డి, కొల్లాపూర్ – బీరం హరివర్దన్ రెడ్డి తదితర నేతలు ఓడిపోయారు. ఎల్ బి నగర్ లో దేవిరెడ్డి సుదీర్ రెడ్డి, మహేశ్వరంలో సబితా ఇంద్రా రెడ్డి మాత్రం గెలిచారు.

బిజెపికి ఈ ఫలితాలు కొత్త సంకేతాలు ఇచ్చాయి. పార్టీ అగ్రనేతలు అందరు ఓటమి పాలయ్యారు. ఖచ్చితంగా గెలుస్తారనుకున్న కోరుట్ల- ధర్మపురి అరవింద్, కరీంనగర్- బండి సంజయ్, హుజురాబాద్- ఈటెల రాజేందర్, దుబ్బాక – రఘునందన్ రావు పరాజయం చవి చూశారు.

మొదటి నుంచి అందరు అనుకున్నట్టుగానే ఆదిలాబాద్ – పాయల్ శంకర్, ముధోల్-రామారావు పటేల్, నిర్మల్ –మహేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. మాజీ నక్సలైట్ ఈటెల రాజేందర్ మొదటి సారి ఓటమి చవిచూశారు. కమలాపూర్ లో ముద్దసాని దామోదర్ రెడ్డిని ఓడించిన తర్వాత అదే విజయ పరంపర కొనసాగించిన ఈటెల రాజేందర్ మొదటి సారి ఓటమి చవి చూశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిర్వాకంతోనే అంబర్పేట్, ముషీరాబాద్ నియోజకవర్గాలు చేజారాయని బిజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సిర్పూర్ లో బిజెపి అభ్యర్థి పాల్వాయి పురుషోత్తం విజయం సాధించారు. బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ పరాజయం చెందారు. తెలంగాణలో ఇక కాంగ్రెస్ శకం మొదలైంది. ఢిల్లీ విమానాలకు గిరాకీ పెంచుతారా… గతానికి భిన్నంగా గ్రూపులు కట్టిపెట్టి ప్రజల కోసం పనిచేస్తారా త్వరలోనే అనుభవంలోకి రానుంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్