Spreading Omicron : దేశావ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 58 వేల కేసులు వెలుగు చూశాయి. రెండు వేల పైచిలుకు ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివిటి రేటు 4.18 శాతంగా నమోదైంది. మహారాష్ట్రలో పెద్దమొత్తంలో ఇప్పటికే మంత్రులు కరోనా బారిన పడగా తాజాగా బీహార్ లో ఐదుగురు మంత్రులకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉపముఖ్యమంత్రులు రేణు దేవి, తార్ కిషోర్ ప్రసాద్ లకు కరోనా సోకగా మంత్రులు సునీల్ కుమార్, విజయ్ కుమార్ చౌదరి, అశోక్ చౌదరి లు కరోనా బారిన పడ్డారు.
అటు పంజాబ్ లో శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు సుఖదేవ్ సింగ్ ధిండ్సకు కరోనా సోకడంతో చండీగడ్ లో చికిత్స తీసుకుంటున్నారు. పంజాబ్ ఫిరోజ్ పూర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో పరీక్షా వివరాలు రావటంతో మార్గమద్యం నుంచే వెనుతిరిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు పాల్గొనబోయే ఫిరోజ్ పూర్ సభ కూడా రద్దయింది. రాబోయే పంజాబ్ ఎన్నికల్లో బిజెపి, మాజీ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ నేత్రుర్వం వహిస్తున్న పంజాబ్ లోక్ కాంగ్రెస్ తో కలిసి శిరోమణి అకాలీదళ్ బరిలోకి దిగుతోంది.
కరోనాపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. ఐసోలేషన్‌ను 7 రోజులకు కుదించిన కేంద్రం. వరసగా మూడు రోజులు జ్వరం లేకపోతే 7 రోజులు ఐసోలేషన్ సరిపోతుందని కేంద్రం ప్రకటించింది.
అయితే దేశంలో ఇటీవల పెరుగుతున్న కరోనా కేసులు, మారుతున్న పరిణామాలు చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయని కొన్ని రాజకీయ పార్టీలు అంటున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాది పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బిజెపి కి రాష్ట్రంలో ఎదురుగాలి వీస్తోందని, అటు పంజాబ్ లో కూడా ఇదే పరిస్థితి ఉందని దీంతో ఎన్నికలను వాయిదా వేసేందుకే కరోనా కేసులు, ఆంక్షలు ముందుకు తీసుకువస్తోందని ఆరోపిస్తున్నారు.
Also Read : ఒమిక్రాన్ వ్యాప్తిపై సీఎం కేసీఆర్ సమీక్ష