ఒక ఇంట్లో ఒకరు కలెక్టర్ అయితే వీధి వీధి సంబరాలు. ఆ ఏరియా అంతా హంగామా మామూలుగా ఉండదు. అదే ఆ ఇంట్లో వారంతా కలెక్టర్లు అయితే కుటుంబానికి ఆనందానికి హద్దులే ఉండవు కదా. అటువంటి అరుదైన కుటుంబం సహదేవ్ సహరన్.
ఆయనెమన్న ధన వంతుడా అనుకునేరూ.. కానే కాదు సాదాసీదా మధ్య తరగతి కుటుంబానికి చెందిన రైతు. ఆయనకు ఐదుగురు ఆడపిల్లలు. 1) రోమా, 2) మంజు, 3) అన్షు, 4) రీతు, 5) సుమన్, అని నామకరణం చేశారు. కొడుకులు లేరని ఏనాడు కుంగిపోలేదు సహదేవ్.
అయితే తనకు కలెక్టర్ కావాలన్న కోరిక ఉండగా…ఆ విషయాన్ని తన కుమార్తెలకు చెప్పారు. తన కోరిక నెరవేర్చాలంటూ తన మనసులోని మాట బయటపెట్టారు. దీంతో తండ్రిని అర్థం చేసుకున్న తనయలు.. ఎంతో కష్టపడి చదివారు. ఐదుగురు ఆడపిల్లలు ఉన్నత చదువులు చదవడమే కాకుండా… కలెక్టర్లుగా ఎంపికయ్యి తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చి యువతకు ఆదర్శ ప్రాయంగా నిలిచారు.
ఈ అరుదైన కుటుంబం రాజస్తాన్‌లోని హనుమ ఘర్ లో నివసిస్తోంది. 2018 లో నిర్వహించిన రాజస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్ష ఫలితాలు మంగళవారం ప్రకటించగా… అన్షు, రీతు, సుమన్ లకు రాజస్తాన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ (ఆర్‌ఎఎస్)కు ఏకకాలంలో ఎంపికై అందర్ని ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా… తమ వైపుకు దృష్టిని ఆకర్షించేలా చేశారు ఈ యువతులు.
ఇప్పటికే ఆ ఇంట్లో రోమా, మంజులు కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. తాజాగా ఈ ముగ్గురు కూడా ఆర్‌ఎఎస్‌కు ఎంపిక కావడంతో ఆ ఇంట్లో ఇప్పుడు అందరూ కలెక్టర్లుగా ఉండటం విశేషం. ఆర్‌ఎఎస్‌కు ఎంపికైన ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఫోటోలను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కష్వాన్ షేర్ చేయడంతో అందరికీ ఈ విషయం తెలిసింది. వారిని ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.