కొన్నాళ్ళుగా ఖలిస్తాని మద్దతుదారులు తమ ఉద్యమాన్ని ఉదృతం చేశారు. భారత్ ను ఇరకాటంలో పెట్టేందుకు ఏ మాత్రం అవకాశం వచ్చిన వదలటం లేదు. ఇప్పటికే కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ తో పాటు యూరోప్ దేశాల్లో భారత్ కు వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తున్న ఖలిస్తానీలు తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి అమెరికా పర్యటనలో కలకలం సృష్టించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు అక్కడ నిరసన సెగ తగిలింది. పర్యటనలో భాగంగా కాలిఫోర్నియాలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించిన మొహబ్బత్ కి దుకాన్ కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాహుల్ ప్రసంగిస్తుండగా.. సభకు హాజరైన పలువురు ఖలిస్థానీ మద్దతుదారులు రాహుల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రస్తావిస్తూ వారు నినాదాలు చేశారు. దీంతో సభలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది.