Literature on Lepakshi: లేపాక్షిని చూస్తే మూగవాడికి కూడా మాటలు తన్నుకుని వస్తాయి. చదువురానివారికి కూడా కవిత్వం పొంగుకుని వస్తుంది. అలాంటిది కవులు, రచయితలు, భావుకులు, చిత్రకారులు, చరిత్రకారులు, కళాకారులు, రసహృదయులు లేపాక్షిని చూస్తే వారి వారి శైలిలో చెప్పకుండా ఎందుకుంటారు? అలా ఎందరో చెప్పారు. అందులో కొన్ని కాలానికి దొరికాయి. కొన్ని కాలగర్భంలో కలసిపోయాయి. 1950కి ముందు లేపాక్షి మీద ఏ కావ్యాలున్నాయో మనకు తెలియదు. ఆ తరువాత దాదాపు 1990 వరకు కనీసం 30 పుస్తకాలు వివిధ రచయితలవి ఇంగ్లీషు, తెలుగు, కన్నడలో వచ్చాయి. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో దృష్టి. ఆధ్యాత్మిక, చారిత్రిక, కవిత్వ, శిల్ప, చిత్రకళల్లో ఎవరికి ఏది ముఖ్యమో ఆ విషయాన్నే ప్రధానంగా పట్టుకున్నారు. వాటిలో కొన్నిటి ప్రస్తావన ఇది.
పరిశోధనలు:
స్వాతంత్ర్య సమరయోధుడు పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు లేకపోతే మనకు ఈమాత్రం లేపాక్షి దొరికి ఉండేది కాదు. ఆయన హిందూపురం నియోజకవర్గానికి తొలి శాసనసభ్యుడు. స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన భూమిని కూడా తన ఉన్నతికి కారణమైన కాంగ్రెస్ పార్టీకే దానమిచ్చిన ఉదారుడు. నిష్కళంక దేశభక్తుడు. నిగర్వి. సంస్కృతం, తెలుగు, కన్నడ సాహిత్యాల్లో అభినివేశం ఉన్నవాడు. విజయనగర ప్రభువుల సాంస్కృతిక వైభవానికి గుర్తులుగా మిగిలి ఉన్న బళ్ళారి, హంపీ, అనంతపురం, పెనుగొండ, లేపాక్షిలలో విస్తృతంగా తిరిగినవాడు. లేపాక్షికి సమీపంలోని కల్లూరులో పుట్టినవాడు. లేపాక్షి రుణం తీర్చుకున్నవాడు. 1530లలో లేపాక్షిని విరుపణ్ణ ఆవిష్కరిస్తే…తరువాత మట్టి దిబ్బగా మారి…నిత్య ధూప దీప నైవేద్యాలు లేక…తన ఉనికిని తనే మరచిపోయిన అదే ఆలయాన్ని కల్లూరు సుబ్బారావు కొన్ని దశాబ్దాల ప్రయత్నంతో పునరావిష్కరించారు. లేపాక్షి తొలి సర్పంచ్ గా అయిదు దశాబ్దాల పాటు అప్రతిహతంగా పనిచేసిన లేపాక్షి వెంకటనారాయణప్ప ఈ యజ్ఞంలో కల్లూరుకు కుడి భుజంగా పని చేశారు. ఆలయ చరిత్ర అందరికీ తెలియాలన్న తపనతో ఆయనే స్వయంగా 1966 లో ‘లేపాక్షి దేవాలయ చరిత్ర’ పేరుతో పుస్తకం రాసి ప్రచురించారు.
కల్లూరువారు పట్టుబట్టి ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడెమీ తరపున వెలువరింపచేసిన “లేపాక్షి” ఇంగ్లిష్ పుస్తకం లేపాక్షికి అక్షరాలా నిఘంటువుతో సమానం. నెల్లూరులో 1907లో జన్మించిన ఆమంచర్ల గోపాలరావు రచన ఇది. ఆయన స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి. మంచి రచయిత, చిత్రకారుడు. అనేక నాటకాలు రాశారు. తెలుగు, హిందీ సినిమాల్లో సహాయదర్శకుడిగా పనిచేశారు. రెండు తెలుగు సినిమాలకు దర్శకుడు. చారిత్రిక విషయాలమీద అంతులేని ఆసక్తితో అనేక వ్యాసాలు రాశారు. వృత్తిరీత్యా ఆకాశవాణిలో అనౌన్సర్ గా విజయవాడలో పదవీవిరమణ తరువాత రచనల్లో మునిగి తేలారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో మంచి పట్టు ఉన్నవారు. ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడెమీ లేపాక్షి మీద పరిశోధించి పుస్తకం రాయడానికి ఆమంచర్లను ఎంచుకుంది. దాదాపు నాలుగేళ్లపాటు లేపాక్షి ఆలయాన్ని అధ్యయనం చేసి ఆయన 1968లో రాసిన పుస్తకం 1969 లో ప్రచురితమయ్యింది. కానీ ఆయన పుస్తకం వెలుగులోకి రావడానికి కొన్ని నెలల ముందే ఆయన కన్ను మూశారు.
ఆమంచర్ల పుస్తకంలో ప్రఖ్యాత తెలుగు చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు లేపాక్షి చిత్రాలు ఫొటోలకంటే ఆకర్షణీయంగా ఉన్నాయి. కొన్ని నెలలపాటు శేషగిరిరావుగారు లేపాక్షి ఆలయంలో కూర్చుని ఆ చిత్ర కళా ఖండాలను తీర్చి దిద్దారు.
ఆమంచర్ల భారతీయ కళ దగ్గర మొదలు పెట్టి…దక్షిణ భారత కళ, 1530కి ముందు వెయ్యేళ్ళల్లో ఆలయ నిర్మాణ శైలులు, విజయనగర ఆలయాల ప్రత్యేకతల మీదుగా లేపాక్షి ఆలయ వర్ణనలోకి వచ్చారు. ఆలయంలో ఒక్క అంగుళాన్ని కూడా వదిలిపెట్టలేదు. చారిత్రిక, ఆధ్యాత్మిక, ఆగమ, శిల్ప, చిత్ర, సాంఘిక అంశాలన్నిటినీ శాస్త్రీయ ప్రమాణాలతో విశ్లేషించారు. తను లేపాక్షి మీద రాసింది సుదీర్ఘ పరిచయవ్యాసం అని అత్యంత వినయంగా చెప్పుకుని…క్రెడిట్ అంతా కల్లూరు సుబ్బారావుకు, చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావుకు, లలిత కళా అకాడెమీకి ఇచ్చారు. నిజానికిది వెయ్యి పరిశోధన గ్రంథాలతో సమానం.
తిరుపతి ఎస్ వీ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్ గా పనిచేస్తుండిన వేమూరి కామేశ్వర రావుగారు లేపాక్షి ఆలయం పేరిట మొదట ఇంగ్లీషులో, తరువాత తెలుగులో 1987లో పుస్తకాలను ప్రచురించారు. రాయలసీమ ఆలయాల మీద పి హెచ్ డి చేసిన ఆయనకు లేపాక్షి కొట్టిన పిండి. చారిత్రిక ఆధారాలు, శాసనాలను పరిశీలించి ఒక క్రమపద్ధతిలో రాసిన చరిత్ర ఇది.
కావ్యాలు:
మైసూరు విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తుండిన రాయలసీమవాసి బాడాల రామయ్య లేపాక్షి స్వప్న దర్శనం పేరిట నాలుగు శీర్షికల కింద 1959లో రాసిన గొప్ప పద్యకావ్యాన్ని 1969లో ప్రచురించారు. చరిత్రకు ఆధారాలు ముఖ్యం. కవికి భావన ముఖ్యం. లేపాక్షిలో మన కళ్ల ముందు కనపడని మరో భావనా ప్రపంచాన్ని రామయ్యగారు రమణీయంగా ఆవిష్కరించారు. విశ్వనాథ సత్యనారాయణ ఈ కావ్యానికి ముందు మాట రాస్తూ- లేపాక్షికి ఇది అద్దం- అన్నారు.
“త్యాగశిల్పం” పేరిట కర్ణాటక హై కోర్టులో ఉన్నతోద్యోగిగా పని చేస్తూ ఉండిన లంకా కృష్ణమూర్తి పద్యాలతో, లేపాక్షి ఓరియంటల్ కాలేజీ లెక్చరర్, అష్టావధాని పమిడికాల్వ చెంచు సుబ్బయ్య శర్మ గద్యంతో సంయుక్తంగా 1975లో ఒక కావ్యాన్ని ప్రచురించారు. విరుపణ్ణ త్యాగానికి గుర్తుగా నిలిచి వెలుగుతున్న లేపాక్షి ఆలయం అనే కోణంలో కరుణరస ప్రధానమైన కావ్యమిది.
కవిత్వం:
1935 ప్రాంతాల్లో ప్రఖ్యాత రచయిత, చిత్రకారుడు అడవి బాపిరాజు లేపాక్షి బసవణ్ణను చూసి…పొంగిపోయి ఆశువుగా అల్లి…స్వయంగా పాడిన గేయకవిత అన్ని కవితల్లోకెల్లా ఆణిముత్యం.
నవలలు:
కడపవాసి వీరరాఘవాచార్యులు లేపాక్షి మీద చారిత్రిక నవల రాశారు. అక్కడక్కడా రచయితలు దీన్ని ప్రస్తావించారు. నవల ప్రతి దొరకడం లేదు.
వ్యాసాలు:
లేపాక్షి గురించి ఇంగ్లీషు, తెలుగు, కన్నడలో ఇప్పటికి కొన్ని వేల వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ఇంకా వస్తూనే ఉంటాయి. రావాలి కూడా.
ఈమధ్య ఆ ప్రాంతవాసి సీనియర్ జర్నలిస్ట్ మైనా స్వామి ఎంతో శ్రమించి తెలుగు, కన్నడ, ఇంగ్లీషులో లేపాక్షి మీద పుస్తకాలను ప్రచురించారు.
ఇతర పుస్తకాలు:-
లేపాక్షి మీద విదేశీ పరిశోధకుల పుస్తకాలు కూడా ఉన్నాయి. రాయలసీమకు చెందినవారు రాసిన మరికొన్ని పుస్తకాలు ఇప్పుడు దొరకడం లేదు.
చరిత్రను తవ్వుకోమని, అందాలను జుర్రుకోమని, ఆనందాలను నింపుకోమని లేపాక్షి పిలుస్తూనే ఉంటుంది. ఆ పిలుపు మనం వినాలి- అంతే!
రేపు- అదిగో లేపాక్షి-12, చివరి భాగం.
“ఇప్పటి లేపాక్షి”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018