పశ్చిమ ఆఫ్రికాలోని గినియా దేశంలో రాజకీయ అస్థిరత నెలకొంది. దేశాధ్యక్షుడిని బందీ చేసి మిలిటరీ పాలనా పగ్గాలు చేపట్టింది. ప్రపంచ దేశాలు సైన్యం చర్యల్ని తీవ్రంగా ఖండించాయి. అయితే సైన్యాధ్యక్షుడు మమడి దౌమ్బౌయ నేతృత్వంలో మిలిటరీ పాలనా రావటంపై ప్రతిపక్షాలు సమర్ధించాయి. సైన్యం చర్యలు తిరుగుబాటు కానేకాదన్నాయి. దేశాధ్యక్షుడు ఆల్ఫా కందే అవినీతి, అరాచకాలు అడ్డుకట్ట వేసేందుకు సైన్యం విధానాలు సరైనవేనని 18 రాజకీయ పార్టీలు వెనకేసుకొచ్చాయి.
దేశంలో ప్రజాస్వామ్య పునరుద్దరణ కోసం 18 రాజకీయ పార్టీలు సంకీర్ణంగా ఏర్పడ్డాయి. మిలిటరీ తిరుగుబాటు సమర్థనీయమే అయినా ప్రజాస్వామ్య పరిరక్షణ జరగాలని సంకీర్ణ కూటమి డిమాండ్ చేసింది. 83 ఏళ్ళ ఆల్ఫా అక్రమార్కుడైనా వయసు రిత్యా ఆయన ఆరోగ్య అంశాన్ని పరిగణనలోకి తీసుకొని చట్టబద్దమైన శిక్షలు వేయాలని విపక్ష సంకీర్ణ కూటమి సూచించింది. మిలిటరీ తిరుగుబాటులు ప్రజలు తిరస్కరించకపోగా హర్షాతిరేకాలు వ్యక్తం చేయటం గమనార్హం.
గినియా అధ్యక్షుడు ఆల్ఫా కందే 2010 నుంచి అధికారంలో ఉన్నారు. 2020 మార్చితో ఆల్ఫా పదవి కాలం ముగిసినా ఎన్నికలు నిర్వహించలేదు. ఎన్నికలు నిర్వహించకపోగా రాజ్యాంగ సవరణ చేసి మరో పదేళ్ళు పదవి కాలం పెంచుకోవటం, తన జీత భత్యాలు భారీగా పెంచుకునే నిర్ణయాలు తీసుకున్నారు. రాజ్యాంగ సవరణ సమావేశాన్ని విపక్షాలు బహిష్కరించి ఆందోళనలకు దిగాయి. దేశంలో దుర్భర దారిద్రంతో ప్రజలు అర్ధాకలితో అలమతిస్తుంటే ఆల్ఫా తన స్వప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారనే అంశం ప్రజల్లోకి వెళ్ళింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నుముట్టాయి. రాజధాని కొనార్కి నిరసనలతో అట్టుడికింది. నిరసంకారుల్ని కట్టడి చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో వంద మంది వరకు చనిపోయారు. దీంతో ఆదివారం రాజధాని కొనర్కి లోని దేశాధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకొన్న మిలిటరీ అధ్యక్షుడు ఆల్ఫా కందే ను బందీ చేశాయి.