Sunday, September 8, 2024
HomeTrending NewsTelangana: మార్పు దిశగా తెలంగాణ ముస్లిం ఓటరు

Telangana: మార్పు దిశగా తెలంగాణ ముస్లిం ఓటరు

తెలంగాణ ఎన్నికల్లో ముస్లిం వర్గాలు ఏ పార్టీని ఆదరిస్తారనే అంశం ఇప్పుడు చర్చనీయంగా మారింది. పోలింగ్ తేది దగ్గరపడుతున్న కొద్దీ ఓటరు కరుణ ఎవరిపైనో అని పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. హైదరాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో గెలుపును నిర్ణయించే స్థాయిలో ఉండగా.. మిగతా జిల్లాల్లో గెలుపు, ఓటములపై ప్రభావం చూపే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. రాష్ట్ర జనాభాలో 13 శాతంగా ఉన్న ముస్లింలు 40 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను శాసిస్తున్నారు.

షాదీ ముబారక్, మైనారిటీ విద్యాసంస్థలు తదితర సంక్షేమ కార్యక్రమాలపై గులాబీ నేతలు ఆధారపడగా… బిజెపిని నిలువరించాలంటే తామే ప్రత్యాన్మయమని, మైనారిటీ సబ్ ప్లాన్, కులగణన అంశాలు ప్రభావితం చేస్తాయని హస్తం నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఎవరి లెక్కలు వారివి..మైనారిటీలు మావైపే అని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ధీమాగా ఉన్నాయి.

2014, 2018 ఎన్నికల్లో గులాబీ పార్టీకి అండగా ఉన్న ముస్లిం ఓటరు ఆలోచన మారినట్టుగా అవగతమవుతోంది. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఎన్నికల సరళిపై ముస్లిం వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏ పార్టీ తమకు అండగా ఉంటుందని, ప్రయోజనాలు కాపాడుతుందనే కోణంలో విశ్లేషణలు జరుగుతున్నాయి.

మొదటిసారిగా పాతబస్తీ నియోజకవర్గాల్లో మజ్లీస్ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జుబ్లీ హిల్స్, బహదూర్ పుర, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో కార్పోరేటర్లను బరిలోకి దించారు. నాంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి తీవ్రమైన పోటీ ఉంది. గోషామహల్ నియోజకవర్గంలో పంతంగి పోటీలో లేకపోవటం…మైనారిటీల్లో తప్పుడు సంకేతాలు పంపుతోంది. బిజెపి అభ్యర్థి రాజాసింగ్ కు మేలు చేసేందుకే మజ్లీస్ పోటీ చేయలేదనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

వాస్తవానికి అక్కడ పోటీ చేస్తే మైనారిటీల్లో చీలిక వస్తుందని..గంపగుత్తగా కారుకు పడాలని..పతంగి పోటీ నుంచి తప్పుకుందని సమాచారం. రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లో గోషామహల్ వ్యవహారంపై ఎవరికి తోచిన రీతిలో వారు అన్వయం చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతోంది.

కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు, MIM వ్యతిరేకత సోషల్ మీడియా ద్వారా ఈ వర్గాలకు చేరుకుంది. మైనారిటీల కోసం పనిచేసే వారిని ఆదరించాలని మతపెద్దలు తమ ప్రసంగాలలో పేర్కొంటున్నారు. బీఆర్ఎస్, బిజెపి, మజ్లీస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని విస్తృతంగా ప్రచారం జరిగింది. కాంగ్రెస్ అగ్రనేతలు తమ ప్రసంగాలలో దీన్ని విరివిగా ప్రచారం చేశారు.

దేశవ్యాప్తంగా బిజెపిని నిలువరించాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని…ప్రాంతీయ పార్టీలు బిజెపితో అవసరానికి అనుగుణంగా వ్యవహరిస్తాయనే కోణంలో మతపెద్దలు కొద్దిరోజులుగా మైనారిటీ సమావేశాల్లో ప్రచారం చేస్తున్నారు. MIM లేకపోవటం వల్లే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగిందని…ఇక్కడ అదే పాటించాలని మత పెద్దలు, ముస్లిం మేధావులు చేస్తున్న ప్రచారం వల్లే మజ్లీస్ తక్కువ స్థానాలకే పరిమితం అయిందనే విశ్లేషణ ఉంది.

MIM నేరుగా బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తోంది. విద్యాధికులు, మేధావుల్లో పట్టు ఉన్న జమాతే ఇస్లామి హింద్ కారు గుర్తుకు ఓటేయాలని ప్రకటించింది. జామియాతుల్ ఉలేమాయే హింద్ లోపాయికారిగా కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తోందని సమాచారం. ఇక ఇండియన్ ముస్లిం లీగ్ నేతలు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారు. ఈ పార్టీకి అంతగా పట్టు లేకపోయినా ఓటరు మూడ్, తాము కూడా ప్రభావ వర్గమని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

పోలింగ్ మరో పది రోజులు ఉందనగా బిజెపి అగ్రనేతలు ఇప్పుడు ప్రచారానికి వస్తున్నారు. ట్రిపుల్ తలాక్ ప్రభావం ముస్లిం మహిళల మీద ఉంటుందని..వారి ఓట్లు నిశ్శబ్దంగా కమలంకు దక్కుతాయని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.  బిజెపి నేతల ప్రచారం…మైనారిటీలకు  కాంగ్రెస్ ను మరింత చేరువ చేస్తుందని, ముస్లిం ఓటు బ్యాంకు ఏకతాటి మీదకు వస్తుందని మరో అంచనా.

జాతీయ ప్రయోజనాలు ప్రాతిపదికగా జరగనున్న మైనారిటీల ఓటింగ్ సరళి సమగ్రంగా పరిశీలిస్తే బీఆర్ఎస్ కు నష్టం వాటిల్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు(నవంబర్-20) వరకు అందిన సమాచారం ప్రకారం ముస్లిం వోటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని వార్తలు వస్తున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్