తెలంగాణలో రైల్వే అభివృధ్ధి, పెండింగ్ ప్రాజెక్టుల కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ తమను సంప్రదించలేదని రైల్వే శాఖ సహాయ మంత్రి రావూ సాహేబ్ పాటిల్ ధన్వే అన్నారు. ఏడేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరని, హామీలను నిలబెట్టుకోవడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని కేంద్ర మంత్రి విమర్శించారు. ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర రైల్వే మరియు బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి రావు సాహెబ్ దన్వే రాజన్న సిరిసిల్ల జిల్లా చీకోడు గ్రామంలో మీడియాతో మాట్లాడారు. కాగజ్ నగర్ లో కోచ్ ఫ్యాక్టరీ కోసం స్థలం లేదని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
ఎం.ఎం.టి.ఎస్ రెండో దశకు సంబంధించి తెలంగాణ పభుత్వ పరంగా రాష్ట్రా వాటా ఇస్తే పనులు పూర్తవుతాయని మంత్రి స్పష్టం చేశారు. బండి సంజయ్ పాదయాత్రకు ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోందన్న రైల్వే మంత్రి తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు. మోదీ పై దేశవ్యాప్తంగా ప్రజల్లో నమ్మకముందన్నారు. కరోనా మహమ్మారిని ప్రధానమంత్రి నాయకత్వంలో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని రైల్వే మంత్రి రావు సాహెబ్ ధన్వ వెల్లడించారు.