Monday, May 20, 2024
HomeTrending Newsఅయన ఆపితే మంచిదేగా: సజ్జల

అయన ఆపితే మంచిదేగా: సజ్జల

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి, కేంద్రాన్ని ఒప్పించి ప్రైవేటీకరణ ఆపితే సంతోషిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే పవన్ పదే పదే నేను రంగలోకి దిగుతా అని బెదిరించడం ఏమిటో, అయన ఎవరికి హెచ్చరికలు పంపుతున్నారో అర్ధంకావడం లేదని సజ్జల ఎద్దేవా చేశారు. పవన్, బిజెపి నేతలు, టిడిపి తరపున బిజెపిలో పని చేస్తున్న నేతలు అందరూ కలిసి స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రాన్ని ఒప్పిస్తే మంచిదేనని, దానిపై తమకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం ఏముందని సజ్జల ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్రం ప్రభుత్వం పక్షాన సిఎం జగన్ తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నారని చెప్పారు.  చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురూ రాష్ట్రానికి అప్పుడప్పుడూ వచ్చి వెళ్ళే నేతలేనని, వారు వలస పక్షుల్లాంటి వారని అభివర్ణించారు.  తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు.

అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించిన వైఎస్సార్సీపీకి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 69 శాతం పైగా ఓట్లు వచ్చాయని సజ్జల వెల్లడించారు. తెలుగుదేశం పార్టీలో కేవలం నలుగురు నేతల నియోజకవర్గాల్లో మాత్రమే ఆ పార్టీ డబుల్ డిజిట్ ఎంపీటీసీ స్థానాలు గెల్చుకుందని, చంద్రబాబు నియోజకవర్గంలో 69 స్థానాల్లో కేవలం మూడు ఎంపీటీసీలు మాత్రమే టిడిపికి వచ్చాయని సజ్జల వివరించారు. ఫలితాలపై ఆత్మవిమర్శ చేసుకోకుండా కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుంటే టిడిపి పూర్తిగా పతనమవుతుందని సజ్జల జోస్యం చెప్పారు.

జడ్పీ, ఎంపీపీ పదవుల కోసం వైఎస్సార్సీపీలో ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని, ఇంత పెద్ద మొత్తంలో పార్టీ విజయం సాధించినప్పుడు చిన్న చిన్న విబేధాలు, పదవుల కోసం పోటీ సహజంగానే ఉంటుందని, జగన్ నాయకత్వంలో పార్టీ అత్యంత క్రమశిక్షణ కలిగి ఉన్న పార్టీ తమదని చెప్పారు. జడ్పీ, ఎంపిపి ఎన్నికల్లో తమ పార్టీ సాధించిన విజయం ద్వారా తమ ప్రభుత్వంపై ప్రతిపక్ష టిడిపి చేస్తున్న విషప్రచారంతో పాటు, మీడియా చేస్తున్న దాష్టీకం కేవలం దుష్ప్రచారమే అని తెలిపోయిందన్నారు.

రాష్ట్రంలో డ్రగ్స్, హెరాయిన్ పై టిడిపి దిక్కుమాలిన ప్రచారం చేస్తోందని సజ్జల దుయ్యబట్టారు. దీన్ని కూడా  సిఎం జగన్ మోహన్ రెడ్డికి అంటగట్టి మాట్లాడడం టిడిపి దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని పేర్కొన్నారు. కేవలం నిరాశా నిస్ప్రుహలతోనే టిడిపి నాయకులు అసభ్య పదజాలంతో తమపై విమర్శలు చేస్తున్నారని, ముందు వారు తమ పార్టీ పరిస్థితిపై ఆత్మావలోకనం చేసుకుంటే మంచిదని సజ్జల సలహా ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై మీడియా చేస్తున్న ప్రచారంపై సజ్జల విస్మయం వ్యక్తం చేశారు. సిఎం జగన్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధికోసం అప్పులు చేస్తున్నారని, అయితే గతంలో టిడిపి కేవలం ఎన్నికల ముందు పసుపు కుంకుమ కోసం వివిధ కార్పోరేషన్ల ద్వారా 8,390 కోట్లు, ఆర్బిఐ నుంచి 5 వేల కోట్ల రూపాయలు  డ్రా చేసుకున్నారని, దీనిపై ఎల్లో మీడియా ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని మండిపడ్డారు.

సిఎం జగన్ ఖర్చు చేస్తోన్న ప్రతి రూపాయి కూడా అట్టడుగు వర్గాల సంక్షేమం కోసమే వినియోగిస్తున్నారని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్