Friday, February 21, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసిగ్గులేని సినిమా

సిగ్గులేని సినిమా

రాయలసీమది కన్నీటి కథ. అంతు లేని వ్యథ. ఒక్కో భౌగోళిక ప్రాంతానికి ఒక్కో చరిత్ర, సంస్కృతి, మాండలికం , ఆచార వ్యవహారాలు విధిగా ఉంటాయి. నెలకు ముమ్మారు వర్షాలు కురిసిన రాయల కాలంలో రాయలసీమ ఎలా ఉండేదో? అంతటి మహోజ్వల వైభవ దీప్తులు నేడు కనీసం ఇంగువ కట్టిన గుడ్డగా అయినా ఎందుకు మిగలలేదో విడిగా చెప్పాల్సిన పనిలేదు.

Youtube : https://www.youtube.com/@dhatritvtelugu
Facebook : https://www.facebook.com/dhatritelugutv
Instagram: https://www.instagram.com/dhatritelugutv/
Twitter :https://x.com/Dhatri_Tv

వరుస కరువులు, జలవనరుల కొరత సీమ దుస్థితికి కారణం. నెలకు అయిదారువేల జీతానికి సీమ కన్నడ నేలకు, కేరళకు వలసపోతోంది. మండు వేసవిలో బిందె నీళ్లు రెండు రూపాయలనుండి అయిదు రూపాయలవరకు పెట్టి కొనలేక సీమ గొంతు తడారిపోతోంది. వేసిన వేరుసెనగ విత్తనం ఒక్క వర్షమయినా లేక చెద పురుగుల పాలవుతోంది. 60 ఏళ్ల కిందట పెన్నేటి పాటలో విద్వాన్ విశ్వమ్ చెప్పినా, ఆ తరువాత ఎడారి కోయిలలో మధురాంతకం రాజారామ్ చెప్పినా, నిన్న మొన్న పాలగుమ్మి సాయినాథ్ చెప్పినా సీమలో మార్పు లేదు- సీమకు ఓదార్పు లేదు.

ఇలా-
సవాలక్ష సమస్యలతో సతమతమవుతుంటే సినిమా మాత్రం సీమను విలన్ను చేసి, సీమ చేతిలో కత్తులు, గొడ్డళ్లు, బాంబులు పెట్టి – సీమవాసులను నరరూప రాక్షసులుగా చిత్రీకరించి అవమానిస్తోంది. సీమ యాస ఒక ఎగతాళి. సీమ సంస్కృతి ఒక బీభత్స భయానకం. సీమ పల్లె ఒక విధ్వంసం. సీమలో పంచె కట్టిన ప్రతివాడు వేటుకొక గొంతు కోసే పగవాడే. సీమ నెత్తురు పెల్లుబికే లావా. సీమ పగ వంశపారంపర్యం.
సీమలో బాంబులు కుటీర పరిశ్రమ;
వేటకొడవళ్లు మధ్య తరహా పరిశ్రమ;
కిడ్నాపులు హత్యలు భారీ పరిశ్రమ. ఉదయాన్నే కాఫీ టీ లకు బదులు గ్లాసుల్లో అప్పుడే చంపిన మనుషుల రక్తం తాగుతారు-
ఇదీ సినిమా అవగాహన. బయటి ప్రాంతాలవారికి సీమ గురించి సినిమా ఏర్పరిచిన అభిప్రాయం. ఒక ప్రాంతాన్ని గంపగుత్తగా విలన్ గా ముద్ర వేయడం బాధాకరం.

భాషా సాహిత్యాలు; కళా సాంస్కృతిక రంగాలు; విద్యా వైజ్ఞానిక, వాణిజ్య , రాజకీయ, ఇతర రంగాల్లో రాయలసీమ చరిత్ర సేవలు రాస్తే రామాయణమంత. చెబితే భారతమంత. తమ గొప్పను నెత్తిన పెట్టుకోవాలని సీమ అడుక్కోవడం లేదు . సీమ కష్టాలకు కన్నీరు కార్చమని ప్రాధేయపడడం లేదు. అసలే దగా పడ్డ , శోక తప్త సీమను సినిమా వినోదంతో ఇంకా గుచ్చి గుచ్చి చంపుతోంది.
ప్రజాస్వామిక భూమికమీద ఉన్నాం. ఒకరి కన్నీళ్లు మరొకరికి వినోదం కావడం మానవ నాగరికతకే మాయని మచ్చ.

రెండున్నర గంటల సినిమాల్లో రెండు గంటలా ఇరవై అయిదు నిముషాలు సీమ గుండెను వేట కొడవళ్ళతో నరికి నరికి, చివరి అయిదు నిముషాలు శాంతి మంత్రం జపిస్తే సీమ గుండె గాయం మానుతుందా? ఆగిన గుండె మళ్ళీ కొట్టుకుంటుందా?
సీమ సహనానికి కూడా హద్దు ఉంటుంది. రాయలసీమ సంస్కృతి , భాష , ఆచార వ్యవహారాలను ఎగతాళి చేసే, కించపరిచేవారిని అడ్డుకోవాల్సిందిగా సీమ అడుక్కోవాలా?
సినిమా పదే పదే రాయలసీమ ఆత్మాభిమానాన్ని, మనసులను, సంస్కృతిని కించపరుస్తోంది. గాయపరుస్తోంది.
రక్తం రుచి మరిగిన నరరూప రాక్షసులు తప్ప రాయలసీమలో మనసున్న మనుషులే లేరా?

పొడవండి!
ఇంకా లోతుగా పొడవండి!
మా గుండెకు గునపం గుచ్చుకునే దాకా పొడుస్తూనే ఉండండి.
కస కస కొయ్యండి.
మా వ్యక్తిత్వంలో చివరి రక్తపుబొట్టు కూడా గడ్డ కట్టేంత దాకా కోస్తూనే ఉండండి.

మా సంస్కృతిని నీచంగా చిత్రీకరించే సినిమాలకోసం మా వేళ్లను మేమే కోసుకుని రక్త తిలకాలు దిద్ది, పాలాభిషేకాలు చేసి పొంగిపోయే అంతులేని ఔదార్యం మాది. 
మా ప్రాణాలకు ఎలాగూ విలువ ఇవ్వరు…మా మానాన్నయినా కాపాడండి…చాలు.

రాముడున్నప్పుడే రావణుడూ ఉన్నాడు. మంచి చెడు ఎక్కడయినా ఉంటాయి. ఒక ప్రాంతానికి అదేదో గొప్ప బిరుదుగా వాడుతున్నట్లు పదే పదే అదే మాటతో సంబోధించడం మాత్రం ఆక్షేపణీయం. రాయలసీమ రౌడీలకు నిలయమయినట్లు చిత్రీకరించడంలో కొందరి ఆధిపత్య ధోరణి, రాజకీయ స్వార్థం, సాటి సమాజం పట్ల సానుభూతి లేని కొందరి సంస్కార రాహిత్యం, కళ్లున్నా నిజమయిన రాయలసీమ గుండెను చూడలేని కొందరి అంధత్వం…సభా మర్యాద దృష్ట్యా చెప్పకూడని మరికొన్ని కారణాలున్నాయి.

ఈమధ్య కొన్నేళ్ళుగా వరుసగా వర్షాలు పడి సీమ పొంగుతోంది. నీళ్లతో గంతులు వేస్తోంది. పచ్చగా కళకళలాడుతోంది. కొత్త ఆశలతో ప్రకృతి పరవశ గీతం పాడుతోంది. ఇరవై, ముప్పయ్ ఏళ్ల కిందటి కక్షలు, కార్పణ్యాలు, తెగే కుత్తుకలు, విసురుకునే బాంబులు ఇప్పుడు లేవు. సీమకు దత్తపుత్రులుగా చెప్పుకుని ఇక్కడి ఓట్లు కూడా పిండుకునేవారు సీమను గౌరవిస్తున్నారో, గాయపరుస్తున్నారో కొంచెం మనసు పెట్టి ఆలోచించాలి.

Youtube : https://www.youtube.com/@MahathiBhakthi
Facebook : https://www.facebook.com/mahathibhakthi
Instagram: https://www.instagram.com/mahathibhakthi/
Twitter : https://x.com/Dhatri_Tv

సీమకు కళ్లున్నాయి- చూస్తోంది.
సీమకు చెవులున్నాయి- వింటోంది.
సీమకు మనసుంది- కలతపడితే కన్నీళ్లున్నాయి.
సీమకు అన్నీ అర్థమవుతున్నాయి.

(పాత కథనం. పునర్ముద్రణ)

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్