వైఎస్సార్ జగనన్నశాశ్వత భూహక్కు-భూరక్ష పథకం త్వరిత గతిన పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ పథకానికి వాడుతున్న సర్వే రాళ్ళను రాజస్థాన్ నుంచి కొనుగోలు చేసుకుంటున్నామని గనులు, భూగర్భ శాఖ డైరెక్టర్ విజి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయమై నేడు ఓ దినపత్రికలో ‘రాజస్థాన్ నుంచి సర్వేరాళ్ళు’ శీర్షికన ప్రచురితమైన కథనాన్నిఖండిస్తూ వివరణతో కూడిన ఓ ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు కోట్ల సర్వేరాళ్ళు ఈ పథకం కోసం అవసరమవుతాయని తెలిపారు. వీటిని ఎవరూ మార్చడానికి వీలులేకుండా సదరు పథకం పేరుతో సహా రాయిపైనే చెక్కి, సరిహద్దుల్లో పాతేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కారణంగా పనులు లేక కుదేలైన గ్రానైట్ పరిశ్రమలకు ఊతం కల్పించేందుకు, దానిపై ఆధారపడిన వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఈ సర్వేరాళ్ళ తయారీని రాష్ట్రంలోని గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వాహకులకే అప్పగించామని తెలిపారు. రాష్ట్రంలో సర్వేరాళ్ళ కోసం ఫ్యాక్టరీ వద్ద చెల్లించే మొత్తం రూ.300 అని, ముడిఖనిజం ఉచితంగా అందిస్తూ, సీనరేజీ ఫీజు కూడా మినహాయింపు ఇస్తున్నామని వివరించారు. ఫ్యాక్టరీ నుంచి గ్రామాలకు లోడింగ్, అన్ లోడింగ్, రవాణాకు అదనంగా చెల్లింపులు కూడా చేస్తున్నమన్నారు. ఇవ్వన్నీ కలుపుకుంటే రాష్ట్రంలో తయారయ్యే సర్వే రాయికి రూ.500కు పైగా వ్యయం అవుతోందని పేర్కొన్నారు. సర్వేరాళ్ళ ఆర్డర్ లతో ఏపీలోని పలు గ్రానైట్ ఫ్యాక్టరీల్లో పనులు జరుగుతున్నాయని, పెద్ద ఎత్తున స్థానికులకు ఉపాధి లభిస్తోందని అన్నారు.
రాష్ట్రంలోని గ్రానైట్ ఫ్యాక్టరీల నుంచి సర్వేరాళ్ళు అవసరానికి సరిపడినన్ని సిద్ధం కాకపోవడం వల్ల, సర్వే ప్రక్రియకు విఘాతం ఏర్పడకూడదనే ఉద్దేశంతో రాజస్థాన్ నుంచి ప్రస్తుత అవసరాలకు గానూ 20 లక్షల సర్వేరాళ్ళను తెప్పించేందుకు ఎపిఎండిసి టెండర్లు నిర్వహించిందని తెలిపారు. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన ఈ టెండర్లలో ఒక్కో రాయికి రూ.413 రేటును ఖరారు చేశామన్నారు.
రాజస్థాన్ నుంచి మనరాష్ట్రంలోని ఏ గ్రామానికి రాళ్ళు అవసరమో అక్కడికి రవాణా చేసే బాధ్యత కూడా సదరు కాంట్రాక్టర్ పైనే ఉంటుందని, కాంట్రాక్టర్ సొంతగా సీనరేజీ ఫీజు చెల్లించుకోవాలని స్పష్టంచేశారు. మన రాష్ట్రంలోని ఫ్యాక్టరీ నుంచి తయారై, గ్రామానికి తరలించే నాటికి సర్వేరాయికి అయ్యే వ్యయంతో పోలిస్తే రాజస్థాన్ నుంచి వచ్చే సర్వేరాయికి చెల్లిస్తున్న వ్యయం తక్కువగానే ఉందని, ఈ విషయాన్ని సదరు పత్రిక తన కథనంలో ఎక్కడా ప్రస్తావించలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని గ్రానైట్ ఫ్యాక్టరీలకు సర్వేరాళ్ళ కోసం క్వారీల నుంచి నాణ్యమైన బ్లాక్ లను అందించాలని గనులశాఖ ఇప్పటికే ఆదేశించిందని, కొన్నిచోట్ల గ్రానైట్ ముడిఖనిజం నాణ్యత సరిగా లేదని, తామే సొంతగా ముడిఖనిజాన్ని కొనుగోలు చేస్తామని ఫ్యాక్టరీ నిర్వాహకులు కోరుతున్నారని తెలిపారు. ఇందుకోసం అదనంగా రూ.100 చెల్లించాలని ఇటీవల గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వారు విజ్ఞప్తి చేశారని తెలిపారు. ఈ అదనపు చెల్లింపుల వల్ల ఎంతభారం పడుతుందనే దానిపై ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. దీనిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, శాండ్ స్టోన్ కు మాత్రం ఒక్కోరాయికి రూ.413 చెల్లిస్తోందంటూ బాధ్యతారహితంగా కథనాన్ని ప్రచురించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వార్తలను ప్రచురించే సందర్భంలో కనీసం వాస్తవాలను తెలుసుకునేందుకు సంబంధిత అధికారుల వివరణ కోరకుండా, అసంబద్ద విమర్శలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సర్వే ప్రక్రియపై బురదచల్లేలా కథనాన్ని ప్రచురించడంను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.