కరోనా మూడో ఉద్ధృతి.. సెప్టెంబరు, అక్టోబరులో దేశాన్ని చుట్టుముట్టనుందని రెండు కీలక సంస్థలు కేంద్రాన్ని హెచ్చరించాయి. మూడో వేవ్ తథ్యమని అవి పేర్కొన్నాయి. సెప్టెంబర్‌లోనే దాదాపు రోజుకు 5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, దాదాపు రెండు లక్షల ఐసీయూ పడకలను సిద్ధం చేసుకోవాలని తెలిపాయి. ఈ మేరకు జాతీయ ప్రకృతి వైపరీత్య నిర్వహణ సంస్థ(ఎన్‌ఐడీఎం), నీతి ఆయోగ్ కేంద్రాన్ని అప్రమత్తం చేశాయి. హోంమంత్రిత్వశాఖ అధీనంలోని ఎన్‌ఐడీఎం.. కరోనా మూడో దశ ముప్పుపై తన నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించింది. ఇందులో కొవిడ్-19 ముప్పుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నీతి ఆయోగ్ కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. మూడో ఉద్ధృతిలో ఆసుపత్రుల్లో 23 శాతం మంది చేరతారని, దాదాపు 2 లక్షల ఐసీయూ పడకలను కేంద్రం సిద్ధం చేసుకోవాలని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు.
రానున్న 2 నెలలే కీలకం
కొవిడ్-19 పోరులో భారత్‌కు సెప్టెంబరు, అక్టోబరు నెలలు కీలకం కానున్నాయని జాతీయ ప్రకృతి వైపరీత్య నిర్వహణ సంస్థ తన నివేదికలో స్పష్టం చేసింది. వైరస్‌లో మార్పులు అధికమైతే సెప్టెంబరులోనే రోజుకు 5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. పరిస్థితులను బట్టి సెప్టెంబరు నుంచి అక్టోబరు చివరినాటికల్లా ఎప్పుడైనా దేశంలో మూడో ఉద్ధృతి కనిపించవచ్చని పేర్కొంది. ఇందులో చిన్నారులపై ఎక్కువ ప్రభావం కనిపిస్తుందని చెప్పే ఆధారాలు ఎక్కడా లేవని స్పష్టంచేసింది. ఒకవేళ వస్తే మాత్రం పిల్లలకు సరిపడా వైద్యసౌకర్యాలు దరిదాపుల్లోకూడా లేవని ఆందోళన వ్యక్తంచేసింది.
వ్యాక్సిన్ కార్యక్రమం మందకొడిగా సాగడంపై కూడా ఈ నివేదిక చర్చించింది. ‘‘నిపుణులందరూ దేశంలో కొవిడ్ మూడో వేవ్ తథ్యమని చెబుతున్నారు. ఇన్‌ఫెక్షన్ ద్వారాకానీ, వ్యాక్సినేషన్ ద్వారాకానీ రోగనిరోధకశక్తి పెంచుకొని సామూహిక రోగనిరోధకశక్తిని సాధిస్తేనే కరోనాకు ముగింపు సాధ్యమని అంటువ్యాధుల నిపుణులు పేర్కొంటున్నారు. ఇదివరకు 67%మంది దేశ ప్రజలకు ఇలాంటి శక్తి వస్తేనే హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమవుతుందన్నారు. ఇప్పుడు వైరస్‌లో ఉత్పరివర్తనాలు పెరిగి, అందులో కొన్ని వ్యాక్సిన్లనుకూడా తప్పించుకోగలుగుతాయని చెబుతున్నందున హెర్డ్ ఇమ్యూనిటీ అన్నది ఇప్పుడు సంక్లిష్టంగా మారింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో 80-90% మంది రోగనిరోధకశక్తి సాధిస్తేనే హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమయ్యే పరిస్థితి నెలకొంది. దేశంలోని విభిన్న నిపుణులు, సంస్థలు చెప్పినదాని ప్రకారం మూడో వేవ్ తథ్యమన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇందులో పిల్లలు ఎక్కువ ప్రభావితమవుతారని చెప్పడానికి బలం చేకూర్చే సమాచారం తగినంత అందుబాటులో లేదు. మూడో వేవ్ వస్తే అది తొలుత వ్యాక్సిన్ తీసుకోని పిల్లలపైనే ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందువల్ల పాఠశాలల నిర్వహణ అన్నది కచ్చితంగా డేటా, భద్రతా చర్యల ఆధారంగా తీసుకోవాలన్న డబ్ల్యూహెచ్‌వో సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవడానికి సమాయత్తం కావడం మంచిది’’ అని నివేదిక పేర్కొంది.
* డెల్టా కంటే ప్రమాదకరమైన వేరియంట్ వస్తే.. అది సెప్టెంబర్ ఆఖరికి క్రియాశీలకంగా ఉంటే.. మూడో ఉద్ధృతి నవంబర్‌లో గరిష్ఠస్థాయికి చేరుకుంటుందని ఐఐటీ కాన్పూర్‌కు చెందిన శాస్త్రవేత్త మణీంద్ర అగర్వాల్ తెలిపారు. కొత్త వేరియంట్ రాకపోతే మూడో వేవ్ ఉండకపోవచ్చని పేర్కొన్నారు.