రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను మార్చాలనే యోచనలో పార్టీ హైకమాండ్ ఉందనే వార్తల్లో నిజం లేదని రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ తేల్చి చెప్పారు. ఆయన స్థానంలో డీకే అరుణ లేదా ఈటల రాజేందర్ కు బాధ్యతలను కట్టబెట్టే అవకాశం ఉందనే తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. ఇదంతా తప్పుడు ప్రచారమేనని అన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, దీంతో పార్టీని బలహీనపరచాలనే ఉద్దేశంతో నాయకుల మధ్య విభేదాలు, పార్టీ అధ్యక్షుడి మార్పు అంటూ ప్రత్యర్థి పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని తరుణ్ చుగ్ కొట్టిపారేశారు. పార్టీ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అందరూ ఐకమత్యంతో పార్టీ గెలుపు కోసం ముందుకు సాగుతున్నారని చెప్పారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యమన్నారు. ఈ లక్ష్యం కోసమే అధ్యక్షుడి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు పని చేస్తున్నారని చెప్పారు.
రహస్య ఒప్పందాలున్నాయనడం అవాస్తవమన్నారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని విపక్షాల సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరవుతారన్న తరుణ్ చుగ్.. దీనికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ పార్టీ బీ టీమ్‌గా వ్యవహరిస్తోందన్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా ఈనెల 25వ తేదీన ఆయన రాష్ట్రానికి రానున్నారు.పర్యటనలో భాగంగా నాగర్ కర్నూల్ బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొననున్నారు. అటు అమిత్ షా పర్యటన కూడా త్వరలోనే ఖరారు అయ్యే అవకాశం ఉంది.