Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅదిగో లేపాక్షి-9

అదిగో లేపాక్షి-9

Epic Paintings: “లేపాక్షి” పేరులోనే లేపనం(పూత); అక్షి(కన్ను) మాటలున్నాయన్నది పండితుల పిండితార్థం. లేపాక్షి చిత్రాల్లో కళ్లు కొట్టొచ్చినట్లుగా ఉంటాయి కాబట్టి లేప- అక్షి కలిపి లేపాక్షి అన్న పేరు వచ్చిందనే వాదనకు బలం చేకూర్చేలా ఉంటాయి వర్ణ చిత్రాలు.

ఎక్కడయినా గోడల మీద చిత్రాలు వేస్తారు. విజయనగర కాలంలో ఆలయాల్లో పైకప్పు(ఫాల్స్ సీలింగ్)కు అద్భుతమైన వర్ణ చిత్రాలు వేశారు. ఎంత ఎత్తులో ఉన్నా…నిచ్చెనలో, కర్రలో పేర్చుకుని…వాటి పైకెక్కి…నిలుచుని బొమ్మలు గీయవచ్చు. రంగులు నింపవచ్చు. పైకప్పు మీద బొమ్మలు వేయాలంటే నిచ్చెనలు, కర్రలు ఎలాగూ తప్పవు. అంత ఎత్తున పడుకున్న భంగిమలో ఉంటూ బొమ్మలు వేయాలి. లేదా నిలుచునే ఉన్నా నెత్తిమీద ఫాల్స్ సీలింగ్ మీద అపసవ్య దిశలో బొమ్మలు వేయాలి. చాలా శ్రమ, ఎంతో నైపుణ్యం ఉన్న కళాకారులకు తప్ప ఇది అందరికీ సాధ్యం కాదు. మనకు మనం మన ఇంటి ఫాల్స్ సీలింగ్ మీద ఒక బొమ్మ వేస్తున్నట్లు ఊహించుకుంటే…అప్పుడు లేపాక్షి పైకప్పు చిత్రాలు వేయడంలో కష్టమేమిటో? వారు చేసిన అద్భుతమేమిటో? అర్థమవుతుంది.

విజయనగర కాలపు పైకప్పు వర్ణచిత్రాలు హంపీ విరూపాక్షాలయం, కంచి వరదరాజాలయం, సోమపాలెం చెన్నకేశవాలయం, లేపాక్షి వీరభద్రాలయాల్లో ఉన్నాయి. ఆధ్యాత్మిక, మతసంబంధమైన విషయాలను సామాన్యులకు సులభంగా అర్థమయ్యేలా ఇలా చిత్రాల్లో చెప్పారు.

విజయనగర రాజ్యంలో సామాన్యుల సాంఘిక జీవనం ఎంత రసమయంగా ఉండేదో ప్రఖ్యాత సాహితీ విమర్శకుడు, అనేక భాషల్లో పండితుడు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అనేక ప్రబంధాల్లో వర్ణనల ఆధారంగా “రాయలనాటి రసికత” పేరుతో లోకానికి చూపించారు. ఆ విషయాలను ప్రస్తావిస్తూ గతంలో ఐధాత్రి ప్రచురించిన కథనమిది:-

హంపీ వైభవం-4

ఇప్పుడు మనకు రేడియోల ఆడియోలు, ఫోటోలు, వీడియోలు, పుస్తకాలు, 3 డి వర్చువల్ గ్రాఫిక్స్, యానిమేషన్లు, కృత్రిమ మేధ ఆగ్మెంటెడ్ రియాలిటీలు…ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. ఆరోజుల్లో ఏది చెప్పినా రాతిమీదే చెప్పాలి. ఏది గీసినా రాతిమీదే గీయాలి. అలా శిల్పి ఉలి తగిలితే రాళ్లు నడకలు నేర్చి నాట్యాలు చేశాయి. రాతి స్తంభాలు సరిగమపదని పాటలు పాడాయి.

లేపాక్షి పైకప్పు వర్ణచిత్రాల్లో విజయనగర శైలి ఉన్నా…లేపాక్షి చిత్రకళ ప్రత్యేకం. తెలుగు తోలుబొమ్మలాటలో బొమ్మలు ఇటుక, మట్టి రంగులు నింపుకోవడానికి లేపాక్షి చిత్రాలే స్ఫూర్తి అన్నది కళా విశ్లేషకుల అభిప్రాయం.

పైకప్పులో ఎలా పడితే అలా కాకుండా…కింది నుండి తల పైకెత్తి చూసే సందర్శకులు ఒక వరుసలో నెమ్మదిగా నడుస్తూ వెళుతుంటే ఒక్కో పురాణ కథ పూర్తయ్యేలా చిత్రాలను వేశారు. అంటే బొమ్మల కథ పుస్తకంలో ఒకదాని తరువాత ఒకటి చదవడంలా…ఒకదాని తరువాత ఒక చిత్రాన్ని చూస్తూ నడుస్తూ ఉంటే…ఆ వరుస అయిపోయేసరికి ఒక కథ అయిపోతుంది. ఇంకో వరుసలో ఇంకో కథ. ఎంత ప్రణాళిక ఉండాలి? ఎంత నైపుణ్యం ఉండాలి? అన్నిటికీ మించి ఎంత తపన ఉండాలి? అయిదు వందల ఏళ్లు గడిచినా ఆ వర్ణచిత్రాలు రంగు వెలిసిపోకుండా ఇంకా అంత తాజాగా ఉండడానికి అప్పుడు వారు వాడిన రంగుల మిశ్రమాలేమిటో!

లేపాక్షి పైకప్పు వర్ణ చిత్రాల్లో అత్యంత ప్రధానమైనది నాట్యమండపంలోని వటపత్రశాయి. ప్రళయకాలంలో మర్రి ఆకుమీద తేలే వటపత్రశాయి కళ్ల అందమే అందం. నాలుగు దిక్కుల్లో మనం ఎటు వెళ్లి చూసినా వటపత్రశాయి మనల్నే చూస్తూ ఉంటాడు.

గర్భగుడి పైకప్పు మీద అతిపెద్ద వీరభద్రుడి వర్ణచిత్రం మరో ఆకర్షణ. వీరభద్రుడి కాళ్ల దగ్గర విరుపణ్ణ చిత్రం కూడా ఉంది.

నాట్యమండపంలో ఒకచోట పైకప్పుకు ఈ ఆలయ నిర్మాత విరుపణ్ణ, ఆయన తమ్ముడు వీరణ్ణ, విరుపణ్ణ ఇద్దరు కొడుకులు, ఆలయ ప్రధాన శిల్పులు ఇద్దరి వర్ణచిత్రం ఉంది.

రాళ్లపల్లి వారు కావ్యాల ఆధారంగా విజయనగర కాలపు జీవనవిధానాన్ని, వేష భాషలను, ఆహారపుటలవాట్లను పట్టుకున్నారు. లేపాక్షి చిత్రాల్లో అప్పటి వస్త్రాలంకారాలు, ఆభరణాలు, కట్టు బొట్టు, అధికారుల డ్రెస్ కోడ్, సామాన్యుల డ్రెస్…ఇలా ఎన్నెన్నో గమనించవచ్చు. ఇప్పటి అలంకారాలు, మేకప్పులకు అప్పటివి ఏమాత్రం తక్కువ కావు. ఒక పిసరు ఎక్కువేనేమో!

లేపాక్షిలో పుట్టినందుకు విరుపణ్ణ లేపాక్షిలో గుడి కట్టించాడు. ఆ గుడి పైకప్పులో చిత్రంగా మిగిలి ఉన్నాడు. విరుపణ్ణ గుడి కట్టకుండా ఉంటే రాముడు జటాయువును చేయి పట్టి “లే పక్షి!” అన్న ఇప్పటి లేపాక్షి ఇలా మనకు మిగిలి ఉండేదో! లేదో!

లేపాక్షిని చూడవచ్చిన ప్రతి కంటిని చూడడానికి ప్రవేశంలోనే పైకప్పుమీద విరుపణ్ణ కన్ను తెరిచి అయిదు వందల ఏళ్లుగా నిలుచుని ఉన్నాడు.

ఇంతకూ-
మీరు విరుపణ్ణ కంట్లో పడ్డారా! లేదా!
పడకపోతే…వెంటనే ఆయన కంట్లో పడండి!
లేకుంటే…విరుపణ్ణ మనోభావాలు దెబ్బతింటాయి!

రేపు:-అదిగో లేపాక్షి-10
“గోడలు, పైకప్పులపై
పురాణ కథలు”

RELATED ARTICLES

Most Popular

న్యూస్