Friday, November 22, 2024
HomeTrending NewsPOK: తిరుగుబాటు దిశలో ఆక్రమిత కాశ్మీర్

POK: తిరుగుబాటు దిశలో ఆక్రమిత కాశ్మీర్

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో పాకిస్థాన్ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రం అవుతోంది. నిరుద్యోగం..అరకొర నిధులు…అభివృద్ధి లేమి కాశ్మీర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల పేరుతో కీలు బొమ్మ ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం ఆక్రమిత కాశ్మీర్ లో సాధారణం అయింది. చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(CPEC) సిపెక్ రోడ్డు ఈ ప్రాంతం మీదుగా వెళ్ళినా ఒరిగింది శూన్యం.

విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నా కరెంటు ఎప్పుడు ఉంటుందో తెలియని దుస్థితి. జీలం నదిపై కోహ్ల జల విద్యుత్ కేంద్రం, ఆజాద్ పట్టన్ జల విద్యుత్ కేంద్రం చైనా సహకారంతో నిర్మించినా కాశ్మీర్ కు సరిపడిన విద్యుత్ సరఫరా చేయటం లేదు. ఈ ప్రాజెక్టులు కట్టిన సమయంలో రాజధాని ముజఫరాబాద్ లో ప్రజలు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేశారు.

ఈ ప్రాంత ప్రాజెక్టుల నుంచి 5 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా… పాకిస్థాన్ లో కరెంటు బిల్లులు తక్కువగా వేస్తూ… కాశ్మీర్ లో మాత్రం మోయలేనంత భారం వేస్తున్నారు. కొట్లి జిల్లా మొత్తానికి ఒక్క నెలలోనే 139 కోట్ల కరెంటు బిల్లులు వచ్చాయి. అందులో ఇప్పటికే 19 కోట్లు కట్టారు. అయితే వచ్చే నెల నుంచి కరెంటు బిల్లు కట్టే ప్రసక్తి లేదని స్థానిక ప్రజా సంఘాలు తీర్మానించాయి.

బాక్సైట్, లిథియం, యురేనియం నిల్వలు జీలం నది పరివాహక ప్రాంతంలో అపారంగా ఉన్నాయి. ఇందులో ఎక్కువగా చైనా కంపనీలకే మైనింగ్ కాంట్రాక్టులు కట్టబెట్టారు. వీటిల్లో కూడా స్థానికులకు అవకాశాలు శూన్యం.

గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రజలు మొదటి (1947)నుంచి పాకిస్థాన్ పాలకుల తీరును వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాంతంలో షియా వర్గం ఎక్కువ. పాకిస్థాన్ పాలకులు సున్ని వర్గం. దీంతో షియా మతాన్ని అణచివేసేందుకు సున్ని వర్గం ఉద్యోగులకు తాయిలాలు ఇచ్చి మరి గిల్గిత్ ప్రాంతంలో ఉద్యోగ నియామకాలు చేశారు. భారత్ పాక్ యుద్ద సమయంలో ఈ ప్రాంతం వారిని నమ్మని పాకిస్థాన్ పాలకులు…ఇస్లామాబాద్, లాహోర్ తదిర ప్రాంతాల నుంచే అన్ని రకాల ఉద్యోగులను తీసుకు వచ్చారు.

మత పరంగా రెచ్చగొడుతున్నారని స్కర్డు పట్టణంలో షియా వర్గం నేత షేక్ ఆఘా బకేర్ అల్ హుస్సైనీ పై కేసు నమోదు చేశారు. దీనిపై గిల్గిత్ లో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఆయన అనుచరులు నిర్వహించిన సమావేశానికి వేలమంది ప్రజలు హాజరయ్యారు. షియా నేతను అరెస్టు చేస్తే తాము కార్గిల్ వైపు మార్చ్ నిర్వహిస్తామని… తమను అడ్డుకుంటే రక్త పాతమే జరుగుతుందని పాక్ పాలకులకు వార్నింగ్ ఇచ్చారు.

జీ20 సమావేశాలకు వారం రోజుల ముందు ముజాఫరాబాద్ లో ప్రజలు ర్యాలీ నిర్వహించారు. కాశ్మీర్ ను భారత్ లో విలీనం చేయండి అంటూ నినాదాలు చేయటం కలకలం రేపింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకొని…పాకిస్థాన్ నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ పాలకుల తీరు మారకపోతే భారత్ లో కలిసేందుకు కార్గిల్ మార్చ్ నిర్వహిస్తామని స్థానిక ప్రజా సంఘాలు ప్రకటించాయి. ఆకాశాన్నంటిన పెట్రో ధరలు, ఆహార కొరతతో అల్లడుతున్నామని వాస్తవాధీన రేఖ వెంబడి పీఓకే పట్టణాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ప్రాంత వనరులు కొల్లగొడుతూ… ప్రధాన భూభాగంలో అభివృద్ధి చేస్తోంది. ఇక్కడి ప్రజలను అబివ్రుద్దిలో వాటా దక్కటం లేదు. తొలినాళ్ళలో భారత్ మీద తిరుగుబాటు చేసేందుకు మోజహిద్దిన్ లకు స్థానికులు సహకరించినా… ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబాన్ లు అధికారంలోకి వచ్చాక కాశ్మీర్ లో వేర్పాటువాదుల కార్యకలాపాలు తగ్గాయి. వీరి స్థానంలో ఇప్పుడు ఐసీస్ ఉగ్రవాదులు పనిచేస్తున్నారు. అయితే వీరికి కాశ్మిరీల నుంచి తగిన సహకారం అందటం లేదు.

ఉగ్రవాదం ద్వారా తాము సాధించిన దాని కన్నా కోల్పోయిందే ఎక్కువగా ఉందని ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు గ్రహించారు. ముఖ్యంగా 1947 లో కాశ్మీర్ ఆక్రమణలో పస్థూన్ గిరిజనులు ఎక్కువగా పాల్గొన్నారు. ఇప్పుడు తెహ్రీక్ ఏ తాలిబాన్ (TTP)లో ఎక్కువగా పస్థూన్ వర్గం వారే ఉన్నారు. వీరు పాకిస్థాన్ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారుతున్నారు.

ఆక్రమిత కాశ్మీర్ కు చెందిన సామాజిక కార్యకర్త షబిర్ చౌదరి పాక్ విధానాలపై దుమ్మిత్తి పోస్తున్నారు. లండన్ లో నివసించే షబిర్… కాశ్మీర్ లో పాక్ ఆగడాలు మితిమీరాయని ఆరోపించారు. ఆక్రమిత కాశ్మీర్ లో నిరసనలు, ప్రజాగ్రహాన్ని తప్పుదారి పట్టించేందుకే పాక్ పాలకులు, ఐ ఎస్ ఐ …  అనంతనాగ్ లో చొరబాట్లు… భారత సైన్యంపై దాడులు చేయిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.

సమీప కాలంలో ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు భారత దేశంలో కలిసేందుకు భారీ మార్చ్ నిర్వహించే అవకాశం ఉంది. పాక్ విధానాలతో విసిగిపోయిన కాశ్మీరీలు భారత్ తో కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ప్రగాడంగా విశ్వసిస్తున్నారు. ఇన్నాళ్ళు బ్రిటన్, అమెరికా తదితర దేశాల్లో వేర్పాటు వాదం వినిపించిన కాశ్మీరీలు ఇప్పుడు…భారత్ తో పయనమే భవిష్యత్తుకు భద్రత అని బావిస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్