Security Guards- Safeguard: కాంగ్రెస్ పార్టీ స్వరూప స్వభావాలు, గుణగణాలు, అధ్యక్ష స్థానంలో ఉన్నవారి వ్యవహార దక్షత, నిధుల సమీకరణ, టికెట్ల కేటాయింపు, గెలుపు ఓటముల్లో ఎగుడు దిగుళ్లు…లాంటి విషయాలు చెబితే చర్వితచర్వణం అవుతాయి. కాంగ్రెస్సే వాటిని కాలానికి వదిలేసింది కాబట్టి…కాలం కూడా కాంగ్రెస్సును ప్రస్తుతానికి రోడ్లమీద వదిలేసినట్లుంది. కన్యాకుమారి నుండి కాశ్మీరం దాకా రోడ్డున పడి పోయినదేదో వెతుక్కోవాలని కాంగ్రెస్ రాహుల్ ఆలోచిస్తున్నట్లున్నారు.
తాజాగా గులాం నబీ అజాద్ కాంగ్రెస్ తో అర్ధశతాబ్దం బంధం తెంచుకుని బయటికి వెళ్లిపోవడంతో మిగిలిన సీనియర్లు 22మందిలో చివరకు మిగిలేదెవరో తెలియడం లేదు.
గులాం నబీ అజాద్ అయిదు పేజీల లేఖతో రాహుల్ లో పరివర్తన రాకపోవచ్చు. అలా రాకూడదు కూడా. ప్రతి అయిదు పేజీలకు పరివర్తన మొదలయితే ఆసేతు హిమాచలం ఎందరో అజాద్ లు రోజూ అయిదు వందల పేజీల పరివర్తన ప్రతిపాదనలు పంపుతూ ఉంటారు. ప్రతిక్షణం పరి పరి పరివర్తనలకే సమయం సరిపోతుంది.
కొన్ని అనుభవాలు గాయాలను మిగులుస్తాయి.
కొన్ని అనుభవాలు పాఠాలుగా మిగులుతాయి.
కొన్ని అనుభవాలు ఓటములను మిగులుస్తాయి.
కొన్ని అనుభవాలు అనుభూతులను మాత్రమే మిగులుస్తాయి.
కొన్ని అనుభవాలు భవబంధాలను తెంచేస్తుంటాయి.
అజాద్ అంటున్నట్లు రాహుల్ పి ఏ లు, బాడీ గార్డులు, డ్రయివర్లు కూడా పార్టీ నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నది నిజానికి నిందార్థం కారాదు. ఒక ఆదర్శ ప్రజాస్వామిక భావనా వైశాల్యానికి అదొక ప్రతీక. లేదా ఒక దేశాన్ని నడిపే నిర్ణయాలను తీసుకోగలిగే పి ఏ లు, బాడీ గార్డులు, డ్రయివర్లను పెట్టుకున్న రాహుల్ కార్యదక్షత, సిబ్బంది నియామక నైపుణ్యంగానే చూడాలి.
ఏ పుట్టలో ఏ పాముందో?
ఏ చిన్ని విత్తనంలో ఏ మహావట వృక్షపు వేళ్ళున్నాయో ఎవరికెరుక?
ముఖే ముఖే సరస్వతి.
అందువల్ల…ఐక్యరాజ్యసమితిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం మీద అమెరికా అభ్యంతరాల గురించి రాహుల్ డ్రయివర్ విదేశాంగ మంత్రికి ఏదయినా సలహా ఇస్తే ఇచ్చి ఉండవచ్చు. రాష్ట్రాల పునర్విభజనలో జరిగిన జాప్యం మీద పునః పునః సమీక్ష అవసరమని రాహుల్ బాడీ గార్డ్ ఒకవేళ అనుకుని కేంద్ర హోం శాఖను హెచ్చరిస్తే హెచ్చరించి ఉండవచ్చు. ఈశాన్యంలో చైనా దూకుడు మీద మూకుడు మూయడానికి నేపాల్ నైట్ క్లబ్బులో చర్చల గోకుడు అవసరమని రాహుల్ వంట మనిషి ఒకవేళ అనుకుని ఉంటే అనుకుని ఉండవచ్చు.
అంతఃపురాల్లో ఇంతకుమించి మరోలా జరగదని అజాద్ కు తెలియదా?
అధికారంలో ఉండగా ఇలాంటివి ప్రశ్నించదగినవి కావు.
ప్రతిపక్షంలోకి రాగానే ప్రతిదీ ప్రశ్నగా మారిపోతుంది.
అజాద్ ఆరోపిస్తున్నట్లు రాహుల్ పి ఏ లు పార్టీని నడుపుతున్నారా? లేదా? అన్నది తరువాత సంగతి.
నిండుసభలో కాంగ్రెస్ అజాద్ కోసం బి జె పి ప్రధాని మోడీ కన్నీళ్లు పెట్టుకున్నప్పుడే, గొంతు బొంగురు పోయినప్పుడే, ప్రత్యక్ష ప్రసారంలో మాట రాక గాజుగ్లాసు నీళ్లు తాగినప్పుడే…దానికి ప్రతిగా అజాద్ కన్నీళ్లతో ప్రతినమస్కారం చేసినప్పుడే…జరగబోయేదేమిటో లోకానికి తెలిసిపోయింది.
“నన్ను కదిలించబోకు…
నా కళ్లల్లో అశ్రు జంఝామరుత్తులు కలవు…”
అంటాడు దాశరథి గాలిబ్.
కొన్ని కన్నీళ్లను కవులు తప్ప అందరూ అర్థం చేసుకోలేరు.
కొన్ని కన్నీళ్ల గురించి కవులు చెప్పాల్సిన అవసరం లేకుండానే…కవి హృదయం తెలిసిపోతూ ఉంటుంది…అజాద్ హృదయంలా.
ఇప్పుడు ఒక కన్నీటి చుక్క గడ్డకట్టి కాశ్మీరు కొండల్లో కొత్త పార్టీ పుట్టుకకు పాదుగా మారుతోంది… అంతేగా అజాద్ గారూ!
ఎందుకయినా మంచిది…
మీ పి ఏ లు, బాడీ గార్డులతో జాగ్రత్తగా ఉండండి.
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :