Saturday, April 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఫొటోగ్రాఫర్ల పౌరోహిత్యం

ఫొటోగ్రాఫర్ల పౌరోహిత్యం

పెళ్ళిలో పురోహితుడి పాత్ర గొప్పదా? ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పాత్ర గొప్పదా? అన్న ప్రశ్నే ఇప్పుడు అర్థరహితమైనది. చిన్నప్పుడు స్కూళ్లల్లో కత్తి గొప్పదా- కలం గొప్పదా? అన్న విషయంమీద వ్యాసాలు రాయించేవారు. వక్తృత్వపు పోటీలు నిర్వహించేవారు. కలమే గొప్పదని నిరూపించడానికి పిల్లలు నానా అగచాట్లు పడేవారు.

పెళ్ళిలో ఓం ప్రథమంగా నిశ్చయ తాంబూలాలకు ముహూర్తం నిర్ణయించేది పురోహితుడు. మాంగళ్యధారణకు శుభలగ్నం నిశ్చయించేది పురోహితుడు. జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టించేది పురోహితుడు. అగ్నిసాక్షిగా తాళి కట్టించేది పురోహితుడు. తలంబ్రాలు చల్లించేది పురోహితుడు. దండలు మార్పించేది పురోహితుడు. కొంగుముడి వేయించేది పురోహితుడు. హోమాగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేయించేది పురోహితుడు. శతమానం భవతి అని ఆశీర్వదించేది పురోహితుడు. దంపతులతో వ్రతం చేయించేది పురోహితుడు- అని అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే.

పెళ్ళిలో ఓం ప్రథమంగా నిశ్చయ తాంబూలాలు కాగానే ప్రీ వెడ్ షూట్ కు ముహూర్తం నిర్ణయించేది కెమెరామ్యాన్. మాంగళ్యధారణకంటే చాలా ముందే ఎంపికచేసిన ప్రత్యేక లొకేషన్లలో హనీమూన్ లాంటి శృంగార సరస రసోల్లాస గట్టి కౌగిళ్ళు, ఘాటు చుంబనాల నాటు నాటు సన్నివేశాలను సృష్టించేది కెమెరామ్యాన్. పందిట్లో జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టించేది కెమెరామ్యాన్. అగ్నిసాక్షిగా పురోహితుడు తాళి కట్టించినా…విభిన్న కెమెరా యాంగిల్స్ కోసం అదే పందిట్లో అదే ముహూర్తానికి ముందో వెనుకో మళ్ళీ మళ్ళీ తాళి కట్టించేది కెమెరామ్యాన్.  తలంబ్రాలు ఎలా చల్లితే ఫోటోలు, వీడియోలు సినిమాటిగ్గా ఉంటాయో  చెప్పి…ఆపి…ఆపి చల్లించేది కెమెరామ్యాన్. దండలు మార్పించేది, వధూవరులను కొయ్యబొమ్మలుగా మార్చి…పందిట్లో పెద్దలు నిరీక్షిస్తుండగా వేళ దాటినా సాగరసంగమం పిల్ల ఫోటోగ్రాఫర్ భంగిమల్లో నిలుచోబెట్టేది కెమెరామ్యాన్. వేసిన కొంగుముడినే మళ్ళీ వేస్తున్నట్లుగా నటింపచేసేది కెమెరామ్యాన్. హోమాగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేసేప్పుడు ఎక్కడ ఆగాలో, ఎప్పుడు ముందుకు సాగాలో చెప్పేది కెమెరామ్యాన్. శతమానం భవతి అని వచ్చినవారు ఆశీర్వదించేలోపు శిలా విగ్రహాల్లా కదలకుండా నిలుచోండనో, పక్కకు జరగండనో విసుక్కునేది కెమెరామ్యాన్. దంపతుల వ్రతం మధ్యలో దూరి…వారి వీపులమీదుగా సత్యనారాయణస్వామిని  ఫ్రేములో బంధించేది కెమెరామ్యాన్.

…ఇప్పుడు చెప్పండి. “తనను తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడతాడు”-అనుకుని పక్కకు వెళ్లిపోయిన పురోహితుడు గొప్పవాడా? పౌరోహిత్యం, మంత్రం, హోమం, అగ్నిసాక్షి ప్రదక్షిణలు ఒక తంతు- ఫోటోలు, వీడియోలే నిత్యం- సత్యం అనుకుని తనను తాను హెచ్చించుకున్న కెమెరామ్యాన్ గొప్పవాడా? లేక పెళ్ళంటే ఫోటోలు, వీడియోలే ప్రధానమనుకుని పురోహితుడిని, ఆయన చేసే పెళ్ళి ప్రక్రియను వెనక్కు నెట్టేసి.. కెమెరామ్యాన్లకు పౌరోహిత్య బాధ్యతలను అప్పగించిన మనం గొప్పవాళ్ళమా?

అన్నట్లు-
సమకాలీన సమాజంలో నలభై శాతం పెళ్ళిళ్ళు పెటాకులవుతున్నట్లు సుప్రీం కోర్టు న్యాయమూర్తి అధికారిక లెక్కలతో చెబుతున్నారు. పెటాకులైనవి పురోహితుడు చేసినవా? ఫొటోగ్రాఫర్లు చేసినవా?

తప్పు కెమెరామ్యాన్లదా? మనదా? ఈ వైపరీత్యానికి, ఆచార దోషానికి ఎవరు బాధ్యులు? ఎవరు ఎవరికి వేయాలి శిక్ష?

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

40శాతం పెళ్ళిళ్ళు పెటాకులే వ్యాసం లింక్:-

40శాతం పెళ్ళిళ్ళు పెటాకులే

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్