Sunday, January 19, 2025
HomeTrending NewsHate speech: విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీం కొరడా

Hate speech: విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీం కొరడా

విద్వేషపూరిత ప్రసంగాలు తీవ్రమైన నేరాలని సుప్రీం కోర్టు తెలిపింది. ఇలాంటి ప్రసంగాలపై ఎట్టిపరిస్థితుల్లోనూ ఉదాసీనంగా వ్యవహరించరాదని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ర్టాలకు తేల్చి చెప్పింది. సమాజంలో వాతావరణాన్ని కలుషితం చేసే ద్వేషపూరిత ప్రసంగాలపై రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు నమోదు చేయటంలో అలసత్వం ప్రదర్శిస్తే వాటిని కోర్టు ధిక్కరణగా భావిస్తామని హెచ్చరించింది. దీనిపై 2022లో తాము జారీ చేసిన ఉత్తర్వులను కొనసాగింపుగా.. ద్వేషపూరిత ప్రసంగాలపై సుమోటో చర్యలు తీసుకోవాలని యూపీ, ఢిల్లీ ప్రభుత్వాలకు సూచించింది. ఈ ప్రసంగాలపై ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా కేసులు నమోదు చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వాలు, యూటీలను ఆదేశించింది. దీనిని తీవ్ర నేరంగా పరిగణించిన కోర్టు దేశ లౌకిక వ్యవస్థను నాశనం చేసే శక్తి ఈ ద్వేష ప్రసంగాలకు ఉన్నదని వ్యాఖ్యానించింది. విద్వేష ప్రసంగాలపై దాఖలైన పలు కేసులను శుక్రవారం విచారించిన సుప్రీం.. వీటిపై చర్య తీసుకోవడంలో విఫలమైన మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. ‘

ఈ విద్వేష ప్రసంగాలను ఏ మతం వారు చేశారు అన్న విషయంతో సంబంధం లేకుండా చర్య తీసుకుంటున్నామని తద్వారా పీఠిక ద్వారా ఏర్పడిన భారత లౌకిక స్వభావానికి రక్షణ కల్పిస్తున్నాం’ అని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది. అంతకుముందు ఈ ప్రసంగాలను పరిశీలించడానికి రాష్ర్టానికి ఒక నోడల్‌ అధికారిని నియమించాలని పిటిషనర్లు కోరగా, జిల్లాకొక అధికారిని నియమించాలని సుప్రీం సూచించింది. అలాగే వీటిని సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేయకుండా తగిన చర్యలు చేపట్టాలని పిటిషనర్లు కోరారు. అలాగే ద్వేష ప్రసంగాలు చేసిన కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ మాట్లాడుతూ.. ఎఫ్‌ఐఆర్‌కు అనుమతి అవసరమని మేజిస్ట్రేట్‌ అనుకున్నారని, అలాగే 156(3)కు కూడా అనుమతి అవసరమని హైకోర్టు భావించిందని వెల్లడించారు. ‘న్యాయమూర్తులు రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తారు. వారు పార్టీ ‘ఏ’కు చెందిన వారా.. పార్టీ ‘బీ’కి చెందిన వారా అన్నది ఆలోచించరు. ఆ సమయంలో వారి మస్తిష్కంలో భారత రాజ్యాంగం అన్న అంశం మాత్రమే ఉంటుంది’ అని వ్యాఖ్యానించిన ధర్మాసనం కేసును మే 12కు వాయిదా వేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్