ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్ లో రెండో రోజు మంత్రి మండలి సమావేశం జరిగింది. దాదాపు ఏడు గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశం పలు అంశాల మీద చర్చించి నిర్ణయాలు తీసుకున్నది.  ముందుగా వ్యవసాయ శాఖకు సంబంధించిన విషయాలపై కేబినెట్ చర్చ ప్రారంభించింది.

వ్యవసాయ రంగం పై చర్చ :

గత సంవత్సర కాలంలో వ్యవసాయ రంగంలో జరిగిన పురోగతి, ధాన్యం దిగుబడి, సాగు విస్తీర్ణం పెంపు, తదితర విషయాలను, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , కార్యదర్శి, అధికారులు కేబినెట్ కు సమగ్రంగా వివరించారు. ప్రస్తుతం వానాకాలం సాగు ప్రారంభమైన నేపథ్యంలో, విత్తనాలు ఎరువుల లభ్యత, వర్షాపాతం తదితర అంశాల పై కేబినెట్ చర్చించింది.

గత పాలనలో తెలంగాణలో వ్యవసాయం తీరు ఎట్లుండె..నేటి స్వయం పాలనలో ఎట్లున్నది..అనే విషయాలను   ముఖ్యమంత్రి కెసిఆర్ కేబినెట్ సమావేశంలో చర్చించారు. గత ఏడేండ్ల అనతి కాలంలో తెలంగాణ వ్యవసాయ ప్రస్థానం, అధి సాధించిన ఘన విజయాలను సిఎం ప్రస్థావించారు. ఇరవై నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్తును అందించడం తో పాటు, అనేక కష్టాలకోర్చి చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో, నదీజలాలను చెరువులకు కుంటలకు, బీడు భూములకు ప్రభుత్వం మల్లించిందన్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో వొక్క ఎకరమూ వదలకుండా, వ్యవసాయానికి అనువుగా ఉన్న భూములను రైతులు  సాగుచేయడం ప్రారంభించారన్నారు. దాంతో పెద్దఎత్తున రాష్ట్రంలో  వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరిగిందని సిఎం పేర్కొన్నారు.

అదే సమయంలో ప్రభుత్వం రైతులకు అందిస్తున్నపంట పెట్టుబడి సాయం రైతుబంధు సహా సకాలంలో ఎరువులు విత్తనాలను అందుబాటులో ఉంచడం, తదితర వ్యవసాయ రైతు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని సిఎం అన్నారు. ఇట్లా అన్ని రకాల చర్యల ఫలితంగా, గత సంవత్సరం 3 కోట్ల టన్నుల ధాన్యం తెలంగాణలో, రికార్డు స్థాయిలో ఉత్పత్తి జరిగిందన్నారు. దాంతోపాటు రైతుకు ఎటువంటి కష్టాలు రాకుండా కరోనా కష్ట కాలంలో గ్రామాల్లోకి వెల్లి ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేసిందని సిఎం తెలిపారు.

తెలంగాణ రైతులు మరింత ఉత్సాహంతో వరిధాన్యాన్ని పండించే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని, వచ్చే సంవత్సరం ధాన్యం ఉత్పత్తి మరింతగా పెరిగే అవకాశాలున్నాయని కేబినెట్ అంచనా వేసింది. అందుకు అనుగుణంగా ధాన్యం నిలువ చేయడం, మార్కెటింగ్ చేయడం పై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.

 ప్రస్తుత వానాకాలం, ఒక కోటీ నలభై లక్షల ఎకరాల్లో వ్యవసాయ సాగు జరగనున్నదని, వరి పత్తి పంటలు రికార్డు స్థాయిలో దిగుబడి సాధించనున్న నేపథ్యంలో,  ప్రస్థుతం రాష్ట్రంలో వున్న ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది.  రైస్ మిల్లుల లో మిల్లింగ్ సమార్ద్యాన్ని పెంచుకోవాలని, నూతనంగా రైస్ మిల్లులు, పారాబాయిల్డ్ మిల్లులను గణనీయంగా స్థాపించాలని,  ఇందుకు సంబంధించి అత్యంత క్రియాశీలకంగా చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖను కేబినెట్  ఆదేశించింది.

 రైతులకు సమగ్రంగా శిక్షణ ఇవ్వడానికి కావాలసిన అన్ని సౌకర్యాలను వ్యవసాయ శాఖ కల్పించాలని, ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగాలని కేబినెట్ స్పష్టం చేసింది.  ఉద్యానవన శాఖను పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా మార్చాలని అందుకు అవసరమైన రీతిలో అధికారులను నిపుణులను జోడించి నిరంతరంగా రైతులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది.

పౌర సరఫరాల శాఖ సహా వ్యవసాయ శాఖలో ఎటువంటి ఉద్యోగాలు ఖాళీలు ఉండకూడదని, అన్ని పోస్టులను నింపుకోవాలని కేబినెట్ ఆదేశించింది. పండిన ధాన్యాన్ని పండినట్టే  ఫుడ్ ప్రాసెసింగ్ లో భాగంగా  మిల్లింగ్ చేసి ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడికి సరఫరా చేయాలన్నది. ఈ దిశగా  అన్ని చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది. అందుకు అవసరమైతే సంబంధిత రంగంలో నిపుణుల సలహాలు సూచనలు తీసుకోవాలని కేబినెట్ సూచించింది. నూతనంగా ముందుకు వచ్చే అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలని మంత్రి మండలి అధికారులను ఆదేశించింది.

కేబినెట్ సబ్ కమిటీ :

రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరుగనున్ననేపథ్యంలో.. ధాన్యం నిల్వ, మిల్లింగ్, మార్కెటింగ్ సహా నూతన పరిశ్రమల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని రాష్ట్ర మంత్రి మండలి ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీలో సభ్యులుగా, మంత్రి గంగుల కమలాకర్, హరీశ్ రావు, కెటిఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి… ఉంటారు.

ఆయిల్ ఫామ్ సాగు ను ప్రోత్సహించాలి :

రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. రానున్న 2022 – 23 సంవత్సరానికి వరకు 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టే దిశగా రైతులను చైతన్యపరిచి ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా.. ఆయిల్ ఫామ్ సాగుచేసే రైతులకు ఎకరాకు, మొదటి సంవత్సరం రూ.26,000., రెండవ సంవత్సరం ఎకరాకు రూ.5000., మూడవ సంవత్సరం ఎకరాకు రూ. 5,000 చొప్పున పంట పెట్టుబడి ప్రోత్సాహకం కింద సబ్సిడీగా అందచేయాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా అటవీ శాఖ, అటవీ అభివృద్ధి కార్పోరేషన్ తో పాటు పంచాయితీరాజ్ మరియు రూరల్ డెవలప్ మెంట్ శాఖల సహాయంతో ఆయిల్ ఫామ్ మొక్కల నర్సరీలను పెంచాలని కేబినెట్ సూచించింది. ఆయిల్ ఫామ్ పంట విధానం గురించి మరింతగా తెలుసుకోవడానికి మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులతో కూడిన  అధ్యయన బృందం, కోస్టారికా, మలేషియా, థాయ్ లాండ్, ఇండోనేషియా తదితర దేశాలలో పర్యటన చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది.

ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్లకు, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూయర్ అడ్వాన్స్మెంట్ (టి ఐడిఈఏ), తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల (టి ఎస్ ఎఫ్ పి జెడ్)   నిబంధనల ప్రకారం  అందించే ప్రోత్సాహకాలు అందచేయాలని అధికారులకు కేబినెట్ సూచించింది.

 ‘తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ’ కి కేబినెట్ ఆమోదం :

 ‘తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ’ కి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున స్థాపించాలని కేబినెట్ నిర్ణయించింది.  రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో  కనీసం 10 జోన్లను  ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 500 ఎకరాలకు తగ్గకుండా 1000 ఎకరాల వరకు తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటు చేసి 2024 -25 సంవత్సరం వరకు రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఎకరాలల్లో ఏర్పాటు లక్ష్యంగా చర్యలు చేపట్టాలని  అధికారులను కేబినెట్ ఆదేశించింది.  ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ మార్గదర్శకాల ద్వారా ప్రోత్సాహకాలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది.

ప్రభుత్వం భూమిని సేకరించి ఏర్పాటు చేసిన జోన్లలో అన్ని మౌలిక వసతులను ప్రభుత్వమే అభివృద్ది చేసి దరఖాస్తు చేసుకున్నవారికి అర్హతమేరకు అందులో భూమిని కేటాయించాలని, తద్వారా సుమారు 25 వేల కోట్ల పెట్టుబడిని ఆకర్షించి, 70 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి 3 లక్షల మందికి పరోక్ష ఉపాధిని కల్పించాలని నిర్ణయించింది. విదేశాలకు ఎగుమతి చేసే నాణ్యతతో కూడిన స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సహకాలు అందించాలని, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ప్రత్యేకంగా ‘ప్లగ్ అండ్ ప్లే’ పద్దతిలో షెడ్లను ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయించింది.

వ్యవసాయ రంగంలో సాంకేతికతను మరియు నైపుణ్యాన్ని పెంచే దిశగా  ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ విధానాన్ని అమలు పరచాలని అధికారులను అదేశించింది. రైస్ మిల్లులు, బియ్యం ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు , పండ్లు, పూలు, కూరగాయలు, మాంసం, చేపలు, కోల్లు, పాలు మరియు డైరీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లను ఈ విధానం ద్వారా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఫుడ్ ప్రాసెసింగ్   జోన్ల చుట్టూ కనీసం 500 మీటర్ల వరకు బఫర్ జోన్ గా గుర్తించి ఎలాంటి జనావాసాలకు, నిర్మాణాలను అనుమతించకూడదని స్పష్టం చేసింది.

ఆసక్తి కలిగిన వ్యాపారవేత్తలు ఎంటర్ ప్రెన్యూర్స్ దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్థుతం జూలై 12 వరకు వున్న ఆఖరు తేదీని జూలై 31 వరకు పొడిగించాలని కేబినెట్ నిర్ణయించింది.

 పాలసీ లో భాగంగా రూపొందించిన మార్గదర్శకాల పై చర్చించిన కేబినెట్ :

రాష్ట్ర నీటిపారుదల సామర్థ్యంలో గణనీయమైన పెరుగుదల కారణంగా వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్థక, పాడి మరియు మత్స్య రంగాలలో సాధించే అదనపు ఉత్పత్తిని ప్రాసెసింగ్ చేసేందుకు రాష్ట్రంలో అనువైన సామర్థ్యం సృష్టించబడిందని కేబినెట్ నిర్ధారించింది. ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల స్థాపన ద్వారా, వాల్యూ చైన్ ముందుకు సాగడానికి, ఉత్పత్తిదారులకు,  రైతు సంఘాలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్ధిక ప్రోత్సహకాలు కల్పించాలని, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా, గ్రామీణ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను సృష్టించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల అభివృద్ధితో ఆర్థిక కార్యకలాపాలు పెరిగి, తద్వారా ఉపాధి పెరిగి, రాష్ట్రంలోని గ్రామీణ మారుమూల వెనకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్దికి దారి తీస్తుందని కేబినెట్ ఆశాభావం వ్యక్తం చేసింది.

గ్రామీణ ఎస్సీ ఎస్టీ  మహిళలకు జోన్లల్లో  వ్యవస్థాపక అవకాశాలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని నిర్ణయం చేసింది.

రాష్ట్రంతో పాటు దేశ విదేశాలకు  ప్రాసెస్ చేసిన ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి వీలు కల్పించే దిశగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ప్రోత్సాహం అందించాలని, ఈ ప్రోత్సాహకాల్లో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల లో స్థాపించే యూనిట్లకు పలు విధాల రాయితీలను అందించాలని కేబినెట్ నిర్ణయించింది.

ఇందులో భాగంగా..

1). కరెంటు సబ్సిడీ ని ప్రతి యూనిట్ కు రెండు రూపాయల చొప్పున 5 సంవత్సరాల దాకా అందించాలని నిర్ణయించింది.

2). పెట్టుబడికోసం తీసుకున్న టర్మ్ లోన్ పై చెల్లించాల్సిన మొత్తం వడ్డీలో 75 శాతం వడ్డీని ( (రెండు కోట్లకు మించకుండా) రియంబర్స్ చేయాలని నిర్ణయం.

3). మార్కెట్ కమిటీకి చెల్లించాల్సిన ఫీజును, ఏడు సంవత్సరాల కాలం వరకు 100 శాతం రియంబర్స్మెంటు చేయాలని నిర్ణయం.

4). ఆహార ఉత్పత్తులను, స్టోరేజీకి తరలింపు తదితర లాజిస్టిక్స్ కోసం కూడా ఈ జోన్లలో ప్రత్యేకంగా భూమిని కేటాయించి వాణిజ్యాభివృద్ధికి తోడ్పాటునందించాలని నిర్ణయించింది.

పైన తెలిపిన సాధారణ ప్రోత్సహకాలకు అదనంగా…

ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అధనపు ప్రోత్సహకాలందించాలని కేబినెట్ నిర్ణయించింది.

1).15 శాతం మూలధనాన్ని  (20 లక్షలకు మించకుండా) మంజూరు చేయడం.

2). మూలధనం లోన్ పై చెల్లించాల్సిన వడ్డీలో ని 10 శాతం రియంబర్స్ మెంట్ (85 శాతం)(రెండు కోట్ల వడ్డీకి మించకుండా) చేయడం.

3).అర్హులైన వారికి జోన్లలో కేటాయించిన భూమి కొనుగోలు ధర మీద 33 శాతం సబ్సిడీ ( 20 లక్షలకు మించకుండా సబ్సిడీ) అందించడం.

స్వయం సహాయక సంఘాలు మరియు రైతు సంఘాలకు (ఎఫ్ పీ వో ) కూడా అధనపు ప్రోత్సహకాలు  అందించాలని కేబినెట్ నిర్ణయించింది.

ఇందులో భాగంగా పైన తెల్పిన సాధారణ ప్రోత్సహకాలకు అధనంగా…

1).15 శాతం మూల ధనం మంజూరు (రూ.1 కోటి మించకుండా) చేయాలని నిర్ణయం

2).మూలధనం లోన్ పై చెల్లించాల్సిన వడ్డీలో ని 10 శాతం రియంబర్స్ మెంట్ (80 శాతం)(రెండు కోట్ల వడ్డీకి మించకుండా) చేయాలి.

3).భూమి విలువ మీద 33 శాతం వరకు సబ్సిడీ ( 20 లక్షలకు మించకుండా) అందించాలని కేబినెట్ నిర్ణయించింది.

తెలంగాణ లాజిస్టిక్స్ పాలసీ’ కి కేబినెట్ ఆమోదం :

 తెలంగాణ లాజిస్టిక్స్ పాలసీ’ కి కేబినెట్ ఆమోదం తెలిపింది. పారిశ్రామిక, ఈ కామర్స్, సేవా రంగాలలో రాష్ట్రం దినదినాభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో, అందుకనుగుణంగా లాజిస్టిక్స్ రంగాన్ని ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. అందులో భాగంగా పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ రూపొందించిన ‘ తెలంగాణ లాజిస్టిక్స్ పాలసి’ ని కేబినెట్ ఆమోదం తెలిపింది.

కరోనా నేపథ్యంలో, బయట తిరగలేని పరిస్థితుల్లో ప్రజలకు వస్తు సేవలు అందుబాటులోకి రావడానికి లాజిస్టిక్స్ రంగం ఎంతగానో ఉపయోగ పడ్డదని  కేబినెట్ గుర్తించింది. అంతర్జాతీయ ఈ కామర్స్ సంస్థలు లాజిస్టిక్ రంగాన్ని వినియోగించుకుని ప్రపంచ వ్యాప్తంగా సేవలందిస్తున్నాయన్నది.

ఈ నేపథ్యంలో  రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక , వ్యవసాయ అభివృద్దిలో ఆయా ఉత్పత్తులను దేశ విదేశీ వినియోగదారుల చెంతకు చేర్చడానికి లాజిస్టిక్స్ రంగాన్ని ప్రోత్సహించడం తక్షణావసరమని కేబినెట్ అభిప్రాయపడింది. వ్యవసాయ రంగంలో సాధించిన అభివృద్ధి తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా సాధించే అధనపు  వాణిజ్యానికి లాజిస్టిక్ రంగాభివృద్ధి ఎంతో అవసరం అని గుర్తించింది.

రాష్ట్రంలో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, డ్రై పోర్టులు, ట్రక్ డాక్ పార్కింగ్ సహా తదితర లాజిస్టిక్స్ రంగాల్లో మౌలిక వసతులను మెరుగు పరచాలని కేబినెట్ నిర్ణయించింది. అన్నిరకాల రంగాలకు చెందిన వస్తువుల నిల్వ సామర్ధ్యం పెంచుకోవడానికి లాజిస్టిక్స్ పాలసీ చేయూతనిస్తుందని కేబినెట్ అభిప్రాయ పడింది. తెలంగాణ లాజిస్టిక్స్  పాలసీలో  భాగంగా… రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు, వేర్ హౌజ్ లను ఏర్పాటు చేసే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పలు రకాల ప్రోత్సహకాలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది.

తద్వారా.. రాష్ట్ట్ర వ్యాప్తంగా లాజిస్టిక్స్ రంగాభివృద్ధి ద్వారా పత్యక్షంగా 1 లక్ష మందికి, పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని, అందుకోసం రాష్ట్రానికి దాదాపు 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖకు కేబినెట్ సూచించింది.

ఉద్యోగ ఖాళీల భర్తీ పై చర్చ..నిర్ణయాలు :

కేబినెట్ సమావేశానికి హాజరైన అన్ని శాఖల కార్యదర్శులు, వివిధ శాఖలలో వున్న ఉద్యోగుల వివరాలను ఖాళీల వివరాలను కేబినెట్ కు అందించారు.  ప్రతి విభాగంలో మంజూరీ అయివున్న పోస్టుల సంఖ్యను, వివిధ కేటగిరీల్లో వున్న ఖాళీల వివరాలతో పాటు అందులో పనిచేస్తున్న కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను కూడా కెబినెట్ ముందుంచారు.

కొత్త జోనల్ వ్యవస్థ, కొత్త జిల్లాల ప్రకారంగా అన్ని రకాల ఉద్యోగుల విభజన జరగాలని, తద్వారా జిల్లాల వారీగా జోన్ల వారీగా అన్ని ఖాళీలను గుర్తించాలని, వాటితో పాటు ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. సమాజంలో , ఉద్యోగ రంగాల్లో చోటుచేసుకుంటున్న అధునాతన మార్పులకు అనుగుణంగా, వినూత్న రీతిలో ఉద్యోగాల కల్పన అవసరమని అందుకు సరికొత్త పోస్టుల అవసరం పడుతున్నదని కేబినెట్ అభిప్రాయ పడింది.  అదే సందర్భంలో కాలం చెల్లిన కొన్ని పోస్టుల అవసరం లేకుండా పోతున్నదని, కాలానుగుణంగా ఉద్యోగ వ్యవస్థలో కూడా మార్పులు చోటు చేసుకోవాలని సూచించింది. తద్వారా ప్రజలకు మరింత చేరువగా పాలనను తీసుకెల్లి వారికి ప్రభుత్వ సేవలందించే వ్యవస్థను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఏర్పాటు చేసుకోవాలని, ఆ దిశగా చర్యలకు పూనుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులను అధికారులను కేబినెట్ ఆదేశించింది.

రెండు రాష్ట్రాల నడుమ ఉద్యోగుల విభజన పూర్తయిందని, ఆంద్రాలో మిగిలిన ఉద్యోగులను కూడా ఈ మధ్యనే తెలంగాణకు తెచ్చుకున్నామని కేబినెట్ తెలిపింది. ఇంకాకూడా మిగిలిపోయిన 200 నుంచి 300 తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రానుంచి తీసుకురాబోతున్నామన్నది.  ఈ అన్ని సందర్భాలను దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రా నుంచి వచ్చే ఉద్యోగులందరినీ  కలుపుకుని ఇంకా మిగిలివున్న ఖాళీలను సత్వరమే గుర్తించి, మంత్రి హరీశ్ రావు నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక అందచేయాలని, మంత్రి మండలి అధికారులను ఆదేశించింది. అన్ని ప్రభుత్వ సంస్థలకు చెందిన ఆస్తులను క్రోడీకరించి జిల్లా వారీగా విభాగాల వారీగా సంకలనం చేయాలని కేబినెట్ ఆదేశించింది. ప్రస్థుత ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య,  ఖాళీల సంఖ్యకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, అన్ని విభాగాలనుంచి 5 రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని కేబినెట్ ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *