Saturday, January 18, 2025
HomeTrending Newsపాకిస్థాన్ సరిహద్దుల్లో పర్యాటక రైల్వే స్టేషన్

పాకిస్థాన్ సరిహద్దుల్లో పర్యాటక రైల్వే స్టేషన్

రాజస్థాన్ లోని మునబావ్ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే ఈ గ్రామం భారత దేశ పశ్చిమ దిశలో చివరి రైల్వే స్టేషన్. ఇది బార్మేర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. జైసల్మేర్ నుంఛి 180 కిలోమీటర్ల దూరంలో ఉండే మునబావోకు వెళ్లే రహదారి థార్ ఎడారి మీదుగా సాగుతుంది.

వేసవిలో ఎడారి నుంచి అధిక వేగంతో వీచే గాలుల ధాటికి కొన్ని సందర్భాల్లో రోడ్డు ఇసుక దిబ్బలలో కలిసి పోతుంది. వేసవిలో మండే ఎండలు ఉంటాయి. దీంతో పర్యాటకులు శీతాకాలంలో విచ్చేస్తుంటారు. గత పదేళ్లుగా ఈ ప్రాంతంలో పర్యాటకులకు విడిది ఏర్పాట్లు ప్రైవేటు రంగంలో విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి.

ఎడారి నైట్ క్యాంపుల్లో పర్యాటకుల విడిది మరువలేనిది. జైసల్మేర్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖురి వరకు అనేక ఎడారి శిబిరాలు, రిసార్ట్‌లు ఉన్నాయి.

జోధ్‌పూర్ నుంచి కరాచీ రైలు మార్గంలో చివరి భారతీయ రైల్వే స్టేషన్ మునబావ్. అమృత్‌సర్-లాహోర్ రైలు మార్గం కాకుండా భారతదేశం – పాకిస్తాన్ మధ్య ఉన్న రెండవ రైలు మార్గం ఇదే కావటం గమనార్హం. పాక్ వైపు ఖోక్రపార్ చివరి రైల్వే స్టేషన్ కాగా భారత్ వైపు చివరిది మునబావ్ రైల్వే స్టేషన్.

బార్మేర్ నుంచి మునబావ్ వరకు ప్రతిరోజూ ఒక ప్యాసింజర్ రైలు నడుస్తుంది. ఇది బార్మేర్ లో ఉదయం 07:30కి బయలుదేరి 09:40కి మునబావ్ చేరుకుంటుంది. మునాబావ్ లో  దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు ఆగిన తర్వాత తిరిగి బార్మేర్ వస్తుంది. టిక్కెట్ ధర ఒక్కొక్కరికి  30 రూపాయలు కాగా ఈ రైలులో బర్మేర్ నుంచి మునబావ్ ప్రయాణం ఆసక్తికరంగా ఉంటుంది.
గతంలో ఇక్కడి నుంచి థార్ ఎక్స్‌ప్రెస్ కరాచీకి వెళ్లేది. మునబావో-ఖోఖ్రాపర్ సరిహద్దు మీదుగా రైలు మార్గాన్ని 2006లో పునరుద్ధరించారు. భారత- పాకిస్తాన్ ల మధ్య ఒప్పందం ప్రకారం థార్ ఎక్స్‌ప్రెస్ కరాచీ నుంఛి వారానికి ఒకసారి వెళ్ళేది. సరిహద్దుల్లో జీరో పాయింట్ స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడ ప్రయాణికులు రైలు మారే విధంగా నిబంధనలు పెట్టారు.

పాకిస్తాన్ వైపు వెళ్ళే ప్రయాణీకుల కోసం మునబావ్ లో 2017లో ఏసి హాలు అందుబాటులోకి తీసుకొచ్చింది రైల్వే శాఖ. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మార్గంలో ప్రస్తుతం పాకిస్తాన్ కు రైళ్ళు నడవటం లేదు. రైల్వే స్టేషన్ చూడటానికి చిన్నదే అయినా అందంగా ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ ప్రాంతంలో జింకలు, ఒంటెలు, ఆవులు సేదతీరుతుంటాయి.

రోడ్డు మార్గంలో మునబావ్ వెళ్ళాలన్నా…థార్ ఎడారి అందాలు ఆస్వాదించేందుకు పర్యాటకులు రాత్రి వేళల్లో ప్రయాణం చేయటం క్షేమకరం కాదని రాజస్థాన్ పోలీసు శాఖ హెచ్చరిస్తోంది. ఎడారి మార్గంలో కనుచూపు మేరలో మనుషులు కనిపించరు. దీంతో దారి దోపిడీలు జరుగుతుంటాయని… అపరిచితులతో జాగ్రత్తగా మసలుకోవాలని సూచిస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్