Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఆమె పేరు మేరీ ఆన్ బెవన్. ఆమెను ప్రపంచంలోనే వికారమైన స్త్రీ అని పిలవబడ్డారు. మేరీ ఆన్ అక్రోమలియా అనే వ్యాధికి లోనయ్యారు. అసాధారణ ఎదుగుదలతో ఆమె ముఖం మారిపోయింది. భర్త మరణించాక ఆమె తన నలుగురు పిల్లలను పెంచడానికి అప్పులు చేశారు. ఒకవైపు వాటిని తీర్చలేక మరింత డబ్బు కావలసివచ్చింది. దాంతో ఓ నిర్ణయానికి వచ్చి అవమానపరిచే పోటీలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే వికార రూపంగల స్త్రీ అనే అవార్డు పొందారు.

అనంతరం ఆమెకు ఓ ఉద్యోగం వచ్చింది. అదొక సర్కస్ కంపెనీ. ఆమె పని ప్రేక్షకులను నవ్వించడం. ఇందుకోసం ఆమెను రకరకాలుగా అవమానపరుస్తూ కించపరుస్తూ మాటలంటుంటే వాటికి ప్రేక్షకులు నవ్వేవారు. ఇందుకోసం ఆమెను పలు నగరాలకు తీసుకుపోయేవారు. తన పిల్లలను పెంచి పెద్దచేయడంతోపాటు వారికి మంచి జీవితం ఇవ్వడంకోసం ఆమె ఇతరులను నవ్వించడంకోసం అవహేళనకు గురవుతుండేవారు. మనసు చంపుకుని ఆ హేళన స్వరాన్ని భరించారు. 1933లో ఆమె మరణించారు. మేరీ ఆన్ ఉన్నన్ని రోజులూ ఆమెను తక్కువ చేసి మాటలంటుంటే నవ్విన కళ్ళు ఆమె రూపాన్ని కాక ఆత్మసౌందర్యాన్ని చూసి ఉంటే ప్రపంచంలోనే ఓ అందమైన మహిళగా ఉండేవారు. ఒక్కసారి ఆమె జీవిత పయనాన్ని పరికిద్దాం.

మేరీ ఆన్ బెవన్ 1874లో జన్మించినప్పుడు, ఆమె ఎంతో అందంగా ఉందని, ఆరోగ్యకరమైన శిశువని అందరూ చెప్పుకునేవారు. మేరీ ఆన్ ఓ పెద్ద కుటుంబంలో పుట్టారు. ఇంగ్లండులోని కెంట్‌లో పెరిగారు. నర్సుగా మారి లండన్‌లో ఉద్యోగం చేస్తూ ఓ మంచి కుటుంబ స్త్రీగా ఉండాలని కలలు కన్నారు. ఇరవై ఏళ్ళకు ఈ అందమైన నర్సుకి థామస్ బెవన్‌తో వివాహమైంది. నలుగురు పిల్లలు పుట్టారు. ఆనందంగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఆకస్మికంగా కష్టాలు మొదల య్యాయి.

ఆమె అక్రోమలియా అనే వ్యాధికి గురయ్యారు. పిట్యూటరీ గ్రంధిలో “గ్రోత్ హార్మోన్” అధిక ఉత్పత్తి కారణంగా చేతులు, కాళ్ళు, ముఖం అసాధారణంగా పెరిగాయి. అప్పటివరకూ అందరినీ ఆకట్టుకున్న ఆమె అందమైన రూపం కాస్తా వికారంగా మారిపోయింది. చూసేవొరందరూ అసహ్యించుకునే అందవిహీనమైన రూపాన్ని భరించవలసివచ్చింది. ఆమెలో భయాందోళనలు మొదలయ్యాయి. అప్పట్లో ఊహించని ఈ వ్యాధికి సరైన చికిత్స లేదు. అయినప్పటికీ ఆమెను ఏమాత్రం కష్టపెట్టక అనురాగాన్ని పంచుతున్న భర్త ఉన్నట్టుండి మరణించాడు. ఇక చెప్పనలవి కాని కష్టాలు. కన్నీళ్ళతో రోజులు గడుస్తున్నాయి.

ఇంతలో ఓ సర్కస్ యజమాని ఒక వార్తాపత్రికతో మాట్లాడుతూ అతి వికారరూపం కలిగిన మహిళ కావాలని, డబ్బులిస్తామని చెప్పాడు. ఈ మాటలు చెవినపడటంతోనే ఆమె ఓ నిర్ణయానికి వచ్చారు. కుటుంబాన్ని పోషించడానికి ఇదే మార్గమని సర్కస్ కంపెనీలో చేరారు. “ది అగ్లియెస్ట్ ఉమెన్ ఇన్ ది వరల్డ్” గా ఆమెను ప్రకటించి నగరాలు తిప్పుతూ నానా మాటలంటూ డబ్బులు గడించిన సర్కస్ కంపెనీ ఆమెకు కొంత డబ్బు ఇస్తూ వచ్చింది. ఆ డబ్బుతోనే నలుగురు పిల్లలనూ పెంచారు. అంతేకాదు, ఆమె వికారాకారాన్ని ఫోటో కార్డులు అమ్మేవారు. వాటివల్ల కూడా ఓ నాలుగు డబ్బులు వచ్చేవి. ఆమెను అందహీనమైన మహిళగా అమెరికాకు తీసుకువెళ్ళారు. ఆమె 1920లో ఇంగ్లండ్‌ను విడిచిపెట్టారు.

అమెరికాలో ఒకసారి, ఆమెతో హాస్యాస్పదమైన వస్త్రధారణ చేయించి చూసీచూడటంతోనే నవ్వేలా చేసి హేళన చేశారు. అయినా ఆమె వాటన్నింటినీ భరించారు. తన పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఒకే లక్ష్యంతో మాటలు పడుతూవచ్చారు. ఓ రెండేళ్ళ వ్యవధిలో ఆమె ఇరవై వేల పౌండ్లు సంపాదించారు. ఈరోజుల్లో అది అయిదు లక్షల పౌండ్లకు సమానం. ఆమె తన పిల్లలను బోర్డింగ్ స్కూల్లో చదివించారు. పిల్లలకూ తరచూ ఆమె ఉత్తరాలు రాస్తుండేవారు. వారి బాగోగులు తెలుసుకునేవారు. ఆమె తన యాభై తొమ్మిదో ఏట మరణించారు. అంతిమ సంస్కారం ఇంగ్లండులోనే చేశారు.

ఒక మహిళ జీవనోపాధి కోసం తనను తాను అవమానించుకునేలా చేసుకోవడం భావ్యం కాదన్న వారున్నారు. అగ్లియెస్ట్ ఉమన్ ఐనే ఫోటో కార్డు ముద్రించడాన్ని తెలిసి నెదర్లాండ్స్‌లోని ఓ వైద్యకేంద్రం విమర్శించింది. అది తప్పని దుయ్యబట్టింది. అందవిహీనంతో బాధపడుతున్న వారిని ఈ ఫోటోకార్డు అవమానకరమని ప్రకటించింది. ఇటువంటివాటిని ప్రోత్సహించకూడదంది. నలుగురూ ఖండించాలంది.

– యామిజాల జగదీశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com