Sunday, January 26, 2025

మన భాష- 10

సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న మాటల్లో మహాప్రాణాలు అంటే ఒత్తక్షరాలు ఉంటాయి. మన భాషలో అవిలేవు కాబట్టి ఈ మహాప్రాణాలు అల్పప్రాణాలుగా మారవచ్చు. అంటే ఖ-క కావచ్చు. అయితే ఈ సంస్కృత పదాలతో విస్తృతమయిన పరిచయం మనకు ఏర్పడింది. అందువల్ల అటువంటి మార్పులేకుండా వాటిని ఉన్నదున్నట్లుగా వాడడం అలవాటయిపోయింది. కాని చాలా మాటలలో మహాప్రాణం ఉందో లేదో, ఉంటే మాటలోని ఏ అక్షరం మహాప్రాణమో అన్న విషయంలో సందేహం కలగవచ్చు. ఈ సందేహంవల్ల పొరపాట్లు దొర్లడానికి అవకాశాలున్నాయి. ఉదాహరణకు బాధ, భేదం అనే రెండు మాటలను తీసుకోవచ్చు. కొంతమంది భాద అని రాయడమూ, బేధం అని రాయడమూ కనిపిస్తుంది. ఎవరయినా భాధ, భేధం అని రెండింటికీ ఒత్తులు పెట్టి రాసినా రాయవచ్చు. మనం ఈనాడు రాస్తున్న భాషలో ఇటువంటి పదాలెన్నో ఉన్నాయి. సంస్కృత భాషాజ్ఞానం బాగా ఉన్నవారికి ఇటువంటి మాటలను రాయడంలో సమస్య ఏమీ ఉండదు. కాని శబ్దస్వరూపం తెలియకపోతే వర్ణక్రమం విషయంలో అనుమానాలు వస్తూనే ఉంటాయి.

ఈ మాటలను రాయడంలో ప్రధానంగా మూడు రకాల పొరపాట్లు జరగవచ్చు. వీటిలో మొదటిది ఒత్తు అవసరం లేనిచోట పెట్టడం. దీనివల్ల అర్థభంగం కూడా కలగవచ్చు. ఉదాహరణకు ప్రదానం అనేమాటను ప్రధానం అనిరాస్తే అర్థమే మారిపోతుంది. ప్రధానం అంటే ముఖ్యం అని అర్థం. అదే ప్రదానం అంటే ఇవ్వడం అని అర్థం. వీటిని ఒక దానికి బదులు ఒకటి వాడడంవల్ల అర్థభంగం కలుగుతుంది. బహుమతి ప్రదానం, పట్టప్రదానం మొదలయిన విధంగా ఈ ప్రదాన శబ్దానికి ప్రయోగం ఎక్కువ. ప్రదాన శబ్దం దద ధాతువునుండి ఏర్పడితే ప్రధాన శబ్దం దధ ధాతువు నుండి ఏర్పడింది. ప్ర – ఉపసర్గ. ప్రకృష్టమైనదని అర్థం. ఈ రెండు మాటలకు అర్థంలో ఇంతభేదం ఉంది.

ప్రబలడం అనేమాటకు తెలుగులో వాడుక ఎక్కువే. ‘అవినీతి ప్రబలుతోంది’, ‘ప్రబలమైన శత్రువు’, ‘కోరిక ప్రబలంగా ఉంది’ వంటి ప్రయోగాలు చేస్తాం. దీన్ని క్రియగా, విశేషణంగా, క్రియావిశేషణంగా, నామవాచకంగా కూడా వాడతాం. ప్రబలం ప్రాబల్యం అన్నవి నామవాచక రూపాలు. ఈ మాటను ప్రభలం, ప్రాభల్యం అని మహాప్రాణంతో రాయకూడదు.

అవలంబించు అనే మాటలో కూడా మహాప్రాణంలేదు. అవలంభించు అన్న ప్రయోగం సరయింది కాదు. అవలంబన, ఆలంబన పదాలు కూడా ఇంతే.

విదితం అంటే అవగతం, తెలిసినది. దీన్ని విధితం అని రాయకూడదు. విధింపబడినది అని అనుకొనే ప్రమాదం ఉంది. విధి అనే మాటనుండి విధ్యుక్త ధర్మం అనే పదబంధం ఏర్పడుతుంది. విధి చెప్పినటువంటి ధర్మం, కర్తవ్యం అని దీనికి అర్థం. దీన్ని విద్యుక్త ధర్మం అనరాదు. రోదన అంటే ఏడుపు, రోదించు అంటే ఏడ్చు. దీన్ని రోధించు అనిరాస్తే అడ్డుపెట్టు అని అర్థం వస్తుంది. నిరోధించు ‘ని’ అనే ఉపసర్గ చేర్చడంవల్ల ఏర్పడింది.

వదాన్యుడు అంటే దాత. దీన్ని వధాన్యుడు అని మహాప్రాణంతో రాయకూడదు. శాకాహారం, శంకుస్థాపన అనే పదాలను చాలా మంది శాఖాహారం, శంఖుస్థాపన అని రాస్తుంటారు. శాకాహారం మాంసాహారానికి వ్యతిరేకం. వెజిటేరియన్ అన్నమాట. శాఖ అంటే కొమ్మ అనే అర్థం ఉంది కాబట్టి కొమ్మలనుండి అంటే చెట్ల నుండి వచ్చిన ఆహారం అని అనుకో వడం వల్లనేమో దీన్ని శాఖాహారం అనడం సర్వత్రా కనిపిస్తుంది. ఏ వెజిటేరియన్ హోటల్ బోర్డు చూసినా దానిమీద శాఖాహార హోటల్ అన్న ప్రయోగం కనిపించకతప్పదు. అట్లాగే శంకుస్థాపన కూడా. ఏదైనా కట్టడాన్ని నిర్మించాలని తలపెట్టినప్పుడు శంకుస్థాపన చేస్తారు. ఇక్కడ శంఖానికి కాని, శంఖువుకుకాని స్థానంలేదు. అయినా ఈ శంకు శబ్దమేమిటో తెలియకపోవడం వల్లా, శంఖ శబ్దం బాగా పరిచితమై ఉండడంవల్లా ఈ పదబంధంలో మొదటి పదం ‘శంఖ’ అనుకోవడమే చాలా మంది శంఖుస్థాపన అని రాయడానికి కారణం.

ఉచ్చారణలో కూడా మహాప్రాణం లేదు. ఉచ్ఛారణ అని రాయడం సరికాదు. అట్లాగే జటిలం, జాడ్యం సరయినవి. జఠిల, జాఢ్యం సరికావు.

ఒక్కొక్కసారి సమాసంలో ఒక పదంలో మహాప్రాణం ఉంటే తరువాతి మాటలో మహాప్రాణం లేకపోయినా మొదటిపదం ప్రభావంతో అందులో కూడా మహాప్రాణం రాస్తూ ఉంటాం, ఉదాహరణకు ‘ధూపదీప నైవేద్యాలు’ అన్న సమాసాన్ని తీసికోవచ్చు. ఈ సమాసంలో మూడు మాటలున్నాయి. ధూపం, దీపం, నైవేద్యం. ఈ ధూపం ప్రభావంవల్ల ధూపధీప అని రాసే ప్రమాదం ఉంటుంది. నైవేద్యం కూడా నైవేధ్యం అయినా కావచ్చు.

ఇదమిత్థం అనే పదబంధంలో ఇదమ్, ఇత్థమ్ అనే రెండు మాటలున్నాయి. ఇది ఇది అని అర్థం, ఇదమిత్థంగా తేల్చిచెప్పడం లేదు అంటాం. ఇదీ అని కచ్చితంగా తేల్చిచెప్పడం లేదు అని అర్థం.

అస్తవ్యస్తం అంటే గందరగోళం, చిందరవందర, గట్టిగా చెప్పాలన్న ఉద్దేశమేమో అస్థవ్యస్థం అని రాస్తుంటారు. ఇది సరికాదు.

దశాబ్ది అంటే పదేళ్ళు, శతాబ్ది అంటే నూరేళ్ళు, సహస్రాబ్ది అంటే వెయ్యేళ్ళు. అబ్దశబ్దానికి సంవత్సరమనీ, మేఘమనీ అర్థాలు. అప్ అంటే నీరు. నీరు ఇస్తుంది కాబట్టి మేఘం అబ్దం. దశాబ్ది మొదలయిన పదాలలో అబ్ద శబ్దానికి సంవత్సరమనే అర్థం. దశాబ్దికి బదులు దశాబ్ధి అని రాస్తే అర్థం మారిపోతుంది. అబ్ధి అంటే సముద్రం. అందువల్ల ఈ రెండింటినీ ఒకదాని బదులు ఒకటి వాడకూడదు.

మనస్తాపంలో మనస్, తాపం అనే రెండు మాటలున్నాయి. కలిపితే మనస్తాపం అవుతుంది. మహాప్రాణంతో మనస్థాపం అనిరాయడం సరికాదు.

మద్యం, మధ్యం వేరువేరు మాటలు. మద్యం అంటే మదిర. దీనికి సుర అనీ, ఇరా అనీ, కాదంబరి అనీ ఇంకా చాలా పేర్లున్నాయి. దీనివల్ల మదిస్తారు కాబట్టి ఇది మద్యం. బాగా పుచ్చుకుంటారు కాబట్టి సుర. దీనివల్ల తిరుగుతారు కాబట్టి ఇర. గోమంత పర్వతంలో కదంబవృక్షం తొర్రలో పుట్టింది కాబట్టి కాదంబరి. మదిరకూ మద్యానికీ ఒకటే వ్యుత్పత్తి. మధ్యం అంటే నడిమిభాగం అని అర్థం.

ఇట్లా అల్పప్రాణాలు మహాప్రాణాలుగా రాయడం తెలుగు మాటలకూ, అన్యదేశ్యాలకూ కూడా వ్యాపించింది. జాము ఝాము అయింది. దీటు ధీటు అయింది. దరఖాస్తు ధరఖాస్తు అయింది. వీటిలో మహాప్రాణాలు లేవు.

(ఇందులో వాడిన ఫోటోలు Mee Education, V nootnam, RS Telugu Channel యూట్యూబ్ వారివి. వారికి కృతఙ్ఞతలు)

-డి. చంద్రశేఖర రెడ్డి
98661 95673
రేపు:-
మన భాష- 11
“మహాప్రాణాలు తారుమారు చేయవద్దు”

RELATED ARTICLES

Most Popular

న్యూస్