మధ్యధార తూర్పు దేశాల్లో కరోన కేసులు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O) ఆందోళన వ్యక్తం చేసింది. నెల రోజుల నుంచి 22 దేశాల్లో కోవిడ్ వ్యాప్తి వేగంగా జరుగుతోందని సంస్థ ప్రతినిధి వెల్లడించారు. తూర్పు మధ్యధార ప్రాంతంలో లిబియా, ఈజిప్ట్, ట్యునీషియా, మొరాకో, సుడాన్ మొదలైన ఉత్తర ఆఫ్రికా దేశాలు, సిరియా, పాలస్తీనా ఇరాన్, ఇరాక్, లెబనాన్ తదితర ఆసియ దేశాలు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రయాణాలు, కరోన రక్షణ చర్యల్లో వైఫల్యం, వ్యాక్సినేషన్ అంతగా జరగకపోవటం కేసుల పెరుగుదలకు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది.
కరోన మహమ్మారితో ఇరాక్ లో లెక్కకు మించి ప్రజలు మరణించారు. ఇరాన్ లో కూడా గణనీయ స్థాయిలో కోవిడ్ వ్యాప్తి జరిగి గ్రామీణ ప్రాంతాల్లో అధికమంది మృత్యువాత పడ్డారు. మధ్యధార తూర్పు దేశాల్లో జూలై, ఆగస్ట్ నెలల్లో వేసవి కాలం కావటంతో కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని, ఈ దేశాలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ ప్రాంతంలోని 22 దేశాలకు గాను 13 దేశాల్లో డెల్టా రకం వేగంగా విస్తరిస్తోంది.
వ్యాక్సినేషన్ అనుకున్నంత స్థాయిలో జరగక పోవటంతో ఈ దేశాల్లో పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉంది. ఇజ్రాయల్ దేశం మినహా మరే దేశంలోనూ వ్యాక్సిన్ 30 శాతం కూడా దాటలేదు. కరోన తీవ్రతపై ఆవగాహన లేకపోవటంతో చాలా చోట్ల వ్యాక్సిన్ పై అనుమానాలు ఉన్నాయి. సమయానికి వ్యాక్సిన్ అందకపోవటం, వ్యాక్సిన్ పై అవగాహనా లేమి మధ్యధార దేశాలకు శాపంగా మారింది.