మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చంద్రబాబు రోడ్లపై తిరుగుతున్నారని, బాబుకు తోడు అసలు పుత్రుడు, దత్త పుత్రుడు మూడు వైపులా తిరుగుతున్నారని, ఇలాంటి పగటి వేషగాళ్ళ మాయలో పడొద్దని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. 2014లో కూడా మోడీ, పవన్ పుణ్యాన బాబు ముఖ్యమంత్రి అయ్యారన్నారు. సిఎం క్యాంపు కార్యాలయం వద్ద సజ్జల మీడియాతో మాట్లాడారు.
విశాఖను రాజధానిగా ప్రకటించినప్పటినుంచీ వారు…ఒకరి తరువాత ఒకరు అక్కడికి వెళ్లి ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. ఏవో ఘోరాలు జరుగుతున్నాయని ప్రచారం చేస్తున్నారన్నారు. బాబు హయంలోనే అక్కడ నేరాలు ఘోరాలు జరిగాయని, వాటిని తాము సరి చేస్తున్నామని అన్నారు. అక్కడికి రాజధాని రాకూడదన్నదే వారి లక్ష్యమన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏదైనా ప్రాంతం వెనకబడితే దానికి తెలుగుదేశం పార్టీ కారణమని, పవన్ కళ్యాణ్ ఎవరినైనా ప్రశ్నించదలచుకుంటే చంద్రబాబునే అడగాలన్నారు. జగన్ ను ఓడించడమే తన లక్ష్యమని పవన్ ఎన్నోసార్లు చెప్పారని, దానికోసమే ఆయన ఎవరితోనైనా కలుస్తారని… బాబు, పవన్ ల లక్ష్యం జగన్ అని అన్నారు.
సభల్లో చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే జాలి వేస్తోందని, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావడం లేదని ఎద్దేవా చేశారు. సెల్ ఫోన్ లో లైట్ తానే కనిపెట్టానని, 45 రోజులు రాఖీ కట్టుకోవాలంటూ నిన్నటి సభలో బాబు చేసిన వ్యాఖ్యలపై సజ్జల విస్మయం వ్యక్తం చేశారు. విజనరీ అని చెప్పుకుంటున్న నాయకుడు చెప్పిన మాటల్లాగా ఉన్నాయా అని ప్రశ్నించారు.
యార్లగడ్డ వెంకట్రావు పార్టీని వీడడంపై సజ్జల స్పందించారు. ఆయన ముందే ఈ నిర్ణయం తీసుకున్నారని అనిపిస్తోదని, ఏ పార్తీలోనైనా ఎన్నికల ముందు ఇలాంటివి సహజమేనని, కానీ తమ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు.