Saturday, September 21, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకృత్రిమ మేధా భాష

కృత్రిమ మేధా భాష

సాంకేతికత రెండంచుల కత్తి లాంటిది. సరిగ్గా వాడుకుంటే ఉపయోగం. విచక్షణ లేకుండా వినియోగిస్తే అనర్థదాయకం. మాట్లాడే భాష, రాసే భాష, అనువాదం లాంటి భాషాసంబంధ విషయాల్లో సాంకేతికత ఎంతగా ఉపయోగపడుతుందో అంతగా మెదడును మొద్దుబారుస్తోందని ఈమధ్య అనేక అధ్యయనాలు రుజువుచేస్తున్నాయి.

మనం తప్పు టైప్ చేసినా ఆటోమేటిగ్గా సరిచేసేది- ఆటో కరెక్ట్. మనం టైపు చేయబోయే మాటలను దానికదిగా అందించేది- ప్రిడిక్టివ్ టెక్స్ట్. మనం టైపు చేసిన వాక్యంలో వ్యాకరణ దోషాలను సరిచేసేది- గ్రామర్లి. ఈ యాపులు కాక ఆడియో చెబితే టెక్స్ట్ ఇచ్చేవి, పి డి ఎఫ్ పెడితే టెక్స్ట్ ఇచ్చేవి, రియల్ టైములో ఒక భాష నుండి ఇంకో భాషలోకి అనువదించే ఆడియో, టెక్స్ట్ ఇలా ఇప్పుడు లెక్కలేనన్ని భాషా సాధనాలు అందుబాటులో ఉన్నాయి.

35 ఏళ్లుగా రాస్తున్న నేను దాదాపుగా స్మార్ట్ ఫోన్ వచ్చిన ఈ పదేళ్లలో కాగితం మీద రాయడం మానేశాను. ఫోన్లో ఇంగ్లీషు అక్షరాలను టైప్ చేస్తే తెలుగు అక్షరాలు వచ్చే తెలుగు కీ నౌన్స్ యాప్, గూగుల్ తెలుగు ఇండిక్ కీ బోర్డ్ ఆధారంగా తెలుగు రాస్తున్నాను. అంటే raastunnaanu అని నేను టైప్ చేస్తే అది రాస్తున్నానుగా వస్తుంది. అదే rastunnanu అని టైప్ చేస్తే రస్తున్నను అన్న పదం అప్షన్ ను కూడా చూపుతుంది. కౌముది మాటలో కౌ కు kou లేదా kow అని టైప్ చేయాలి. కొన్ని సంస్కృత శ్లోకాలు, తెలుగు ప్రబంధ దీర్ఘ సమాసాలు, ఒకే అక్షరానికి రెండు మూడు వత్తులున్న కర్త్రే, వక్ష్యామి, దుర్గ్రాహ్యం లాంటి మాటలు టైప్ చేసేప్పుడు జీవితం మీద విరక్తి పుడుతూ ఉంటుంది. ఆ మాటలను అక్షరదోషం లేకుండా రాబట్టుకోవడానికి ఇంగ్లీషులో ఏ అక్షరాలను టైప్ చేయాలో ట్రయల్ అండ్ ఎర్రర్ లో ప్రయత్నించాలి. యాప్ ల అనే మాట కోసం యాప్ స్పేస్ ఇచ్చి ల అని కొట్టాలి. లేకపోతే యాప్ల అని వస్తుంది.

అయినా…పెన్ను కాగితం పట్టుకుని రాయడంతో పోలిస్తే ఫోన్లో టైప్ చేయడమే సులభం అనిపిస్తోంది. ఎప్పుడు తీరిక ఉంటే అప్పుడు ఫోన్ చేతిలో ఉంటుంది కాబట్టి ఒక్కో పేరా టైప్ చేసుకుంటూ ఉండవచ్చు. ఎడిట్ చేసుకోవచ్చు. 99 శాతం తప్పుల్లేకుండా వస్తోంది. ఫోన్లోనే నోట్స్ లో ఉన్న పాత రాతలతో చెక్ చేసుకోవచ్చు. ఒక్క సెర్చ్ వర్డ్ కొడితే ఇదివరకు ఆ అంశం మీద రాసిన రాతలన్నీ తేదీలతో కళ్ళముందు ప్రత్యక్షం.

రోజుకు రెండు గంటలు ఫోన్లో టైపింగ్ వల్ల కళ్ళజోడు పాయింట్ ఫైవ్ నుండి రెండుకు పెరిగి…కళ్లు దెబ్బతింటున్నాయనుకోండి. అది వేరే విషయం.

లాభం:-
భాషా యాప్ ల వల్ల ప్రత్యేకించి ఇంగ్లీషులో అక్షర దోషాలు, వ్యాకరణ దోషాలు లేకుండా రాయడం నేర్చుకుంటున్నారు. ఒకమాటను ఎలా పలకాలో అన్న శబ్దోచ్చారణ కూడా తెలుసుకుంటున్నారు. గూగుల్ చాట్ బోట్ లాంటి వాటి సహాయంతో సృజనాత్మక రచనలు కూడా వస్తున్నాయి.

నష్టం:-
కృత్రిమ మేధ- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో నడిచే భాషా యాప్ లు మనిషి మెదడును మొద్దుబారుస్తున్నాయి. యాంత్రికంగా మారుస్తున్నాయి. స్పెల్లింగులు, వాక్య నిర్మాణం, ఉచ్చారణ ఎలా ఉన్నా యాప్ లు సవరిస్తాయన్న ధీమాతో ప్రాథమికమయిన భాషా పరిజ్ఞానం కూడా లేకుండా పోతోంది. కొన్నాళ్లకు యాప్ లు, సాఫ్ట్ వేర్లు, కృత్రిమ మేధలు మాత్రమే భాషాధికారాన్ని నిర్ణయించే పరిస్థితి రావచ్చు.

దేవులపల్లికంటే గొప్పగా చాట్ బోట్ భావకవిత్వం రాయచ్చుగాక. యంత్రం యంత్రమే. ఎక్కడో ఒకచోట దానికి పరిమితి ఉంటుంది. అందులో ఫీడ్ అయిన సమాచారం ఆధారంగానే అది కవిత అల్లగలుగుతుంది.

మెదడుందా?
ఇదివరకు “మెదడుందా?” అన్నది తిట్టు. ఇకపై మెదడుందా? అన్నది ప్రశ్నే కాకపోవచ్చు. “కృత్రిమ మేధ యాప్ లు ఉండగా మెదడెందుకు దండగ?” అన్నది అంగీకారం కావచ్చు.

హే మైండ్!
మైండ్ యువర్ బిజినెస్ అండ్ మైండ్ యువర్ లాంగ్వేజ్!
వుయ్ డోంట్ నీడ్ యూ ఎనీమోర్!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్