Sunday, January 19, 2025
HomeTrending Newsఓమైక్రాన్ కేసులు లేవు: హరీష్ రావు

ఓమైక్రాన్ కేసులు లేవు: హరీష్ రావు

No Omicron Cases in TS:
తెలంగాణలో ఒమైక్రాన్ కేసులు నమోదు కాలేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్ధిక శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. ఓమైక్రాన్  ప్రభావం ఉన్నట్లు ప్రకటించిన 11 దేశాలనుంచి 3235 మంది తెలంగాణకు వచ్చారని, వీరికి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తే 15 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని, ఒమైక్రాన్ పరీక్షల కోసం ఈ 15 శాంపిల్స్ ను ల్యాబ్స్ కు పంపితే 13 మందికి నెగెటివ్ వచ్చిందని, మరో ఇద్దరి ఫలితాలు రావాల్సి ఉందని మంత్రి వివరించారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో సీటీ స్కాన్ సేవలను  మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్, మేయర్ విజయలక్ష్మి, ఇతర నేతలు, వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఏ వైరస్ వచ్చినా కేవలం దాన్ని మాస్కుతోనే ఎదుర్కోగలమని అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘వైరస్ ఏదైనా మాస్క్ ఒక్కటే శ్రీరామ రక్ష’ అని వ్యాఖ్యానించారు. గాంధీ ఆస్పత్రి అభివృద్ధికి సిఎం కేసియార్ 176 కోట్ల రూపాయలు మంజూరు చేశారని వీటిలో ఇప్పటికే 100 కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు.  కోవిడ్ సమయంలో గాంధీ ఆస్పత్రి సిబ్బంది అందించిన సేవలు అపురూపమైనవని హరీష్ రావు కొనియాడారు. కరోనా సమయంలో మొత్తం 84, 187 మంది పేషెంట్లకు వైద్యం అందించిన ఘనత గాంధీ ఆస్పత్రికే దక్కుతుందన్నారు.

రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిటి స్కాన్ సౌకర్యం అందుబాటులోకి  తేవాలన్నది సిఎం కేసియార్ ఆలోచన అని, అందుకే 21 సీటీ స్కాన్ ల ఏర్పాటుకు అనుమతి మంజూరు చేశారని, దానిలో భాగంగా మొదటి దాన్ని గాంధీలో ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఆరున్నర కోట్ల రూపాయలతో గాంధీ ఆస్పత్రిలో గుండె జబ్బులకు కేథలాగ్ ను 45 రోజుల్లోగా ప్రజలకు అందుబాటులో తీసుకువస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 12.5 కోట్ల రూపాయలతో ఏంఆర్ఐ మిషన్ కూడా గాంధీకి మంజూరు చేశారన్నారు.

గాంధీ ఆస్పత్రిలో 200 పడకల ఏంసిహెచ్ ఆస్పత్రిని మంజూరు చేశారని, వీటి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, రాబోయే ఐదారునేలల్లో వీటిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు.

Also Read : త్వరలో కొండాపూర్ లో డయాలసిస్ యూనిట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్