Civils Aspirants : సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధుల వయోపరిమితి, నిర్ణీత అటెంప్ట్స్‌కు సంబంధించి ఎలాంటి సడలింపులు ఇచ్చే ప్రతిపాదన లేదని పీఎంవో శాఖ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభలో ప్రకటించారు. కోవిడ్ మహమ్మారి నేపధ్యంలో 2020లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు అదనపు అటెంప్స్ట్‌కు అవకాశాం కల్పించవలసిందిగా సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని కోరిందా అని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు.
కోవిడ్ కారణంగా సివిల్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు వయోపరిమితి, నిర్ణీత అటెంప్ట్స్ విషయంలో సడలింపు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కొందరు సివిల్స్ అభ్యర్ధులు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేసినట్లు మంత్రి తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పులను పరిశీలించింన అనంతరం అభ్యర్ధుల వయోపరిమితి సడలింపు, అదనపు అటెంప్ట్స్‌కు అవకాశం కల్పించేలా నిబంధనలలో మార్పు తీసుకురావడం సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. పైన తెలిపిన కారణాల నేపధ్యంలో సివిల్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు సడలింపులు ఇచ్చే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని మంత్రి స్పష్టం చేశారు.
Also Read : కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష