Thursday, March 6, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకొండా కోనల్లో...

కొండా కోనల్లో…

స్నేహం ఒక అపురూపమైన వరం అయితే స్నేహితులతో అప్పుడప్పుడు కాలం గడిపే అవకాశం రావడం అదృష్టం. బాల్యంలో, కాలేజీ దశలో ఎందరో కలుస్తారు. వారిలో చాలా తక్కువమంది స్నేహితులు కలుస్తూ ఉంటారు. ఏడాదికోసారి కలుసుకుని పాత రోజుల ఆనందాలు గుర్తుచేసుకునే అవకాశం అందరికీ ఉండదు. నా భాగ్యం కొద్దీ అలాంటి కాలేజీ గ్రూప్ ఉంది. పదిహేనేళ్లుగా ఏటా కలుసుకుంటున్నాం. ఈసారి అరకులోయ వెళ్దాం అనుకున్నాం. ఇరవై మంది వస్తారనుకుంటే పదిహేనుమంది సరే అని చివరికి ఎనిమిదిమంది మిగిలాం. అయినాసరే తగ్గేదే ల్యా అనుకుంటూ వందేభారత్ ట్రైన్ లో వైజాగ్ బయలుదేరాం.

మొదటిసారిగా ఆ ట్రైన్ లో వెళుతుండడంతో చాలా ఉత్సాహంగా ఉంది. సికింద్రాబాద్ స్టేషన్ చాన్నాళ్ల తర్వాత చూసి ఉలిక్కి పడ్డా. శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. రద్దీ మాత్రం ఎప్పటిలానే ఉంది. మా ముందు సీట్లో ఒక తల్లీ కొడుకు కూర్చున్నారు. ఇంతలో ఒక అల్ట్రా మోడరన్ అమ్మాయి వచ్చి వాళ్ళ లగేజీ జరిపి తన బ్యాగ్ పెట్టాలంది. పాపం అబ్బాయి వాళ్ళది ఒకటే సూట్ కేస్ అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఇంగ్లీష్ లో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. దాంతో అబ్బాయికి తిక్కరేగి ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. ఒకరిద్దరు పెద్దమనుషులు నచ్చచెప్పడానికి ప్రయత్నించినా అమ్మాయి వినలేదు. చివరకి పోలీసులొచ్చి పరిష్కరించాల్సి వచ్చింది. ఇంత జరిగాక అమ్మాయి శాంతించి తప్పు తెలుసుకున్నట్టు మౌనంగా కూర్చుంది. ఆ అమ్మాయి ప్రవర్తనకు ఒకింత ఆశ్చర్యపోయాం. కాసేపు అలా టైం పాస్ అయింది.

విజయవాడలో మరికొందరు మిత్రులు తోడయ్యారు. అక్కడినుంచి ఆటపాటలతో వైజాగ్ చాలా త్వరగా వచ్చేసింది. మొదటిసారిగా వందే భారత్ లో భోజనం… అస్సలు బాగా లేదు. వైజాగ్ చేరేసరికి మేము బుక్ చేసుకున్న వాహనం వచ్చి హోటల్ లో దింపింది. పొద్దున్నే అయిదింటికి వచ్చి బీచ్ కి తీసుకెళ్లమని చెప్పి నిద్రపోయాం. తీరా ఉదయం అయిదింటికి లేచి రెడీ అయినా వాహనం ఆరున్నర దాకా రాలేదు. ఏడింటికి బయలుదేరి రామకృష్ణా బీచ్ కి వెళ్ళాం. అక్కడ ఒకటే జనం. అప్పుడు డ్రైవర్ రిషికొండలో బీచ్ కి తీసుకెళ్లాడు. అక్కడ గంట పైనే అలలతో ఆడుకున్నాం. అక్కడినుంచి దారిలో టిఫిన్ తిని రూమ్ కి చేరి రెడీ అయి అరకు బయలుదేరాం.

వైజాగ్ నుంచి అరకు లోయకి నాలుగు గంటల పైనే పడుతుంది. దారిలో భోజనం చేసి బొర్రా గుహలు చూడటానికి వెళ్ళాం. జగదేకవీరుడు- అతిలోక సుందరి సినిమాలోని ‘మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా’ అని పాడుకుంటూ గంటసేపు గుహల్లో విహరించి బయట షాపింగ్ చేసి మా రిసార్ట్ కి బయలుదేరాం. ఇది బాగా దూరం అయినా బాగుంటుందని చెప్తే బుక్ చేసుకున్నాం. ఎనిమిది రూమ్స్ ఉంటాయి. చాలా బాగున్నాయి. చుట్టూ పొలాలు, వాగులు, గిరిజనుల ఇళ్ళు ఉంటాయి. కొల్లాపుట్టు రిసార్ట్ అంటారు. మేము వెళ్ళేలోపు చీకటి పడడం, మధ్యలో కొంచెం దారి బాగాలేక కొద్దిగా కంగారు పడ్డా ఎనిమిదింటికల్లా రిసార్ట్ చేరుకున్నాం. ఈ రిసార్ట్ సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. పనిచేసే వారంతా స్థానికులే. చిన్న పిల్లల్లా ఉన్నారు. క్యాంప్ ఫైర్ వేసి రోటీలు, కర్రీ సర్వ్ చేశారు. మాంసాహారప్రియులు బొంగులో చికెన్, చికెన్ లాలిపాప్స్ తిన్నారు. మర్నాడు ఉదయమే సూర్యోదయం కోసం మాడగడ అనే ప్రాంతానికి వెళ్లాలని త్వరగా పడుకున్నాం.

ఉదయాన్నే లేచి ఆరున్నరకల్లా మాడగడ చేరుకున్నాం. అక్కడికి చేరుతుండగానే సూర్యుడు గబగబా రావడం కనిపించింది. చుట్టూ కొండలు, మధ్యలో టేబుల్ టాప్ మౌంటెన్ లా ఉంది. సూర్యోదయం అయ్యేసరికి స్థానిక మహిళలు చేతుల్లో సంచులతో దగ్గరికొచ్చారు. వారి వేషభాషలు ధరించమని అడిగారు. సరే అని అందరం రెడీ అయిపోయాం. చిన్నప్పుడు స్కూల్లో లాగా వాళ్లే చీరలు కట్టి, కొప్పులు వేసి సింగారించారు. రంగుల బొట్టులు పెట్టి గిరిజన మహిళల్లా తయారుచేశారు. అక్కడే డాన్స్ చేస్తున్న గిరిజన మహిళలతో కలసి కాసేపు కాలు కదిపాం. మిగిలిన యాత్రాస్థలాలతో పోలిస్తే వాళ్ళు పుచ్చుకుంది తక్కువే. ఇంకోచోట ఉయ్యాల ఉంది. ఇరవై రూపాయలిచ్చి ఊగుతూ ఫోటో దిగచ్చు. అలా రకరకాల భంగిమల్లో ఫ్రెండ్స్ అందరం అలసిపోయేవరకు ఫోటోలు తీసుకున్నాం. ఆ తర్వాత అరకు లోయ పర్యటనకు బయలుదేరాం.

పదిహేనేళ్ళ క్రితం వెళ్ళినప్పుడు అరకు ఇలా లేదు. ఇప్పుడు ఎన్నో సౌకర్యాలు. చాలా అభివృద్ధి కనిపిస్తోంది. చాపరాయి అనే ప్రదేశం ఇదివరకు రాళ్లతో నిండిన ప్రదేశం. ఇప్పుడో! ఎక్కడికక్కడ గేట్ పెట్టి గార్డెన్ పెంచి టికెట్ పెట్టారు. ట్రైబల్ మ్యూజియం అంతే. అక్కడ రకరకాల సాహస క్రీడలు ఉన్నాయిగానీ ఎండకి భయపడి ధైర్యం చేయలేదు. తర్వాత బొటానికల్ గార్డెన్స్, చాక్లెట్ ఫ్యాక్టరీ చూసి రిసార్ట్ కి వెళ్లిపోయాం.

మేము రిసార్ట్ కి వెళ్లేసరికి చాలామంది కొత్తవాళ్లు కనిపించారు. వైజాగ్ నుంచి ఒక బృందం వచ్చిందని తెలిసింది. బర్త్ డే పార్టీ, డాన్స్ అంటే మేమూ చూడచ్చు కదా అని సంతోషించాం. రాత్రి ఎనిమిదయ్యేసరికి తెలిసింది అవి రికార్డింగ్ డాన్సులని. చిన్న చిన్న అమ్మాయిలు నలుగురు వంతులవారీగా డాన్స్ చేస్తున్నారు. ముప్ఫయిమంది మగవారు ఆనందిస్తున్నారు. సినిమాల్లో తప్ప ప్రత్యక్ష పరిచయం లేని మాకు మొదటిసారిగా రికార్డింగ్ డాన్స్ చూసినందుకు ఆనందించాలో , ఆ పిల్లల పరిస్థితికి జాలి పడాలో తెలియక బాధతో రూమ్ కెళ్ళి పోయాం. అంతకన్నా బాధ అక్కడ పనిచేసే పిల్లల్ని చూసి కలిగింది. ఇవన్నీ చూసి వాళ్ళేం నేర్చుకుంటారో అని. అయినా అనువుగాని చోటు కాబట్టి ఏమీ మాట్లాడకుండా మర్నాడు వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి, చదువుకోమని వచ్చేశాం. వస్తూ దారిలో కాఫీ తోటల దగ్గర ఆగి, కాఫీ, మసాలా దినుసులు కొనుక్కున్నాం. మధ్యాహ్నానికల్లా వైజాగ్ చేరుకుని…వందేభారత్ లో మళ్ళీ హైదరాబాద్ చేరుకున్నాం.

కొస మెరుపు:-
వెళ్ళేటపుడు, వచ్చేటపుడు వందేభారత్ లో భోజనం చేయాల్సి వచ్చింది. అదే కూర, అదే రోటీ, అదే అన్నం. ‘యూనిఫామ్ ఫుడ్ కోడ్’ ఏమో!

-కె. శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్