ప్రపంచంలో ఏ భాష అయినా మరో భాష నుండి పదజాలాన్ని తీసుకోక తప్పదు. మానవ సమాజాల మధ్య సంబంధాలున్నంతవరకూ ఈ ఇచ్చిపుచ్చుకొనే వ్యవహారం సాగుతూనే ఉంటుంది. ప్రాచీన సమాజంలో అనేక భాషలు తెలిసిన వ్యక్తుల సంఖ్య పరిమితంగా ఉండేది. ప్రస్తుతం రెండు భాషలు మాట్లాడగలిగిన లేదా కనీసం అర్థం చేసుకోగలిగిన వ్యక్తుల సంఖ్య చాలా ఎక్కువ. చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా మన పాఠశాలల్లో అనుసరిస్తున్న విద్యావిధానం వల్ల మూడు భాషలు నేర్చుకుంటున్నారు. హైదరాబాదు వంటి నగరాల్లో నాలుగు భాషలు వచ్చినవాళ్ళ సంఖ్య కూడా ఎక్కువే. అందువల్ల తెలుగు భాషలో బహుభాషల పదజాలం వచ్చి చేరడానికి అవకాశం ఉంది.
చారిత్రకంగా చూసినప్పుడు ప్రాచీనకాలంలో సంస్కృత ప్రాకృతాల ప్రభావం విస్తృతంగా ఉండేది. మధ్యయుగాలలో తమిళం, కన్నడం వంటి ఇరుగు పొరుగు భాషల నుండి పదాలు అరువు తెచ్చుకోవడం జరిగింది. పదమూడో శతాబ్దం నుండి అరబిక్, పర్షియన్ పదాలు, ఉర్దూ పదాలు, పదహారో శతాబ్దం నుండి ఇంగ్లీషు, పోర్చుగీసు, డచ్చి, ఫ్రెంచి పదాలు తెలుగు భాషలో చేరాయి.
ప్రాచీన కాలంలో సంస్కృత ప్రాకృత పదాలు ఎక్కువగా చేరడానికి సాంస్కృతిక కారణాలు ప్రధానం. ఆర్య ద్రావిడ జాతుల సమ్మేళనం ఆర్య ద్రావిడ భాషల పరస్పర ప్రభావానికి కారణమయింది. సంస్కృతంలోనూ ఎన్నో ద్రావిడ భాషా పదాలూ, వ్యాకరణ నిర్మాణాలూ చేరాయి. ద్రావిడ భాషల్లో మాత్రం సంస్కృత భాషా పదాలు విస్తృతంగా వచ్చి చేరాయి. మతపరమైన సాహిత్యమంతా సంస్కృతంలోనే ఉండడమూ, సంస్కృతం విద్యా మాధ్యమం కావడమూ దీనికి ప్రధానమయిన కారణం. అయితే ఆధునిక కాలంలో కూడా తెలుగులో సంస్కృత భాషాపదాలు విస్తృతంగా చేరుతూనే ఉన్నాయి. పరిభాషను కల్పించుకోవడంలో సంస్కృత పదాలను బాగా వాడుకుంటున్నాం.
రెండు మూడు శతాబ్దాల కిందట యూరోపియన్ భాషల పదాలు వస్తువులకు సంబంధించినవి మన భాషలో చేరాయి. పూర్వం సంస్కృతం లాగా ఇప్పుడు ఇంగ్లీషు మనకు విద్యా మాధ్యమం అయింది. ఇది ముఖ్యంగా ఉన్నతవిద్యా రంగంలో జరిగింది. శాస్త్ర రంగంలో పరిభాష చాలావరకు ఇంగ్లీషే. కేవలం శాస్త్ర సాంకేతిక రంగాలలోనేకాక పరిపాలనా రంగంలోనూ ఇంగ్లీషు మాటలను ఎక్కువగా వాడక తప్పడంలేదు. ఇంగ్లీషు భాష ప్రపంచంలోని భాషలన్నింటి నుండీ పదజాలాన్ని కొల్లగొట్టింది. ఇంగ్లీషు ద్వారా ఆ పదజాలం మన భాషలోకి ప్రవేశించింది.
ఒక భాష నుండి మరో భాషలోకి పదాలను అరువు తెచ్చుకొనేటప్పుడు పదాలు కొన్ని మార్పులు పొందుతాయి. మూలభాషతో మనకున్న పరిచయాన్ని బట్టి ఈ మార్పులుంటాయి. అట్లాగే మూలభాషా ధ్వనులకూ, మన భాషాధ్వనులకూ ఉన్న తారతమ్యాలను బట్టి కూడా ఈ మార్పులుంటాయి. మూల భాషలో ఉన్న ధ్వనులు మన భాషలో లేకపోతే వాటికి మన భాషలో దగ్గరగా ఉన్న ధ్వనులను ఉపయోగిస్తాం. ఉంటే వాటినే ఉపయోగిస్తాం. ఒకవేళ ఆ భాషతో విస్తృతమయిన పరిచయం ఉంటే ఆ ధ్వని మన భాషలో లేకపోయినా అదేవిధంగా ఉచ్చరిస్తాం. అటువంటి ధ్వనులున్న కొన్ని మాటలు విస్తృత ప్రచారంలో ఉంటే ఆ మాటలతోపాటు ఆ ధ్వనులు కూడా మన భాషలో ప్రవేశిస్తాయి. దీనికి తెలుగులో మంచి ఉదాహరణలు కాఫీ, ఫీజు వంటి మాటలు. తెలుగులో సంస్కృతం నుండి ఫ వచ్చింది. ఫలం, ఫాలం వంటి మాటల్లో ఇది ఉంది. దీని ఉచ్చారణను ‘ph’తో సూచించవచ్చు. కాఫీలో ఉన్న ఫ ఉచ్చారణను ‘f’తో సూచించవచ్చు. ఈ రెండూ వేరువేరు. అయినా ఒకే లిపి సంకేతం ఉపయోగిస్తున్నాం. కాని ఉచ్చారణలో మాత్రం భేదం పాటిస్తున్నాం.
పదంలో మార్పు ఉన్నచోట అంటే వర్ణలోపం, వర్ణాగమం, వర్ణ వ్యత్యయం వంటి మార్పులున్నప్పుడు మనవాళ్ళు ఆ పదాన్ని తద్భవం అన్నారు. వర్ణలోపం అంటే ఏదైనా ఒక వర్ణం లోపించడం, వర్ణాగమం అంటే ఒక వర్ణం ఎక్కువగా వచ్చి చేరడం, వర్ణ వ్యత్యయం అంటే రెండు వర్ణాలు తారుమారు కావడం, ఇటువంటి మార్పులేనప్పుడు కూడా సాధారణంగా పదాంతంలో మార్పు ఉంటుంది. అంటే హలంతమైన పదం అజంతం కావడమో, దీర్ఘం హ్రస్వం కావడమో, హ్రస్వం దీర్ఘం కావడమో వంటివి. ఆ భాషలో పదాంతంలో ఏదైనా ప్రత్యయం ఉంటే సాధారణంగా ఆ ప్రత్యయం లోపించి, అవసరమయితే మన భాషా ప్రత్యయం చేరుతుంది.
సంస్కృత ప్రాకృత భాషా పదాల విషయంలో ఈ రెండు రకాల మాటలనూ మన వాళ్ళు విశ్లేషించారు. పదంలో గణనీయమయిన మార్పు ఉన్నప్పుడు దాన్ని తద్భవమనీ, పదం చివర ప్రత్యయం వంటివి మాత్రమే మారినప్పుడు దాన్ని తత్సమమనీ అన్నారు. ఇతర భాషా పదాల విషయంలో ఇటువంటి విశ్లేషణ చేయలేదు. ఇదే పద్ధతిని అనుసరించి ఇతర భాషల పదాలను కూడా మనం విశ్లేషించవచ్చు. ఉదాహరణకు హాస్పిటల్ అన్న మాటను తీసుకుంటే ఆసుపత్రి అన్నది తద్భవం, హాస్పిటలు అన్నది తత్సమం.
ఇంగ్లీషు నుండి మనం అరువు తెచ్చుకున్న మాటల్లో ఏకాక్షర పదాలన్నీ దీర్ఘాంతాలో, ఐ, ఔలతో ముగిసేవో అయి ఉంటాయి. టీ, కీ, బ్లూ, గ్రే, షో, షూ, మే లాంటివి సంస్కృతంలోని ఏకాక్షర పదాలలాగానే తెలుగులో దీర్ఘాంతాలుగానే ఉంటాయి. హై, ఫ్రై, డ్రై లాంటి వాటిలో మార్పేమీ ఉండదు. ఫ్రీ, ట్రే, టూ, త్రీ, రో, స్లో మొదలయినవన్నీ దీర్ఘాంతాలే. సాధారణంగా అజంతంగా ఉండే మాటలు తెలుగులోకి దీర్ఘాంతాలుగానే వస్తాయి. కాఫీ, పార్టీ, బ్యూరో, రౌడీ, గూండా, కూలీ, లోగో, కౌంటీ, కంట్రీ, ఎల్లో, టాబూ, సినిమా, రేడియో, పియానో, బ్రాందీ, విస్కీ, టాక్సీ, ఆటో, రిక్షా, లారీ, సారీ, బేబీ, పిల్లో, డేటా వంటి మాటలన్నీ దీర్ఘాంతాలే.
జనవరి, ఫిబ్రవరి మాత్రం హ్రస్వాంతాలు.
-డి. చంద్రశేఖర రెడ్డి
98661 95673
రేపు:-
మన భాష- 15
ఇంగ్లీషు మాటలు- కొన్ని సంగతులు