Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంచీకటి వెలుగులు

చీకటి వెలుగులు

Bright less Lives: జర్నలిస్టు మిత్రుడు భళ్ళమూడి రామకృష్ణ- ఆర్.కె. కరోనా కోరల్లో చిక్కుకుని…రెండేళ్ల కిందట తనువు చాలించాడు. ప్రింట్, టీ వీ మీడియాలో చాలా కాలం పాటు పని చేసినవాడు. చాలామంది జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చినవాడు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆర్.కె. శ్రీమతి వందన, కూతురు లాస్య అతడి పుట్టినరోజు సందర్భంగా ఆర్ కె పేరిట జర్నలిస్టు ప్రేమా మాలినికి అవార్డు ఇచ్చారు. జర్నలిస్టులు వి.ఎస్.ఆర్.శాస్త్రి, ఎస్ రాము, మూర్తి, వనం జ్వాలా నరసింహారావుతో పాటు మరి కొంతమంది మిత్రులు ఆర్.కె.తో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఆర్.కె.తో నా సాహిత్య ప్రయాణం గురించి నేనూ నాలుగు మాటలు మాట్లాడాను.

కార్యక్రమం అయ్యాక భోజనాల దగ్గర ఒక పెద్దాయన్ను పలకరించాను. రిటైరయ్యాక ఇప్పుడేమిటి వ్యాపకం? అని మామూలుగా అడిగాను. “సాయంత్రాలు చూసి 32 ఏళ్లయ్యిందండి. ఇప్పుడు సాయం సూర్యుడిని చూస్తున్నాను. దాదాపు 30 ఏళ్ల తరువాత మా ఆవిడ పక్కన నడుస్తున్నాను. ఇద్దరం మార్ణింగ్ వాక్ కు వెళుతున్నాం. సంచి తీసుకుని మా ఆవిడతో కూరలకు వెళుతున్నాను” అని కళ్ళల్లో వెలుగు, మాటల్లో ఆనందం తొణకిసలాడుతుండగా చెప్పాడు. నోట్లో పెట్టుకున్న ముద్ద దిగడానికి నాకు చాలా సేపు పట్టింది. ఇలా ఎన్ని వేల మంది జర్నలిస్టులు వెలుగు చూడని చీకట్లలో ఉండిపోయారో? కుటుంబంతో నడవలేక దొర్లిపోయిన దశాబ్దాలను, తరాలను లెక్కపెట్టుకుంటున్నారో?

“లోకం నిద్రపోయేవేళ లోకాన్ని నిద్రలేపడానికి వారు మేల్కొంటారు. లోకం నిద్ర లేచినవేళ వారు పడుకుంటారు” అని జర్నలిస్టుల కష్టాలను వర్ణిస్తూ “శుభం”కథలో శ్రీకారం రామ్మోహన్ ఉపోద్ఘాతంగా రాశారు.  ఆయన రాసిన సందర్భం నైట్ డ్యూటీ జర్నలిస్టుల మీద. కానీ ఆయన వ్యాఖ్య మాత్రం జర్నలిస్టుల జీవితాలకు అన్వయమవుతోంది.

1992లో జర్నలిజంలో నా క్లాస్ మేట్, నా రూమ్ మేట్. ఎర్రమంజిల్ హిల్ టాప్ కాలనీలో నెలకు మూడు వందలు అద్దె. చెరి 150 భరించేవాళ్ళం. ఖైరతాబాద్ రైల్వే గేట్ లోపల కూరల మార్కెట్లో మెస్ భోజనం. సిటీ బస్సుల్లో ప్రయాణం. ఆర్ టీ సి సిటీ బస్సుతో పోలిస్తే టికెట్ పావలా తక్కువ కాబట్టి సెట్విన్ బస్సుల కోసం చాలా సేపు ఎదురుచూసేవాళ్లం. అప్పట్లో నేను విచ్చలవిడిగా రాసిపారేసే కవితలు, పాటలు చదవక, వినక తప్పని పరిస్థితి అతడిది. నాలో కవిని పదే పదే నిద్రలేపేవాడు. కలిసి బట్టలు ఉతుక్కునేవాళ్ళం. ఇస్త్రీకి డబ్బులు చాలవు కాబట్టి ఉతికి ఎలా ఆరేస్తే ఇస్త్రీ చేసినట్లే బట్టలు ఆరుతాయో నాకు నేర్పించాడు. ఊరినుండి చూడ్డానికి వచ్చిన మిత్రులు ఇచ్చి వెళ్లే చిరుతిళ్లు కలిసి తిన్నాం. నా చేతిరాత చాలాసార్లు నాకే అర్థం కాదు. అంత ఒయ్యారంగా ఉంటుంది. అతడివి ముత్యాల్లాంటి అక్షరాలు. మంచి హెడ్డింగులు పెడతాడు. దోషాల్లేకుండా సరళమయిన తెలుగు అద్భుతంగా రాస్తాడు. ప్రింట్ నుండి టీ వీ మీడియాకు వెళ్లాడు. బాగా రాణించాడు. కానీ ఎందుకో ఏ నెలకు ఆ నెల గడిచేంత తప్ప ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయాడు. అతడి ప్రమేయం లేకుండానే వెంట వెంటనే ఉద్యోగాలు మారాల్సివచ్చింది. ఈ లోపు పెరిగే అబ్బాయి చదువులు. భరించలేని ఖర్చులు. ఉద్యోగం గాలిలో దీపమయ్యింది. శక్తిమేర ప్రయత్నించి…ఇక హైదరాబాద్ లో ఉండడం కష్టమనుకుని సొంత ఊరికి మకాం మార్చాడు. కొడుకు చదువుకు చేసిన అప్పులు ఏవో ఉన్నాయి. బాధపడతాడే కానీ, రేపటి గురించి భయపడడు. ఇంట్లో ఉంటూ అనువాదాలు అవీ చేసుకుంటూ ఏదో దారి వెతుక్కుంటూ…బతుకు బండిని లాగుతూ ఉన్నాడు. 92 ప్రాంతాల్లో నేను రాసినవాటిని ఇప్పటికీ నాకు గుర్తుచేసే మిత్రుడి మనో ధైర్యమే అతడికి ఏదో ఒక దారి చూపకపోదు.

నాకంటే వయసులో చిన్నవాడయినా మరో జర్నలిస్టు మిత్రుడు నాతో ఆత్మీయంగా ఉంటాడు. ఒక సంక్షోభ సమయంలో పడిపోకుండా నన్ను పట్టుకుని నిలబెట్టాడు. బాగా చదువుకున్నవాడు. చక్కగా రాస్తాడు. సామాజిక అంశాల మీద చాలా లోతయిన అవగాహన ఉన్నవాడు. ఒక శుభ ముహూర్తాన ఇల్లు కొన్నాడు. అప్పులే అప్పులు . కష్టాలే కష్టాలే. చాలారోజుల తరువాత మిత్రుడి ఇంటికి భోజనానికి వెళ్లా. నాకోసం వెజ్ ఐటమ్స్ వాళ్ళావిడ ఎన్ని వండి పెట్టిందో? కష్టాలు కన్నీళ్ల గురించి మాట్లాడుతూ హాల్లో నా నెత్తిమీద ఏ సీ ని చూడమన్నాడు. చూశా. బాగానే ఉందన్నా. అది నిజం ఏ సీ కాదట. డమ్మీ ఏ సీ. ఖాళీగా పెడితే వికారంగా ఉంటుందని ఏ సీ ని పోలిన డమ్మీలను పెట్టించాడట. కొద్ది కొద్దిగా అప్పులు తీర్చుకుంటూ బరువు తగ్గించుకోవాలి అని కొన్నేళ్ళకు ప్రణాళిక చెప్పాడు. నాకు చాలా సేపు మాటలు రాలేదు.

మరో జర్నలిస్టు నాకంటే వయసులో పెద్దవాడు. వయసు రూల్ వల్ల రిటైర్ అయ్యాడు. డాక్యుమెంటరీలకు, యాడ్స్ కు అనువాదాలు రాస్తూ పోరాడుతున్నాడు. పిల్లలు చదివారు కానీ, ఇంకా స్థిరపడలేదు. సొంత ఇల్లు లేదు . ఇప్పటికీ సిటీ బస్సుల్లో తిరుగుతూ చిన్న చిన్న పనులు దొరికితే సంతోషిస్తున్నాడు. పిల్లలు స్థిరపడితే తను ఇంతగా తిరగక్కర్లేదు అని ఒక పబ్లిషింగ్ హౌస్ బయట రోడ్డుమీద టీ కప్పు నాకు అందిస్తూ చెప్పాడు.

లోకంలో ఉన్న కష్టాలు, కన్నీళ్లను రాయడంలో జర్నలిస్టులు నిష్ణాతులు. కానీ వారి కష్టాలు, కన్నీళ్ళనుండి బయటపడ్డంలో నిస్సహాయులు. యాజమాన్యాల కష్టాలనే మెయిన్ స్ట్రీమ్ మీడియా కష్టాలుగా గుర్తిస్తుంది. సోషల్ మీడియాలో అయినా జర్నలిస్టుల కష్టాలమీద చాలా చర్చ జరగాలి.

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్