Friday, October 18, 2024
HomeTrending NewsCaste Census: కుల గణన...రాజకీయాల్లో కొత్త సమీకరణాలు

Caste Census: కుల గణన…రాజకీయాల్లో కొత్త సమీకరణాలు

బీహార్లో కులగణన రాజకీయంగా తేనెతుట్టెను కదిలించినట్టు అయింది. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కులగణన అంశమే ప్రధానం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో చివరిసారిగా కులాల వారిగా జనాభా గణన 1931లో జరిగింది. దాని ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తోంది. బలహీన వర్గాల విషయంలో కేంద్ర ప్రభుత్వాల చిత్తశుద్ది ఏంటో ఈ విధానంతోనే అర్థం అవుతుంది.

మహిళా బిల్లు తీసుకొచ్చామని సంబరాల్లో ఉన్న బిజెపికి తాజా పరిణామాలు శరాఘాతమే. మహిళా బిల్లుపై మొదట బిజెపికి ప్రశంసలు వచ్చినా…ఓబీసీ కోటా పెట్టకపోవటం, 2026 నుంచి అమలు తదితర కోర్రీలతో ఆయా వర్గాల్లో బిజెపి మీద భ్రమలు తొలగుతున్నాయి.

మహిళా బిల్లుకు ప్రత్యామ్నాయంగా కుల గణన అంశం ఇప్పుడు విపక్ష కూటమికి అస్త్రంగా మారింది. కాంగ్రెస్, బిజెపిల రాజకీయ క్రీడలో కొత్త సమీకరణాలు తెర మీదకు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్, బిహార్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఇప్పటికే కులాల వారిగా వచ్చిన రాజకీయ పార్టీలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి.

బీహార్ లో  వికాస్ శీల ఇన్సాన్ పార్టీ (VIP) పార్టీకి ముకుల్ సాహ్నీ నాయకత్వం వహిస్తున్నారు. బీహార్ జనాభాలో 2.6 శాతంగా ఉన్న నిషాద్ సామాజిక వర్గం ప్రయోజనాల కోసం విఐపి పార్టీ పనిచేస్తోంది. బిహార్ మాజీ సిఎం జతిన్ రాం మాంజి నేతృత్వంలో  హిందూస్తాన్ అవాం మోర్చా (HAM) ముషార్ సామాజిక వర్గం అభివృద్ధి కోసం పనిచేస్తోంది. తాజా లెక్కలతో ఈ రెండు పార్టీలు పొత్తుల్లో తమ వాటా పెంచాలని బేరాలు చేయనున్నాయి. ఈ విధంగా దేశమంతా కొత్త రాజకీయ పార్టీలు ఉద్బవిస్తాయనటంలో సందేహం లేదు.

బీహార్ కులగణన సింహావలోకనం…

న్యాయస్ధానాల్లో అడ్డంకుల్ని దాటుకుని సర్వే ప్రారంభించి…పూర్తి చేసి మరి వివరాలు వెల్లడించటం కత్తి మీద సాము అనే చెప్పాలి. బీహార్ ప్రభుత్వం విడుదల చేసిన కుల సర్వే ఫలితాల్లో బీసీల జనాభా 63 శాతం ఉందని తేలడంతో ఇప్పుడు ఇదే అంశం జాతీయ స్ధాయిలో చర్చకు వచ్చే సూచనలు ఉన్నాయి.

సోమవారం ఈ మేరకు రిపోర్టును ‘బీహారీ జాతి ఆధారిత్ గణన’ పేరుతో రాష్ట్ర డెవలప్‌‌మెంట్ కమిషనర్ వివేక్ సింగ్ రిలీజ్ చేశారు.
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడం వీలుకాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో తమ రాష్ట్రంలో ఈ ప్రక్రియ చేపడతామని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ గత ఏడాది జూన్‌లో ప్రకటించారు. ఈ ఏడాది జనవరిలో కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 38 జిల్లాల్లో రెండు దశల్లో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. కులగణనను వ్యతిరేకిస్తూ పాట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయస్థానం వాటిని కొట్టివేస్తూ సర్వేకు అనుమతించింది.

తొలి దశ సర్వేలో భాగంగా.. ఇళ్లను మార్క్​ చేయడం, ఇంట్లోని కుటుంబసభ్యుల పేర్లను, ఇంటి పెద్ద వివరాలను నమోదు చేయడం జరిగింది. రెండో దశలో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చెందిన సామాజిక, ఆర్థిక విషయాలను నమోదు చేశారు. మొత్తం మీద 2.64లక్షల మంది సిబ్బంది.. బిహార్​లో ఇంటింటికీ వెళ్లి కుల గణనను నిర్వహించారు. ఉద్యోగం, విద్య, మారిటల్​ స్టేటస్​, భూమి ఉందా? లేదా? ఆస్థులు, కులం వంటి వివరాలను సేకరించారు.  గతేడాది జూన్‌ 2న కులాల ఆధారిత జనాభా గణనకు బీహార్‌ కేబినెట్‌ 500 కోట్ల రూపాయలను కేటాయించింది.

ఎలాంటి వైషమ్యాలు లేకుండా కుల గణన చేసిన తొలి రాష్ట్రంగా బీహార్ నిలవడంతో.. దేశంలోని 143 కోట్ల మంది పౌరుల కులగణన చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో.. బిహార్​ కుల గణన డేటా విడుదలవ్వడం ప్రాముఖ్యత సంతరించుకుంది.

నితీశ్ కుమార్ సర్కార్ ఇవాళ బీహార్లో అఖిలపక్ష భేటీ నిర్వహిస్తోంది. కులాల సర్వే ఫలితాలపై చర్చించేందుకు రావాలని విపక్షాల్ని ఈ భేటీకి ఆహ్వానించింది. తద్వారా ఎన్డీయేను మరింత ఇరుకునపెట్టేందుకు సిద్దమైంది. ఇవాళ నితీశ్ నిర్వహిస్తున్న భేటీకి వెళ్తే ఓ సమస్య, వెళ్లకపోతే మరో సమస్య అన్నట్లుగా బీజేపీ పరిస్ధితి తయారైంది.

మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం.. మరికొన్ని రోజుల్లో తమ రాష్ట్రంలో కూడా కుల గణనను చేపట్టబోతుందని తాజా పరిస్థితుల ద్వారా తెలుస్తోంది. తమిళనాడులో డి.ఎం.కే ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. సిఎం ఎంకే స్టాలిన్ త్వరలోనే కుల గణన సర్వేపై విధానపరమైన నిర్ణయం తీసుకోనున్నారు. అటు ఆంద్రప్రదేశ్లో కులగణన చేపడతామని సిఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇందుకోసం మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు.

సిఎం కెసిఆర్ ద్వంద వైఖరి 
తెలంగాణ విషయానికొస్తే.. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో సీఎం కేసీఆర్.. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే పేరుతో సర్వే నిర్వహించారు. ఆ సర్వేతో కులాల వారీగా తెలంగాణ‌లో ఎన్ని కుటుంబాలున్నాయో వెల్లడైంది. కులాల జ‌నాభాపైనా ఓ క్లారిటీ వ‌చ్చింది. అయితే ఆ వివరాలను కెసిఆర్ ప్రభుత్వం బహిరంగ పరచలేదు.

దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని డిమాండ్ చేసే సిఎం కెసిఆర్ రెండు నాల్కల ధోరణి గర్హనీయం. సమగ్ర కుటుంబ సర్వే వివరాలు వెల్లడించలేదు. బిహార్ మాదిరిగా సర్వే చేపట్టేందుకు చొరవ తీసుకోలేదు. కేంద్రం చేపట్టాలని శాసనసభలో తీర్మానం చేసి బలహీన వర్గాలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

మళ్ళీ మండల్ కమిషన్ రోజులు 

బీహార్ సర్వే బిజెపికి ఇబ్బంది కరంగా మారింది. మధ్యప్రదేశ్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  దీనిపై పరోక్షంగా స్పందిస్తూ విపక్షం దేశాన్ని కులాల వారిగా చీల్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. తమ కూటమి అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా కుల గణన చేపడతామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి ప్రకటించారు. దీంతో రాజకీయ వేడి రాజుకుంది.

కేంద్రంలో కాంగ్రెస్ – బిజెపిల దోబూచులాటలో బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోంది. రాజకీయ పార్టీలు, కూటములు… విపక్షంలో ఉన్నపుడు డిమాండ్ చేయటం… అధికారంలోకి వచ్చాక విస్మరించటం ఇప్పటివరకు జరుగుతోంది. బిహార్ వ్యవహారంతో జాతీయ రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటాయి.

కులగణన చేపట్టాలని దేశవ్యాప్తంగా బిసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాయి. బీహార్ నేపథ్యంలో ఈ డిమాండ్ కోసం ఆందోళనలు కొనసాగే అవకాశం ఉంది.

1990లో ఓబీసి కోటా అంశంలో బిపి మండల్ కమిషన్ నివేదిక దేశంలో అగ్గి రాజేసింది. ఇప్పుడు కాంగ్రెస్, బిజెపిలతో పాటు ప్రాంతీయ పార్టీలు…రాజకీయ నాయకులు కుల గణన వ్యవహారంలో విజ్ఞత పాటించక పోతే అదే పునరావృతం అవుతుంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్