Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఈ నగరానికి ఏమయ్యింది?

ఈ నగరానికి ఏమయ్యింది?

No Liberty:
“జీవితం సప్తసాగర గీతం వెలుగునీడల వేదం
సాగనీ పయనం కల ఇల కౌగిలించే చోట..

ఏది భువనం? ఏది గగనం? తారా తోరణం
ఈ చికాగో సియర్స్ టవరే స్వర్గ సోపానమూ
ఏది సత్యం? ఏది స్వప్నం? డిస్ని జగతీలో
ఏది నిజమో? ఏది మాయో? తెలీయనీ లోకమూ

హే… బ్రహ్మ మానస గీతం
మనిషి గీసిన చిత్రం
చేతనాత్మాక శిల్పం
మతి కృతి పల్లవించే చోట

 Peace And Liberty

ఆ లిబర్టీ శిల్ప శిలలలో స్వేచ్చా జ్యోతులూ
ఐక్య రాజ్య సమితిలోనా కలిసే జాతులూ
ఆకసాన సాగిపోయే అంతరిక్షాలు
ఈ మయామీ బీచ్ కన్నా ప్రేమ సామ్రాజ్యమూ..

హే… సృష్టికే ఇది అందం
దృష్టికందని దృశ్యం
కవులు రాయని కావ్యం
కృషి ఖుషి సంగమించే చోట”

వేటూరి వారు అమెరికా ఎన్ని సార్లు వెళ్లారో? అసలు వెళ్లకుండానే రాశారో? తెలియదు కానీ…అమెరికా జీవితాన్ని “వెలుగు నీడల వేదం”గా సూత్రీకరించారు. ఇందులో శబ్దాలంకారాలు, ప్రాసలు అమెరికా నిర్మాణాలకంటే గొప్పగా ఉన్నాయి. కలకు- ఇలకు కళాత్మకంగా సంధి కుదిర్చారు. భువికి- దివికి నిచ్చెన వేసిన నిర్మాణాలకు అద్దం పట్టారు. సత్యమో- స్వప్నమో తెలియని డిస్ని జగతి మాయా గతికి ఆశ్చర్యపోయారు.

 Peace And Liberty

బ్రహ్మ మానస గీతానికి- మనిషి గీచిన చిత్రానికి పొత్తు కుదిర్చారు. మతికి- కృతికి పల్లవి తొడిగారు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ శిల్పంలో స్వేచ్చా జ్యోతులను ఐక్యరాజ్యసమితి నానాజాతి సమితిలో దర్శించారు. సృష్టికందని అమెరికా దృశ్యాలను చూడడానికి రెండు కళ్లు చాలవన్నారు. కృషి- ఖుషి సంగమించే అమెరికా కవులు రాయని కావ్యం అంటూనే…తెలుగులో ఇంకెవరూ ఊహించడానికి కూడా సాధ్యం కానంత గొప్పగా రాశారు.

సినిమాలో సందర్భాన్ని దాటి ఒక సార్వజనీన సత్యాన్ని, సౌందర్యాన్ని, తత్వాన్ని పట్టి మన దోసిట్లో పోసిన అక్షరాలివి. భావాలివి. కావ్యంతో సమానమయిన సౌందర్యాన్ని నింపుకున్న పాట ఇది. సాహిత్య ప్రయోజనానికి నిలువుటద్దంలాంటి పాట ఇది.

మరో సినిమాలో కూడా “యమహా నగరి కలకత్తా పురి…” అంటూ వేటూరి వారే రాసిన పాట బెంగాల్ ఔన్నత్యానికి, కలకత్తా నగర ప్రాభవానికి, బెంగాలీ సాహితీ సంపదకు ప్రతిబింబం. అది ఇక్కడ అనవసరం.

కృషి- ఖుషి సంగమించే వెలుగు నీడల న్యూయార్క్ నగరానికి ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. ఎంత చెట్టుకు అంత గాలి. ఎవరి సమస్యలు వారివి. నిద్రపోని నగరంగా అమెరికా న్యూయార్క్ కు పేరు. కోవిడ్ రెండు వేవుల్లో పర్యాటకుల తాకిడి తగ్గిన న్యూయార్క్ కు ఇప్పుడు ఒక్కసారిగా అంతర్జాతీయ పర్యాటకులు పెరిగారు.

ఆకాశం మీది నుండి న్యూయార్క్ నగరం చూడడానికి రెండు కళ్లు చాలవు. అందుకు వీలుగా మనకు రోడ్ల మీద ట్యాక్సీలు, ఆటోలు ఉన్నట్లు అక్కడ అద్దె హెలీక్యాప్టర్లు సిద్ధంగా ఉంటాయి. అర గంట, గంట పాటు నగరం మీద తిరుగుతూ ఊరి అందాలను చూపించే ఈ టూరిస్ట్ హెలీక్యాప్టర్లకు విపరీతమయిన డిమాండు. ఇవి కాక ట్రాఫిక్ చిక్కులు దాటుకుని హాయిగా రెక్కలు కట్టుకుని ఆకాశంలో ఎగిరిపోయే సంపన్న న్యూయార్క్ వాసులకు కూడా కొదువ లేదు. దాంతో రోజూ కొన్ని వందల ట్రిప్పులు హెలీక్యాప్టర్లు న్యూయార్క్ నగరం మీద ఎగురుతుంటాయి.

యాభై అరవై అంతస్థుల నివాస భవనాల అపార్ట్ మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్ లు అక్కడ సహజం. ఇలా నిమిషానికో హెలీక్యాప్టర్ తమ భవనాల మీద వెళుతుంటే ఆ చప్పుడుకు భవనాలు కంపిస్తున్నాయి. కిటికీల అద్దాలు పగులుతున్నాయి. చెవులు చిల్లులు పడుతున్నాయి. గుండెలు లయ తప్పుతున్నాయి. గాలి కలుషితమవుతోంది. రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు.

నగరంలో టూరిస్ట్ హెలీక్యాప్టర్లను నియంత్రించాలని గత సంవత్సరం న్యూయార్క్ వాసులు ఉద్యమం మొదలు పెట్టారు. ఈ సంవత్సరం ఆ ఉద్యమం మరింత తీవ్రమయ్యింది.

ఇప్పుడు వేటూరి లేరు. ఉండి ఉంటే…
న్యూయార్క్ నగరవాసుల బాధను కూడా కవితాత్మకంగా చెప్పి ఉండేవారు.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

అమెరికా గన్ కల్చర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్