Friday, April 19, 2024
HomeTrending Newsఆర్ధికంగా ఏ ఇబ్బందీ లేదు, రాదు: బుగ్గన

ఆర్ధికంగా ఏ ఇబ్బందీ లేదు, రాదు: బుగ్గన

గత ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పుల వల్లే నేటికీ ఆంధ్రప్రదేశ్ కు తిప్పలు ఎదురవుతున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై మాజీ మంత్రి, టిడిపి నేత యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలకు స్పందించిన బుగ్గన  ఓ ప్రకటన విడుదల చేశారు. ‘అప్పులపై మీ ‘అంచనా’లు తలకిందులైనా మీ అసత్య ప్రచారం ఆపరా?’ అంటూ యనమలను ఉద్దేశించి ప్రశ్నించారు.

ఎఫ్ఆర్బీఎం, కేంద్రం, కాగ్ లను మించి..ఆర్ధిక వ్యవస్థకు సంబంధం లేనివాళ్ళు టీడీపీ ఆస్థాన ఆర్థిక నిపుణులా అంటూ ప్రశ్నించారు. 2021 -22 కాలంలో  15వ ఆర్ధిక సంఘం ద్రవ్యలోటు పరిమితిని 4.5% విధిస్తే,  కోవిడ్ విధి వైపరీత్యంలోనూ వైసీపీ ప్రభుత్వం కేవలం 2.1 % మాత్రమే అప్పు చేసిందని వెల్లడించారు. మొత్తం 1,85,000 కోట్ల రూపాయలు డీబీటీ పద్దతిలో పారదర్శకంగా సాయం చేయగా, అందులో సుమారు రూ.1,35,000 కోట్లు (73%) బీసీ, ఎస్సీ, ఎస్టీ,  మైనారిటీలు లబ్ధిదారులుండడం వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వమున్నంత వరకూ రాష్ట్ర ఆర్థిక నిర్వహణకు ఏ ఇబ్బంది లేదు..రాదని బుగ్గన స్పష్టం చేశారు.

బుగ్గన ప్రకటనలో ముఖ్యాంశాలు:

  • 25 ఏళ్ళ అనుభవం అంటూ యనమల గారు అసత్యాలు చెబుతుంటే, 40 ఏళ్ళ అనుభవమున్న చంద్రబాబు ఏపీ ప్రజలకు తన జోస్యాలతో తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు.
  • స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి 2014 వరకు (1956-2014) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.1,20,556 కోట్లు.
  • ఆ తర్వాత విభజన అనంతరం వచ్చిన తెలుగుదేశం తన ఐదేళ్ల వ్యవధిలో రూ.2,69, 462 కోట్లు.
  • దీనర్థం, 58 ఏళ్ల సంవత్సరాల్లో వివిధ ప్రభుత్వాల అప్పు కంటే మీ ఐదేళ్ల హయాంలో చేసిన అప్పు 124 శాతం పెరుగుదలా కాదా అని అడుగుతున్నాను.
  • అడ్డదిడ్డంగా మీరు అప్పులు చేసినా, వాటిని చక్కదిద్దుకుంటూ, పేరుకుపోయిన బకాయిలను మా ప్రభుత్వంలో కోవిడ్ విపత్తును ఎదుర్కొంటూనే బాధ్యతగా చెల్లిస్తూ మార్చి,2022 నాటికి వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ 3,82,165 కోట్లు.
  • 2019 తో పోల్చితే వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పు  కేవలం 42 శాతం పెరిగింది.
  • కాంట్రాక్టర్ లకు చెల్లించకుండా అనకొండలా, గుదిబండలా రాష్ట్ర ప్రజల గుండెలపై పెట్టిన రూ.40,000 కోట్ల పై చిలుకు బకాయిల గురించి చెప్పరేం?
  • పౌర సరఫరా శాఖ పేరుతో వేల కోట్లు రుణాలు తీసుకొని చివరి నిముషం లో పసుపు కుంకుమ పేరుతో దారి మళ్లించడం నిజమే కాదా?
  • విద్యుత్ రంగాన్ని విచక్షణ మరచి రూ.50వేల కోట్ల రుణంతో వినాశకానికి కారణమెవరో పలకరేం?
  • నీటి వసతి, మౌలిక సదుపాయాల పేరుతో చేసిన అప్పులను దారి మళ్లించి, మంచి నీళ్లలా ఖర్చు పెట్టి, అడ్డగోలుగా మాయం చేసిందెవరో వివరించరేం?
  • ఆర్బీఐ, కేంద్రం , కాగ్ లు హెచ్చరించినా రూ.17వేల కోట్లు పరిమితులు, నిబంధనలు పాటించకుండా అడ్డగోలుగా చేసిన రుణాల పరిస్థితి తెలపరేం?

అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అన్ని కార్పొరేషన్ల లోన్ వివరాలు బడ్జెట్ డాక్యుమెంట్స్ తో ఇవ్వడం జరిగిందని, ప్రతి విషయం కాగ్ కి తెలుసని ఇందులో దాపరికాలు ఏమీ లేవని బుగ్గన తేల్చి చెప్పారు.  టిడిపి దుష్ప్రచారాల వల్ల ఏదో జరిగిపోతుందనే దానికన్నా 151 సీట్లిచ్చిన ప్రజలకు జవాబుదారీతనంతో ఆర్ధిక పరిస్థితిపై వివరించి చెప్పాల్సిన బాధ్యత మాపై ఉందని అయన వెల్లడించారు.

Also Read కర్నూల్లో హైకోర్టు..కరవు సీమకు ‘న్యాయం’-బుగ్గన 

RELATED ARTICLES

Most Popular

న్యూస్