అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్తాన్ వీడే లోగా మరోసారి ఉగ్రవాదుల దాడి జరిగే ప్రమాదముందని యుఎస్ నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. కాబూల్లో టెర్రరిస్టుల దాడి, ఆ తర్వాతి పరిణామాలు చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడేన్, ఉపాధ్యక్షురాలు కమల హర్రీస్ – పెంటగాన్ అధికారులు, జాతీయ భద్రతా బృందంతో అత్యవసరంగా సమావేశమయ్యారు. అమెరికా బలగాలు, ఆఫ్ఘాన్ మిలిటరీ మిషన్ లో అమెరికాకు సహకరించిన అఫ్ఘన్లను తరలించేందుకు కాబూల్ విమానాశ్రయంలో మరింత కట్టుదిట్టమైన భద్రత అవసరమని పెంటగాన్ దేశాధ్యక్షుడికి సూచించింది.
ఇసిస్ ఉగ్రవాదుల దాడులు, మరిన్ని దాడులకు ముప్పు పొంచి ఉన్నా ప్రతి రోజు కాబూల్ నుంచి వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. ఈ నాలుగు రోజులు అమెరికా సైనికులు, నాటో బలగాలకు సహకరించిన అఫ్ఘనీలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ దఫా జరిగే దాడికి కారు బాంబు లేదా మరో రకంగా విరుచుకు పడే ప్రమాదం ఉంది.ఈ నెల 31వ తేదీతో అమెరికా, నాటో బలగాలు ఆఫ్ఘన్ నుంచి పూర్తిగా వైదొలగనున్నాయి. ఫ్రాన్స్ శుక్రవారం నుంచే కాబూల్ కు విమాన రాకపోకల్ని నిలిపి వేసింది.
కాబూల్ విమానాశ్రయం వద్ద ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన జంట దాడుల్లో ఇప్పటివరకు 12 మంది అమెరికా సైనికులు మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. యుఎస్ మేరైన్స్ కాకుండా 35 మంది ఇతరులు ప్రాణాలు కోల్పోయారు. మొదటి దాడి కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద చోటుచేసుకోగా రెండోది విమానాశ్రయం దగ్గరలోని బారన్ హోటల్ వద్ద జరిగింది.