Friday, October 18, 2024

ధీర చోరులు

What a Stole: ‘చోరత్వం’ కూడా ఒక కళ కాబట్టి ఈ చోర కళను పారంపర్యంగా, వంశానుక్రమంగా సాధన చేసే వారుంటారు. ఇలా తరతరాలుగా కళను విడువకుండా సాధన చేసే వారిలో ఒక్కో తరం వారు ఒక్కో విధంగా  అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఘరానా చోరులుగా చలామణి అవుతారు.

ఇక కొత్తగా ఆ కళను సాధన చేసేవారు నూతన పంథాల్లో వెళుతూ ‘చిక్కకుండా, దొరక్కుండా’ జనాన్ని కొల్లగొడుతుంటారు.

ఇక ఈ చోరులలో చాలా రకాలుంటారు. జేబు దొంగలు, చిల్లర దొంగలు, దారి దోపిడీ గాళ్ళు, చీకటి దొంగలు, బందిపోట్లు.. ఇలా రకరకాలు. వీరంతా సంప్రదాయ చోరులు.  వీరిలో ఒక్కొక్కరి సాధన ఒక్కో విధం.

ఆర్ధిక లావాదేవీలు అంతర్జాలంలో పడ్డాక పుట్టుకొచ్చిన ‘సైబర్ దొంగలు’;  పారిశ్రామిక రుణాల పేరుతో బ్యాంకుల పుట్టిముంచే విద్యలో ఆరితేరిన ‘కార్పోరేట్ దొంగలు‘;  ప్రపంచం అంతా ప్రజలది, ప్రజల ఆస్తి అంతా ప్రజాసేవకులమైన మనది..మనం ఏమి చేసినా అది ప్రజలకోసమే అనే ‘రాజకీయ తత్వాన్ని’ జీర్ణించుకుని ప్రజాసేవకు పోటీ పడే ప్రజాధన చోరులు….

కాదేదీ పన్నుకు అనర్హం అంటూ అయిన దానిపై, కానిదానిపై పన్ను వేసి జనాన్ని పీక్కు తినే ‘ప్రభుత్వ పన్ను చోరులు’ పుట్టుకొచ్చిన తరువాత, వీరి చోర కళా సాధన చూసిన తరువాత… కళల కాణాచులే ముక్కున వేలేసుకొని.. ఆ ‘సంప్రదాయ చోరులే నయం రా నాయనా’ అని నిట్టూర్చాల్సిన పరిస్థితి..

‘ధనం మూలం ఇదం జగత్’ కాబట్టి.. లోకంలో జనాలు నానా కష్టాలు పడి.. ఇతరులను నానా కష్టాలు పెట్టి.. ధనం సంపాదించి నాలుగు రాళ్ళు వెనకేద్దామని నానా ప్రయత్నాలు చేస్తుంటారు.

ఈ సంపాదన యావలో.. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలకు తాము గురై,  తన పక్కవాళ్లనుకూడా గురి చేస్తుంటారు. ధనం సంపాదిస్తారు. ఇంట్లోనో, బ్యాంక్ లోనో దాచుకొంటారు..

మూఢ జహీహి ధనాగమతృష్ణాం
కురు సద్బుద్ధిమ్ మనసి వితృష్ణామ్ |
యల్లభసే నిజ కర్మోపాత్తం
విత్తం తేన వినోదయ చిత్తమ్||

.. అని ఆదిశంకరులు చెప్పినట్లు, అన్నీ ఇడుములకు కారణమైన ఈ “ధనాగమ తృష్ణ” ను జనానికి వదిలించడానికి..  ఈ ధనాన్ని దోచుకొని..  జనాలకు జీవితం పై విరక్తి కలిగించాలని ఈ నవీన చోరులు ప్రయత్నం చేస్తుంటారు.

సంప్రదాయ చోరుల చోరత్వం “బ్రతుకు తెరువు” కోసమైతే…. ఈ నవీన చోరుల చోరత్వం “జనం మంచి” కోసం… ఇది “అసత్యమే” అయినా నమ్మక తప్పదు.

Iron Bridge

ఈ నవీన చోరులకు ప్రజలమీద విపరీతమైన జాలి, దయ.

ఈ భూమి మీద మానవుడి గా పుట్టిన తరువాత.. బ్రతుకుని వెళ్లదీయడానికి నానా పాపాలు చేయక తప్పదు.. చేసిన తప్పులకు “చచ్చి” యమ ధర్మరాజు ముంది “చేతులు కట్టుకొని, తల వంచుకొని” నిలబడకా తప్పదు. చిత్రగుప్తుడు మన పాపాల చిట్టా చదివాక..

యమధర్మరాజు ఏ “కుంభీ పాకమో”, “క్రిమి భోజనమో”, శూల ప్రోతమో, “అసి పత్రమో”, “వజ్ర కంటకమో” అంటూ శిక్ష వేస్తే.. ఒక్కసారిగా వాటిని జనం భరించలేరని..

ఈ నవీన చోరులు… ఆ శిక్షలు ఎలా ఉంటాయో, వాటిని ఎలా భరించాలో ఇక్కడే నేర్పుతుంటారు.

ముఖ్యంగా “ప్రజాసేవ చోరులు” పెట్టె కష్టాలు తట్టుకొని, వేసే శిక్షలు భరించి బ్రతికి బట్ట కట్టిన వాడు…

రేపు చచ్చిన తరువాత నరకంలో వేసే శిక్షలు చూసి “కడుపు ఉబ్బ” నవ్వి చావవలసిందే.

ఇక ఈ “నవీన చోరుల” శకం మొదలైన తరువాత… వెనక బడ్డ “సంప్రదాయ చోరులు” తమ ఉనికి నిరూపించుకోవడానికి “బీహార్” లో ఈ మధ్య ఓ ఘరానా దొంగతనం చేశారట. “ప్రభుత్వ అధికారులం” అని చెప్పి.. పట్టపగలే ఓ అరవై అడుగుల పాత ఇనప బ్రిడ్జ్ ని “కత్తిరించు” కుని.. ఎత్తుకు పోయారట. కత్తిరించడం, ఎత్తుకుపోవడం.. సదరు “ప్రభుత్వం” వారికి కామనే కాబట్టి.. జనం కూడా చక్కగా సహకరించారట. తరువాత ఇది “ప్రభుత్వ దొంగల” పని కాదని.. “సంప్రదాయ దొంగల” పని అని తెలిసి నాలుక్కర్చుకొన్నారట. చివరకు.. ఎవడో ఒకడు, ఏ దొంగ ఎత్తుకుపోతే ఏముందిలే అని.. మనసు కుదుట పరచుకొన్నారట.

Iron Bridge

కానీ తనకు దక్కాల్సింది ఎవరో ఎత్తుకు పోతే “ప్రభుత్వం” ఊరుకుంటుందా.. పాత ఇనుము లో  తన వాటా తేల్చుకోవాడానికి “గాలింపు” చేస్తోందట. పట్టుకొని పాత ఇనుము మారకం చేసి తీసుకొని, తిన్న “ఉల్లిపాయలు” కక్కిస్తుందేమో!!

-శ్రీ వెంకట సూర్య ఫణి తేజ

ఇవి కూడా చదవండి: 

తెలుగు అకాడెమీలో దొంగలు పడ్డారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్