ప్రపంచంలో యువత అధికంగా ఉన్న దేశంగా, జనాభా పరంగా ప్రపంచంలోనే మొదటి స్థానం అద్భుత విజయాలతో దూసుకు వెళుతోందని, ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని, ఈ పయనంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచానికి నాయకత్వం వహించే దశలో మన పయనం తిరుగులేనిదని పేర్కొన్నారు. 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగుతామని పిలుపు ఇచ్చారు. ఓ స్పష్టమైన విజన్ తోనే ఇది సాధ్యపడుతుందన్నారు. హైదరాబాద్ లోని తన నివాసంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి మిఠాయిలు పంచారు. సామాజిక మాధ్యమాల ద్వారా తన శుభాకాంక్షలను, సందేశాన్ని తెలియజేశారు.
రాష్ట్రం అభివృద్ధి చెందితే భారతదేశం అభివృద్ధి చెందుతుందని, గ్రామ స్థాయి నుంచి విప్లవాత్మక మార్పులతో అభివృద్ధి సాధ్యమైనప్పుడే ఒక దేశంగా సమున్నత ప్రగతిని సాధించగలమని అభిప్రాయపడ్డారు. భారతదేశ అభివృద్ధిలో తెలుగు వారి పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని, జాతి కోసం 2047 కోసం ఒక విజన్‌ని రూపొందిస్తూ ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగు వేద్దామని విజ్ఞప్తి చేశారు.