Friday, September 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపొయ్యేముందు విల్లు రాసిపెట్టే కంపెనీలు

పొయ్యేముందు విల్లు రాసిపెట్టే కంపెనీలు

పాంచభౌతికము దుర్భరమైన కాయం బిదెప్పడో విడుచుట యెఱుకలేదు,
శతవర్షములదాఁక మితముఁ జెప్పిరి కాని,
నమ్మరాదామాట నెమ్మనమున
బాల్యమందో; మంచి ప్రాయమందో, లేక
ముదిమియందో, లేక ముసలియందొ,
యూరనో, యడవినో, యుదకమధ్యముననో,
యెప్పుడో యేవేళ నే క్షణంబొ?

మరణమే నిశ్చయము, బుద్ధిమంతుఁడైన
దేహ మున్నంతలో మిమ్ముఁ దెలియవలయు,
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!”

భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం- పంచభూతాలతో నిర్మితమైన ఈ దేహంలో ప్రాణం ఏ క్షణాన పోతుందో ఎవరూ నమ్మకంగా చెప్పలేరు. వందేళ్ల ఆయుస్సు అని ప్రమాణం చెప్పారు కానీ…ఆ మాటను నమ్మడానికి వీల్లేదు. బాల్యంలోనో, ప్రాయంలోనో, వార్ధక్యంలోనో…ఊళ్లోనో, ఇంట్లోనో, అడవిలోనో, నీళ్లల్లోనో, ఎప్పుడో ఏ క్షణమో మరణమొక్కటే నిశ్చయం అని నృసింహ శతకంలో కవి శేషప్ప తేల్చి చెప్పేశాడు.

“ఇల్లు ఇల్లంటావు!
ఇల్లాలు అంటావు!
నీ ఇల్లు ఎక్కడే చిలుకా?

అల్లంత దూరాన…
వల్లకాటిలోన
నీ ఇల్లు ఉన్నదే చిలుకా!

అస్తిరమ్ములైన ఆస్తిపాస్తులకొరకు
గస్తీలు నీకేల చిలుకా?

వెళ్లిపోయెడి నాడు
వెంట ఏదీ రాదు…
కళ్లు తెరవవె
చిట్టి చిలుకా?

జబ్బ పుచ్చుక యముడు
దబ్బు దబ్బున లాగ…
తబ్బిబ్బు పడనేల చిలుకా?”
అని అనాదిగా తెలుగు తత్వం తత్వబోధ చేస్తూనే ఉంది.

“తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు
వెళ్ళిపోయెడినాడు వెంట రాదు
లక్షాధికారైన లవణమన్నమె కాని
మెరుగు బంగారంబు మ్రింగ బోడు
విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని
కూడ బెట్టిన సొమ్ము కుడువబోడు
పొందుగా మరుగైన భూమి లోపల బెట్టి
దాన ధర్మము లేక దాచి దాచి

తుదకు దొంగలకిత్తురో! దొరలకవునో!
తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు?
భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస
దుష్టసంహార నరసింహ దురిత దూర!”

వచ్చేప్పుడు ఎవరూ తల్లి గర్భంలో నుండి ధనం తీసుకురాలేదు. వెళ్లిపోయేప్పుడు వెంట తీసుకుపోలేదు. లక్షాధికారైనా అన్నం మెతుకులే తినాలి కానీ…బంగారపు మెతుకులు తినలేడు. తినకూడదు. నానా గడ్డి కరచి; వేళకు తినీ తినక…డబ్బు కూడబెట్టి విర్రవీగడమే తప్ప…ఆ ధనాన్ని తినలేడు. దాన ధర్మాలు చేయకుండా దాచి…దాచిన సొమ్ము చివరకు ఆదాయపుపన్ను వారికో, దొంగలకో చేరుతుంది- తేనె తుట్టెలో తేనెటీగలు పెట్టుకున్న తేనెను పొగబెట్టి తేనెటీగలను తరిమి…దారిన పోయేవారు అనుభవించినట్లు అని కూడా కవి శేషప్పే తేల్చి చెప్పాడు.

1992 ప్రాంతాల్లో ఆంధ్రప్రభ హైదరాబాద్ విలేఖరి వై. శ్రీనివాసరావు “మరణానంతరం(After Death)” అని ఉస్మానియాలో పి హెచ్ డి చేస్తున్నప్పుడు ఆయనతో అప్పుడప్పుడు మాట్లాడే అవకాశం దొరికింది. ఒకానొక శతావధాని అవధానంలో ఆశువుగా చెప్పిన పద్యాల్లో ఎన్ని ఛందో భంగాలున్నాయో! ఎన్ని దుష్ట సమాసాలున్నాయో! వివరిస్తూ ఆయన ఒక సమీక్ష రాశారు. ఆ వార్తను పట్టుకుని ఆయన్ను కలిశాను. చాలా ఏళ్లపాటు సాహిత్య విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. ఆయన పి హెచ్ డి పూర్తయ్యిందో లేదో నాకు తెలియదు. అందులో ప్రారంభ వాక్యాలు నాకోసారి వినిపించారు.

“మనిషి బతికి ఉండగా చావు గురించి ఆలోచించడానికి భయపడతాడు. భయపడుతూ చస్తాడు. చచ్చినవాళ్లను చూసి…ఏడుస్తాడు. తను చావకుండా ఎప్పటికీ బతికి ఉంటానన్నట్లు అనుకుంటూ…బతికి ఉండగా విప్పాల్సిన చిక్కుముళ్లను విప్పకుండా…చచ్చాక ఆ ముళ్లు మరింత గజిబిజి అయ్యేలా…ఒక క్షణాన ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోతాడు…”

ఇవీ ఆ ఉపోద్ఘాతం వాక్యాలు. అయితే ఆయన పరిశోధన ఆ చిక్కుముళ్ల గురించి కాదు. మరణాంతరం మనిషి ఏమవుతాడు? ఆత్మ ఏమవుతుంది? లాంటి లోతైన అంశం. వై. శ్రీనివాస రావు ఈమధ్యే పోయారు.

ఇలాంటి సమస్యలొస్తాయని తెలిసే ఇప్పుడు-
“చావడానికి ముందే వీలునామా(విల్లు) రాసి పెట్టి…హాయిగా, నిష్పూచీగా, ప్రశాంతంగా, నిర్వివాదంగా కన్ను మూయండి!”
అని చెబుతూ ఆ వీలునామాలు రాసిపెట్టడానికి ఆన్ లైన్ సర్వీసులొచ్చాయి.

వేర్ దేర్ ఈజ్ నో విల్;
దేర్ ఈజ్ డిస్ప్యూట్;
(వీలునామా రాసుకోలేదా?
వివాదంలో పడ్డట్టే)
వెంటనే మమ్మల్ను సంప్రతించండి.
నోటరీకి – 4,999/-
రిజిస్ట్రేషన్ కు – 14,999/-

“మీరు పోయాక మీ పిల్లలు మీ ఆస్తులకోసం జుట్లు పట్టుకుని…గోడలకు కొట్టుకుని…లాయర్లను పెట్టుకుని…కోర్టులను పట్టుకుని…నెత్తీ నోరూ కొట్టుకుని...ఉన్నది లీగల్ లిటిగేషన్ లో హారతి కర్పూరంలా కరిగిపోకుండా…మాదగ్గర విల్లు రాయించుకోండి! గుండెల మీద చేయి వేసుకుని…నెత్తిన తడి గుడ్డ వేసుకుని హాయిగా పోండి!”
అని ఆసాన్ భాషలో సామాన్యులకు కూడా అర్థమయ్యేలా “ఆసాన్ విల్” ఆన్ లైన్ సర్వీసెస్ ప్రకటన పిలుపునిస్తోంది!
ఆపై…మీ ఇష్టం!

“మరణం నా చివరి చరణం కాదు
మౌనం నా చితాభస్మం కాదు
మనోహరాకాశంలో విలపించే
చంద్రబింబం
నా అశ్రుకణం కాదు…”
అని మా జగిత్యాల అగ్నికణం అలిశెట్టి ప్రభాకర్ రాసిండురా బై! అంటే ఆసాన్ విల్ వాళ్లు
“మరణం మీ చివరి చరణమే…
మౌనం మీ చితాభస్మమే…”  అశ్రుకణాలతో మౌనంగా విల్లు రాసుకుని పొండి! అంటారేమో!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

పమిడికాల్వ మధుసూదన్ విశ్లేషణల కోసం ఫాలో అవ్వండి
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్