తెలంగాణ రాష్ట్రంలో గురువారం వరకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని పేర్కొంది. నైరుతి ఆవర్తనం, దాని పరిసరాల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో కొనసాగుతున్నదని వివరించింది. ఈ కారణంగా వర్షాలు ఉండవచ్చని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. బుధవారం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.
గురువారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నదని వివరించింది. గడిచిన 24 గంటల్లో వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 163.3 మి.మీ వర్షపాతం నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ సమాచారం ప్రకారం.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 28.5 మి.మీ వర్షపాతం నమోదైంది. మరోవైపు ఏపీలోనూ రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. ఏపీ, యానాంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నట్లు అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.