ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి మంత్రివర్గంలో పనిచేసి ఎన్నికల ముందర సమాజవాది పార్టీలో చేరిన బిజెపి నేతలకు తాజా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లభించింది. మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య కుశినగర్ జిల్లా ఫజిల్ నగర్ నియోజకవర్గం నుంచి ఎస్పి తరపున బరిలోకి దిగుతున్నారు. ఇంకో మాజీ మంత్రి అభిషేక్ మిశ్రా లక్నో నగరంలోని సరోజినీ నగర్ స్థానం నుంచి పోటీ చేసేందుకు అఖిలేష్ యాదవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సరోజినీ నగర్ స్థానంలో అబిషేక్ సింగ్ ఎస్పి తరపున రాజేశ్వర్ సింగ్ బిజెపి తరపున డీ కొనబోతున్నారు.
అయితే యుపి మహిళా సంక్షేమ శాఖ మంత్రి స్వాతి సింగ్ కు బిజెపి నాయకత్వం ఈ దఫా టికెట్ నిరాకరించింది. యుపి బిజెపి ఉపాధ్యక్షుడుగా ఉన్న స్వాతి సింగ్ భర్త దయాశంకర్ సింగ్ కూడా పార్టీ నాయకత్వం టికెట్ ఖరారు చేయలేదు. తనకు పార్టీ ఈ దఫా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదని, తానూ పార్టీలో ఓ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తానని స్వాతి సింగ్ ప్రకటించారు. స్వాతి సింగ్ ఇప్పటివరకు సరోజినీ నగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా ఈ దఫా ఎన్ఫోర్సుమేంట్ డైరెక్టరేట్ జాయింట్ డైరెక్టర్ గా పని చేసిన రాజేశ్వర్ సింగ్ కు పార్టీ నాయకత్వం అవకాశం ఇచ్చిందని దయాశంకర్ సింగ్ తెలిపారు. లక్నోలో తొమ్మిదికి తొమ్మిది సీట్లు బిజెపి గెలుస్తుందని దయాశంకర్ అన్నారు.
మరోవైపు కౌశాంబి జిల్లా సిరాతు నియోజకవర్గం నుంచి కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ సోదరి పల్లవి పటేల్ సమాజ్వాది పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. సిరాతులో యుపి ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య బిజెపి నుంచి బరిలో ఉన్నారు.
Also Read : అగ్రనేతల నామినేషన్లు