తిరుమల కొండల్లో ప్రత్యేకించి నడక మార్గంలో భక్తులు రాళ్ళ మీద రాళ్ళు పెట్టడం ఎప్పుడు మొదలయ్యిందో! అదొక ఆచారంగా మారడానికి ప్రమాణాలేమిటో! తెలియదు. కానీ…అలా “రాళ్ళమీద రాళ్ళు పేరిస్తే…ఇల్లు మీద ఇల్లు కడతారు” అన్న నమ్మకం దశాబ్దాలుగా ఉంది.
అదే దారిలో కొన్ని వందలసార్లు నడిచి తిరుమల కొండల్లో అణువణువును తన పదాల్లో ఒక చిత్రంగా, దృశ్యంగా, చరిత్ర డాక్యుమెంట్ గా రికార్డ్ చేసిన అన్నమయ్య ఈ రాళ్ళమీద రాళ్ళు పేర్చడాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు కాబట్టి…అప్పటికి ఈ నమ్మకం ఉన్నట్లు లేదు. తిరుమల పురాణాల్లో కూడా ఎక్కడా ఈ విషయం లేదు.
కాలాన్ని బట్టి ధర్మం మారినట్లే…భక్తుల అవసరాలు, కోరికలు, డిమాండ్లను బట్టి నమ్మకాలు కూడా మారుతుంటాయి. పెరుగుతుంటాయి. కోట్లమందికి సొంత ఇల్లు ఒక కల. ఎవరిని అడిగితే ఇంకెవరి ముందూ చేయి చాచాల్సిన అవసరం రాదో…అలాంటి దేవదేవుడి ముందే చేయిచాచి అడుక్కో! నీ ఏడుపేదో ఈ పాడులోకం ముందు ఎందుకేడుస్తావు? ఆ దేవుడిముందే ఏడు– ఆయనే నీ తాపత్రయాలను తీరుస్తాడు- అన్నది భక్తిలో పరమ ప్రామాణికమైన సిద్ధాంతం.
అలా స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ళు దాటి వంద వైపు పరుగులు పెడుతున్న వికసిత్ భారత్ లో నిలువ నీడలేనివారు కోట్లల్లో ఉంటారు. అందరికీ ఇళ్ళ హామీని ప్రతి ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రతి పార్టీ పెడుతూనే ఉంటుంది. ప్రతి ఏటా ప్రతి రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు లక్షల్లో, కోట్లల్లో పెరుగుతూనే ఉంటారు.
తిరుమల కొండల్లో రాళ్ళమీద రాళ్ళు పేర్చినవారిలో ఎందరు ఇళ్ళమీద ఇళ్ళు కట్టారో! టీ టీ డి దగ్గర లెక్కలు ఉండకపోవచ్చు. అలా వారి కోరిక నెరవేరి ఉంటే అంతకంటే కావాల్సింది ఏముంది?
“…గగనపు పుణ్యలోకాలు నీ దరిమేడలు;
మొగి నీచుట్టు మాకులు మునులోయమ్మా…”
అని మన సాధారణ మాంసనేత్రాలతో చూడలేని తిరుమల కొండల్లో కొలువైన పుణ్యలోకాల మేడలను, చెట్లల్లో మునులను అన్నమయ్య చూడగలిగాడు. మనకు ఆ దర్శనం చేయించాడు. ఆ కోణంలో పుణ్యలోకాల మేడల మధ్య కలల మేడలు రాళ్ళమీద రాళ్ళతో కట్టినా పుణ్యమేనేమో! ఆ చెట్లలో దాగిన మునుల ముందు మన కలలను పేర్చితే నిజంగానే వాటిని నెరవేర్చే బాధ్యతను ఆ మునులు తీసుకుంటున్నారేమో!
“పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి
తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః”
భక్తితో ఆకు, పువ్వు, పండు, నీళ్ళు…ఏమిచ్చినా తీసుకుంటాను. వాటికి ప్రతిఫలమిస్తాను- అని సాక్షాత్తు భగవంతుడే స్పష్టంగా ఆన్ రికార్డ్ బహిరంగంగా చెప్పాడు.
ఇక్కడ భక్తులు భక్తితో నాలుగు రాళ్ళిస్తున్నారు- దేవుడు తమ ఇంటి పునాదికి నాలుగు రాళ్ళు వేయకపోతాడా! అని.
దేవుడితో మనదెప్పుడూ సప్లై డిమాండ్ వ్యాపారమే కదా! లిటరల్ గా దేవుడికి నాలుగు రాళ్ళిచ్చి…నాలుగు రాళ్ళు వెనకేసుకుందామనే మన ఆర్తిలోనుండి ఈ నమ్మకం ఒక ఆచారంగా మారినట్లుంది!
-పమిడికాల్వ మధుసూదన్
998909018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు