Sunday, June 14, 2026
HomeTrending Newsధరణి రద్దు చేయాలి - తెలంగాణ కాంగ్రెస్

ధరణి రద్దు చేయాలి – తెలంగాణ కాంగ్రెస్

ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తో భేటీ అయిన టీ కాంగ్రెస్ ప్రతినిధుల బృందం. భూమి, వ్యవసాయ, రైతు సమస్యలపై సిఎస్ తో సమావేశమైన టీపీసీసీ బృందం  వినతిపత్రం సమర్పించింది. వివిధ అంశాల్ని ప్రస్తావించిన కాంగ్రెస్ నేతలు… తెలంగాణలో భూ సమస్యలు పరిష్కరించాలని మెమోరండం అందజేశారు.  ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ,సీఎల్పి నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే లు జగ్గారెడ్డి, సీతక్క, వర్కింగ్ ప్రసిడెంట్స్ అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, అజారుద్దీన్, కిసాన్ కాంగ్రేస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, మాజీ మంత్రులు నాగం, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, ప్రసాద్ కుమార్, మాజీ ఎంపీలు బలరాం నాయక్, మల్లు రవి, రాములు నాయక్ పలువురు నేతలు పాల్గొన్నారు.

అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు…
రైతుల కష్టాలు, సమస్యలను సీఎస్ కు వివరించాం. కూర్చోవడానికి సచివాలయం లేదు, కలవడానికి సీఎం లేడు. వివిధ సామాజిక వర్గాల సమస్యలపై కొట్లాడుతున్న సంఘాలకు ఎనిమిదేళ్లుగా సీఎం దర్శనం కలగలేదు. సీఎం ప్రజలకు అందుబాటులో ఉండాలి. సమస్యలపై దృష్టి సారించాలి. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్నది ప్రభుత్వం కాదు. సీఎం ప్రజల ఆస్తుల వివరాలను ప్రయివేటు కంపెనీలకు దారాదత్తం చేశారు. వ్యక్తుల ఆస్తుల వివరాల సమాచారం రహస్యంగా ఉంచాలి. కానీ ప్రయివేటు వ్యక్తులకు, కంపెనీలకు చేతుల్లోకి వెళ్లి దుర్వినియోగం అవుతోంది. వారిపై చర్యలు తీసుకోవాలని సీఎస్ కు వివరించాం. 24లక్షల ఎకరాల భూముల వివరాలు ధరణిలో కనిపించడం లేదు.

తక్షణమే భూ సమస్యలను పరిష్కరించాలి. ధరణితో రాష్ట్ర ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతోంది. ప్రభుత్వం తక్షణమే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పోడు భూముల పట్టాలు ఇవ్వకుండా కమిటీలతో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములకు పట్టాలివ్వాలి. తక్షణమే ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 24న మండల కేంద్రాల్లో రెవెన్యూ కార్యాలయాల వద్ద నిరసన తెలుపుతాం. ఈ నెల 30న ధరణి బాధితులతో నియోజకవర్గాల్లో నిరసన చేపడతాం. డిసెంబర్ 5న జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల వద్ద ధర్నా చేపడతాం.

ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో టీఆరెస్,బీజేపీ వివాదాలు సృష్టిస్తున్నాయి. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు. దాడులు, ప్రతిదాడులతో గందరగోళం సృష్టిస్తున్నారు. పెట్టుబడులను గుజరాత్ కు తరలించుకుపోయేందుకు మోదీ కుట్ర చేస్తున్నారు. ఇది తెలంగాణకు తీరని నష్టం చేకూరుస్తుంది. పంతాలు, పట్టింపులతో కేసీఆర్,మోదీ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యం. ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశంతో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular