Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంప్రకటన ఎలా ఉండకూడదో చెప్పే ప్రకటన!

ప్రకటన ఎలా ఉండకూడదో చెప్పే ప్రకటన!

Translation Errors In Ads : 

కొన్ని ప్రకటనల భావం మనకొకలా ప్రకటనమవుతుంది. వాటిని తయారు చేసినవారి భావం ఇంకోలా ఉండి ఉంటుంది. హార్లిక్స్ జగమెరిగిన పానీయం. దశాబ్దాలుగా పరిచయమున్నదే. పిల్లలు బలంగా ఎదగడానికి హార్లిక్స్ తాగాలని మొన్నటివరకు ఆ కంపెనీ ప్రకటనలు వచ్చేవి. మహిళల వెన్నెముక నిటారుగా నిలబడడానికి హార్లిక్స్ వుమెన్ కూడా వచ్చింది.

కరోనా వేళ హార్లిక్స్ తన ప్రకటనలతో తన గొయ్యి తానే తవ్వుకుంటున్నట్లుంది. హార్లిక్స్ లో ఏముంది? అన్న గొప్ప ప్రశ్నతో విడుదలయిన ప్రకటన జనానికి ఎలా అర్థమయ్యిందో ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్నట్లు లేదు.

1 . పాలల్లో ఉన్నట్లుగా
2 . పాలకూరలో ఉన్నట్లుగా
3. కమలా పండులో ఉన్నట్లుగా

హార్లిక్స్ లో పోషక విలువలు, విటమిన్లు ఉంటాయి అని తాటికాయంత అక్షరాలతో ప్రకటనను రూపొందించారు. రోజూ పాలు, పాలకూర, కమలా పండు తీసుకుంటే హార్లిక్స్ అవసరమే లేదు అన్నది ఈ ప్రకటన అర్థంగా అన్వయమవుతోంది. దీనికితోడు ఇందులో ఇంకా నిలువ ఉండడానికి ఏయే మిశ్రమాలు కలిశాయో ప్యాకెట్టు మీద చదివి తాగాలని మరో సూచన కూడా ఉంది. నిజంగా ఆ రసాయన మిశ్రమ సాంకేతిక వివరాలు ఇంతవరకు భూమ్మీద ఎవరూ చదివి ఉండరు. చదివినవారెవరూ హార్లిక్స్ తాగరు.

ఈ ప్రకటన మొదట ఇంగ్లీషులో తయారై తరువాత తెలుగులోకి అనువాదమై ఉంటుంది.
తెలుగులో-
పాలతో సమానంగా
పాలకు బదులు
పాలకు ప్రత్యామ్నాయంగా
అని చెప్పబోయి పాలలో ఉన్నట్లుగా అని గా అక్షరంతో హార్లిక్స్ ను తేల్చేశాడు. ఉండడం- గ్యారెంటీ.
ఉన్నట్లు- అపనమ్మకం.
ఉన్నట్లు- అలా అనిపించడం.
నిజంగా భాష తెలిసి, ఉండడం- ఉన్నట్లు పదాల మధ్య తేడా తెలిసి అనువాదకుడు వాడి ఉంటే ఈ అనువాదకుడి వాస్తవ అంగీకార రచనానువాదానికి రెండు చేతులెత్తి నమస్కరించాలి.

తమ యాడ్ తమనే కించపరుస్తుందని హార్లిక్స్ కు తెలిసి ఉండకపోవచ్చు. తెలిసి ఈ యాడ్ ను ఇలా ఇచ్చి ఉంటే మాత్రం – హార్లిక్స్ తాగనివారు కూడా హార్లిక్స్ కు జీవితాంతం రుణపడి ఉండాలి!

-పమిడికాల్వ మధుసూదన్

Must Read : అమూల్ ప్రకటనల్లో భాషకు నీరాజనం

RELATED ARTICLES

Most Popular

న్యూస్