Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపరభాషా పారిభాషిక పదాలు

పరభాషా పారిభాషిక పదాలు

పెద్ద పెద్ద కంపెనీల వాణిజ్య ప్రకటనలు మొదట ఇంగ్లీషులో తయారై…తరువాత ప్రాంతీయ భాషల్లోకి అనువాదమవుతాయి. ఈమధ్య గూగుల్ అనువాదం అందుబాటిలోకి వచ్చాక ఇన్ని శతాబ్దాలుగా ఎగతాళిగా ఉన్న “యంత్రానువాదం” సీరియస్ గా నిజమయిన అనువాదం హోదా పొందింది.

పారిభాషిక పదాలు – టెర్మినాలజీ సృష్టించుకోవడంలో తెలుగువారి నిర్లక్ష్యం ఎవరెస్టు కంటే ఎక్కువ. ఒకవేళ సృష్టించుకున్నా అవి జనం భాషకు సుదూరంగా అత్యంత కృతకంగా ఉండి ఉంటాయి.

ప్రాంతీయ భాషల్లో కూడా ఇంజనీరింగ్ విద్యకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది.

తరంగ దైర్ఘ్యం స్థితి స్థాపక స్థితి పొందినప్పుడు లోలకం ఉయ్యాల్లో పారిభాషిక పదాలు పరస్పర విజాతి ధ్రువాలుగా వ్యతిరేకించుకుంటున్నవేళ సాంకేతిక విద్య విద్యార్థులు ఇకపై మాతృ భాషలో ఇలా అతీన్ద్రియ భాష మాట్లాడే రోజులు రావచ్చు. ఊహ విహంగమై ఆకాశంలో ఎగురుతున్నా పాఠ్య భాష అనులోమ- విలోమమై పాతాళంలోకి కుంగిపోవచ్చు. భావన రసాత్మకమైనా భాష రసాయన ప్రతి చర్య జరిగి, ఘనీభవించి, కర్ణ కఠోర శబ్ద రసాయనం కావచ్చు.

సాంకేతిక విషయాలను తెలుగులోకి అనువదించడం కత్తి మీద సాము. అసాధ్యం కాదు కానీ…చాలా కష్టం. సహజంగా సాంకేతిక ఆవిష్కరణలను, వాటి ఉపయోగాలను ఇంగ్లీషు పరిభాషలోనే వాడేస్తున్నాం. ఇందులో పెద్దగా తప్పు పట్టాల్సింది కూడా ఏమీ లేదు. జనం వాడింది భాష. తెలుగు లిపిలో రాస్తున్నందుకు సంతోషించాలి- అంతే.

ఉదాహరణకు ఒకే రోజు ఎయిర్ టెల్ మొబైల్ కంపెనీ ఒకే కంటెంట్ ను ఇంగ్లీషు- తెలుగు పత్రికల్లో ఇచ్చిన ప్రకటన చూడండి.

Introducing Airtel black
ప్రవేశపెడుతున్నాం ఎయిర్ టెల్ బ్లాక్

Does it all, so you don’t have to.
Get mobile. DTH and fiber in one plan
మొబైల్. DTH. ఫైబర్. అన్నీ ఒకే ప్లాన్ లో.

One bill
ఒక బిల్

Dedicated relationship team
ప్రత్యేక రిలేషన్ షిప్ టీం

Priority resolution
ప్రయారిటీ రిజొల్యూషన్

Zero switching cost
జీరో స్విచింగ్ కాస్ట్trఇందులో తొంభై అయిదు శాతం లిపి మారిందే కానీ…భాష మారలేదు. ఇందులో ఉన్న డి టి హెచ్, ప్రయారిటీ రిజొల్యూషన్ లాంటి టెక్నీకల్ టెర్మినాలజీని తెలుగులోకి అనువదించాలా? వద్దా? అన్నది ఒక చర్చ. అలాగే వాడేసేయడం ఉత్తమం అన్నది మెజారిటీ అభిప్రాయం. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సి బి ఐ ని – తెలుగు పొట్టి అక్షరాల్లో కే ద స అంటున్న ఈనాడుకు మాత్రం ఇందులో వేరే అభిప్రాయం ఉండవచ్చు.

ఒకరు బతికిస్తే బతికేది; ఒకరు చంపేస్తే చచ్చిపోయేది భాష కానే కాదు. రోజూ కొత్త పదాలను భాష తనకు తాను పుట్టించుకుంటుంది. రోజూ ఇతర భాషల పదాలను కలుపుకుని నదిలా సాగిపోతూనే ఉంటుంది. ప్రవహిస్తేనే నది పవిత్రం. ప్రవహిస్తేనే నదికి ప్రయోజనం. నిలువ నీటికి విలువ లేదు. ఎంత నిలిస్తే అంత మురుగు.

ఫ్లయిట్ బోర్డింగ్ కు టైమ్ అయ్యింది. సెక్యూరిటీ చెక్ క్లోజ్ అయ్యింది. స్లీపర్ కోచ్ బస్ లేట్ గా వచ్చింది. సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. ఎంసెట్ కట్ ఆఫ్ మార్కులను ప్రకటించారు. ప్రశ్న పత్రం కీ రిలీజ్ అయ్యింది. ఇందులో చివర క్రియా పదమే ప్రధానం. అదొక్కటి తెలుగయితే మిగతాది కూడా తెలుగుగానే మారిపోతోంది. ఇందులో మంచి- చెడు మీద చర్చ చేసేవారు చేస్తూనే ఉంటారు. సామాన్య జనం హాయిగా- పరభాషా పారిభాషిక పదాలను వాడేస్తూ ఉంటారు. వారికది పరభాష కాదు. హై డెఫినిషన్లో వారి సొంత భాషే!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read:

ఇంగ్లీషులో తెలుగు ఏడుపు

Also Read:

కలుపు మొక్కలు, చిప్ప కాఫీల వికటనలు!

Also Read:

తెలుగుకు బూజు

RELATED ARTICLES

Most Popular

న్యూస్