Wednesday, July 3, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంతెలుగును తెలుగులోనే రాయాలి

తెలుగును తెలుగులోనే రాయాలి

Great Response: మొన్న ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా “తెలుగును తెలుగులో రాస్తే నేరమా?” అన్న శీర్షికతో అయిదేళ్ల కిందట ప్రచురితమయిన కథనాన్ని పునర్ముద్రిస్తే ప్రపంచం నలు మూలల నుండి తెలుగు భాషాభిమానులు స్పందించారు. ఆ లింక్ ఇది:-

తెలుగు మాట- ఇంగ్లిష్ లిపి

కొందరు ఫోన్ చేశారు. కొందరు మెసేజ్ లు పెట్టారు. కొందరు మెయిల్ చేశారు. ఒకరిద్దరు మాత్రం నేను భయపెట్టినంత తీవ్రంగా సమస్య లేదని…సామాజిక మాధ్యమాల్లో కొత్త కొత్త యాప్స్ వల్ల తెలుగు లిపి వాడకం బాగా పెరిగిందని…భవిష్యత్తులో మరింత పెరుగుతుందని…ఉదాహరణలతో వివరించారు. సంతోషం. అంతకన్నా కావాల్సింది ఏముంటుంది?

పది… పాతిక ఫోన్ల తరువాత మాట్లాడలేక… ఫోన్ ను సైలెంట్ మోడ్లో పెట్టాల్సి వచ్చింది. కాల్స్ అందుకోలేనందుకు నా క్షమాపణలు. నాకొచ్చిన కొన్ని మెసేజ్ లు ఇవి:-

“ఇది మన భావదరిద్రం సార్… తెలుగులో మాట్లాడితే చిన్నతనం అని మనకు మనమే పిల్లలకి ఉగ్గుపాలతో నేర్పిస్తున్నాం… ఆంగ్లంలో మాట్లాడితే మేధావితనం, తెలివిడి ఉందని మురిసిపోతున్నాం… ఆంగ్లంలో పచ్చి బూతు “ఫక్” అని చెప్పినా అందంగానే కనపడుతుంది.. వినసొంపుగా ఉంటుంది…. కొన్ని భావాలని అర్థం కాని భాషలో తిడితే….అది వాంతి అయినా…విన్నోడు అదే నాక్కుంటాడు అనే విదంగా ఉన్నాయి మన చదువులు, సమాజపు తీరు.. ఇప్పటికి నేను కొన్ని వందల యూట్యూబ్ వేదికలకి ఉత్తరాలు పంపించింటా… చక్కటి తెలుగులోనే చెప్పండి.. కమ్మని తీయని తెలుగులోనే భాషను పలకండి.. అని.. ఊహు.. వినేవారు లేరు.. వచ్చిరాని తెలుగు మాట్లాడడం కొత్త పంథా… స్పష్టంగా పలకలేని, భాష కమ్మదనాన్ని ఆస్వాదించలేని తరం ఇప్పటిది…మాతృభాషలో మాట్లాడే జనుల కోసం చూసి చూసి విసుగెత్తిపోయాం.. మా రోగుల్లో కొంతమంది అతి వయ్యారంగా ఆంగ్ల పదాలని పలుకుతుంటే కంపరం పుడుతుంది… ఒక్కోసారి మొహం మీదనే అడిగేస్తా.. మీ తెలుగుకి తెగులు రోగం ఎప్పటినుండి ఉంది అని…

మా వైద్యశాలలో ఒక సూచిక పెట్టానండి. ఎవరైతే 100 వేమన పద్యాలు అప్పాజెప్పుతారో వారికి చికిత్సలో 50శాతం తగ్గింపు- అని.

-డాక్టర్ హర్షవర్ధన్

Telugu Language Day

“రచయిత బాధను అర్థం చేసుకోవచ్చు. కానీ నేను ఈ మధ్య గమనించిన విషయం ఏమంటే, సోషల్ మీడియాలో తెలుగు భాష, తెలుగు లిపి ఇప్పుడు విస్తృతంగా వాడుతున్నారు. మా గ్రూప్ 1 అధికారుల కోసం ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఇంతకు ముందు 95% పోస్టులు ఆంగ్లంలో ఉండేవి. ఇప్పుడు సుమారు 80% పోస్టులు తెలుగులో ఉంటున్నాయి. చాలా మంది మిత్రులు తెలుగు లిపిని వాడుతున్నారు. ఇది చాలా గ్రూపుల్లో నేను గమనించిన విషయం. తెనుగు లిపికి ఇప్పుడు మార్కెట్లో మంచి యాప్ లు ఉన్నాయి. ఇంకొన్ని రోజుల్లో ఇంకా మంచి సాఫ్ట్వేర్ రావచ్చు. తెలుగు వాడకం అమెరికా యూరోప్ లో స్థిరబడ్డ వాళ్ళలో కూడా బాగా పెరిగింది. వాళ్ళ పిల్లలకు తెలుగు నేర్పడమే కాదు సాహిత్యం నేర్పుతున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎప్పటికీ తెలుగు జీవ భాషే, అది అమృత తుల్యం.

-ఒక ఉన్నతాధికారి

నా మనసులో మాట మీ మాటల్లో చెప్పినట్లు అనిపించింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎక్సయిడ్ బ్యాటరీల షాపు ఓనర్ ను నేను. పది వరకు తెలుగు మీడియంలో చదివి…ఒక్కసారిగా ఇంగ్లీషు మీడియంలోకి వెళ్లి…శాశ్వతంగా చదువులకు దూరమయ్యాను. పోనీ ఉన్నత చదువుల్లో తెలుగు మీడియమయినా తెలుగులా ఉందా అంటే…అదీ లేదు. అకాడెమీ పుస్తకాల నిండా కృతమమయిన, ఇనుప గుగ్గిళ్ళకంటే కఠినమయిన పారిభాషిక పదాలు ఉన్నాయి. చాలాసార్లు ఈ పుస్తకాల తెలుగు, మీడియా రాసే బాహ్యవలయ రహదారి, చరవాణి ప్రామాణిక తెలుగు కంటే ఇంగ్లిషే సులభంగా అర్థమవుతుంది”.

-బండి లక్ష్మినారాయణ రెడ్డి

“మీ వ్యాసం చదివి మీ బాధను అర్థం చేసుకున్నాను. లిపి విషయంలో తెలుగువారు మేల్కొనకపోతే చాలా నష్టపోతాం“.

-ధర్మవరపు రాంబాబు, బెంగళూరు

“నా సొంతూరు విజయనగరం. మిలటరీలో అధికారిని. ప్రస్తుతం బాధ్యతల దృష్ట్యా దేశ సరిహద్దులో పని చేస్తున్నాను. తెలుగును తెలుగు లిపిలోనే రాయాల్సిన అవసరం గురించి మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను”.

-ఒక మిలటరీ అధికారి

అన్ని మెసేజ్ లు ఇవ్వడం కుదరదు. కొందరు తెలుగు వారే అయినా ఇంగ్లీషులో మాట్లాడితే స్పందించినట్లు తెలుగులో మాట్లాడితే స్పందించని సందర్భాలను ఊళ్లు, పేర్లతో పాటు పెట్టారు. సభా మర్యాద దృష్ట్యా అవి ఇక్కడ ప్రస్తావించడం కుదరదు.

ప్రత్యేకించి ప్రవాసాంధ్రులు తెలుగు కోసం పడుతున్న తపన అంతా ఇంతా కాదు. వారి పిల్లలకు ఈ వ్యాసాన్ని తెలుగులో చదివి, ఆపై ఇంగ్లీషులోకి అనువదించి కూడా చెప్పామని కొందరు తలిదండ్రులు మెసేజ్ లు పెట్టారు. పట్టుబట్టి అమెరికాలో తమ పిల్లలకు తెలుగు పద్యాలు నేర్పుతున్నామని…మొదట పిల్లలు అయోమయంగా ఉన్నా నెమ్మదిగా అందులో శబ్ద లయ, యతి ప్రాసలు, భాష అందాన్ని ఆస్వాదిస్తున్నారని కొందరు పరవశంగా తెలియజేశారు.

కరువు కాలం దృష్ట్యా వంద వేమన పద్యాల నియమాన్ని పదికో, ఇరవై పద్యాలకో కుదించాల్సిందిగా మిత్రుడు హర్షవర్ధన్ కు ఉచిత సలహా ఇస్తూ…

తెలుగును తప్పనిసరిగా తెలుగు లిపిలోనే రాయాలని కోరుకుంటున్న ఎందరో భాషాభిమానులు. అందరికీ భాషాభినందనలు.

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్